boinpally
-
ఆస్పత్రికి తీసుకెళ్తూ.. అమ్మను రోడ్డుపైనే వదిలేశాడు
కంటోన్మెంట్: అనారోగ్యానికి గురైన అమ్మను ఓ కొడుకు ఆస్పత్రికి తీసుకెళ్తూ మార్గమధ్యంలో నడిరోడ్డుపైనే వదిలేసి వెళ్లిపోయాడు. కొడుకు కోసం రెండురోజులు ఎదురుచూసింది. ఆకలితో అలమటించింది. చివరికి ఆ తల్లి గుండె పగిలి కన్నుమూసింది. ఈ హృదయ విదారక ఘటన బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ రెడ్డి వెల్లడించిన వివరాలు... ఈ నెల 5న మేడ్చల్ నివాసి అయిన అరవింద్ అనారోగ్యంతో ఉన్న తల్లి శ్యామల(60)ను తీసుకొని ఆసుపత్రికని బయలుదేరాడు. బోయిన్పల్లి చెక్‌పోస్ట్ సమీపంలోని ఎంఎంఆర్ గార్డెన్ వద్ద ఆమెను ఫుట్‌పాత్‌పైనే వదిలి ఎటో వెళ్లిపోయాడు. రెండు రోజులైనా తిరిగి రాలేదు. ఆకలితో అలమటించిన తల్లి అనారోగ్యంతో çస్పృహ తప్పి పడిపోయింది. స్థానికుల సమాచారం మేరకు బోయిన్పల్లి పోలీసులు వచ్చి 108 అంబులెన్స్ సహాయంతో శ్యామలను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మూడురోజుల క్రితం కోలుకున్న శ్యామల నుంచి పోలీసులు వివరాలు సేకరించారు. కుమారుడిని చూడాలని శ్యామల కోరడంతో పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం చికిత్స పొందుతూ శ్యామల మృతి చెందింది. ఆమె కొడుకు అరవింద్ కోసం మేడ్చల్‌లో ఆరా తీసిన ఆచూకీ దొరకలేదు. దీంతో కేసు నమోదు చేసుకున్న బోయిన్పల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచామని, ఎవరైనా తెలిసినవారు ఉంటే బోయిన్పల్లి పోలీసులను సంప్రదించాలని ఇన్స్పెక్టర్ చెప్పారు. -
రోబొటిక్ పెట్ని ఆవిష్కరించిన 12 ఏళ్ల చిన్నారి!
ఆరవ తరగతి చదువుతున్న చిన్నారి ఒంటరితనాన్ని అధిగమించేందుకు పెంపుడు జంతువును దత్తత తీసుకోలేని వారికి ప్రత్యామ్నాయంగా రోబోటిక్ పెట్‌ను ఆవిష్కరించి అందర్నీ అబ్బురపరిచింది. ప్రతి ఏడాది 6 లక్షల పెంపుడు జంతువులను దేశ వ్యాప్తంగా దత్తత తీసుకుంటున్నారు. అయితే చాలా మందికి ఆర్థిక స్థోమత ఉంది. కానీ పెంపుడు జంతువును దత్తత తీసుకుని నిర్వహించడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. పైగా ఇది అందరికీ అది సాధ్యపడక పోవచ్చు. అలాంటి వారికి 12 ఏళ్ల చిన్నారి విద్యార్థి నేత్ర సింగ్ అభివృద్ధి చేసిన ఈ రోబోటిక్ పెట్ చక్కగా ఉపకరిస్తుంది. ఈ మేరకు బోవెన్పల్లిలోని సెయింట్ పీటర్స్ హైస్కూల్లో ఆరో తరగతి చదువుతున్న నేత్ర సింగ్ పెంపుడు జంతువులకు ప్రత్యామ్నాయంగా వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చి మరీ ఈ రోబోటిక్ పెట్ని అభివృద్ధి చేసింది. ఈ ఆవిష్కరణని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, అతిథులు, సహచరులతో సహా వెయ్యి మందితో కూడిన టెడ్ సమావేశంలో ప్రదర్శించడమే దీని ఉపయోగాలు గురించి మాట్లాడింది నేత్ర. రోబోటిక్ పెంపుడు జంతువులు ఒంటరితనాన్ని నయం చేయడంలో సహాయపడటమేగాక మానసిక ఆనందాన్నిస్తాయని చెప్పింది. ఆ సమావేశంలో నేత్ర మాట్లాడుతూ..ముఖ్యంగా కోవిడ్ తర్వాత పెంపుడు జంతువుల దత్తత పెరిగింది. అదీగాక పెంపుడు జంతువుల నిర్వహణ ఖర్చు కూడా గణనీయంగా పెరిగింది. ఈ పెంపుడు జంతువులు డెలివరీ బాయ్‌లను భయపెట్టడంతో చనిపోయిన ఘటనలను కూడా చేశాం. ఇంకోవైపు వీధికుక్కలు పసిపిల్లలపై దాడి చేసి చంపిన ఘటనలను కూడా రోజుకి ఒకటి వార్తాపత్రికల్లో వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో, నేత్ర సింగ్ చెబుతున్న రోబోటిక్ పెట్ ఆలోచనను అందర్నీ ప్రేరేపించింది. తన పాఠశాల నిర్వహించిన బోవెన్పల్లిలోని దాని ప్రాంగణంలో 'స్టార్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్--యాన్ ఈవినింగ్ అండర్ ది ఓపెన్ స్కై' అనే ప్రత్యేకమైన ప్రోగ్రామ్‌లో టెడ్(TED)లాంటి చర్చలో భాగంగా నేత్ర తన ఆలోచన పంచుకుంది. ఈ ఆలోచనకు గానూ ఆమెకు అందరి నుంచి ప్రశంసలు అందాయి. "నేను ఇప్పటికీ దానిపై పని చేస్తున్నాను. ప్రస్తుతానికి, ఇది నా ఆలోచన. నేను దీన్ని వాణిజ్య ఉత్పత్తిగా మార్చడానికి ప్రొఫెషనల్ మెంటరింగ్ని కోరుకుంటున్నానని ధీమాగా చెప్పుకొచ్చింది" విద్యార్థి నేత్ర. ఆమె పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె సువర్ణ నేత్ర ఆలోచనలు తోపాటు పాఠశాలలోని మరో 50 మంది విద్యార్థుల ఆలోచనల విన సంతోషం వ్యక్తం చేశారు. ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నప్పటికీ, రోబోటిక్ పెట్ అనేది ఒక వినూత్న ఆలోచన అని డాక్టర్ కె. సువర్ణ చెప్పారు. ఈ చర్చలో 50కిపైగా విద్యార్థులు తమ కొత్త ఆలోచనలు, దృక్కోణాలను పంచుకున్నారు. విద్యార్థులు మెరుగైన పనితీరు రెండు నిమిషాల నిడివి గల సందేశాలు, రీల్స్, షార్ట్‌లు, వాట్సాప్ స్టేటస్ వీడియోల రూపంలో కనబర్చేలా టెడ్ (TED) లాంటి షార్ట్ టాక్లతో ముందుకు వచ్చింది సెయింట్ పీటర్స్ హైస్కూల్. పాఠశాలకు చెందిన వరేణ్య, ప్రీతమ్, శామ్యూల్‌లతో కూడిన ముగ్గురు సభ్యుల బృందాలు ఫైర్ అండ్ గ్యాస్ లీకేజ్ ఫిక్టర్ రోబోట్‌ను సమర్పించాయి. ఇది CBSE రీజనల్ సైన్స్ ఎగ్జిబిషన్లో ఎంపికైంది. జనవరి 2024లో న్యూఢిల్లీలో జరిగే జాతీయ ప్రదర్శనలో పాల్గొంటుంది. నమోదు చేసుకున్న 3169 విద్యార్థి జట్లలో ఎంపిక చేసిన 30 ప్రదర్శనలలో సెయింట్ పీటర్స్ జట్టు ఒకటి. టెడ్ (TED) లాంటి చర్చలు పంచుకోవడానికి విలువైన ఆలోచనల కోసం పాఠశాల స్థాయి వేదిక. ఇది కూడా కేవలం ఎలివేటర్ ప్రయాణ సమయంలో ఐడియాను పంచుకుని, ప్రభావితం చేయగలిగే విధంగా, ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం. 1979లో ప్రారంభమైన ఈ పాఠశాల 24 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో లోగొను ఆవిష్కరించి సిల్వర్ జూబ్లీ సంవత్సరాన్ని జరుపుకోనుంది. (చదవండి: మురికి వాడ నుంచి రూ. 900 కోట్ల సామ్రాజ్యానికి యజమానిగా! రియల్ స్లమ్ డాగ్ మిలియనీర్!) -
బోయిన్ పల్లి రోడ్డుప్రమాదంలో గాయపడిన వైష్ణవి మృతి
-
బోయిన్పల్లి టు బోరజ్.. నాగ్‌పూర్ హైవేపై దిద్దుబాటు చర్యలు
సాక్షి, కామారెడ్డి: ‘‘కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలో టేక్రియాల్ చౌరస్తా వద్ద 2016లో రోడ్డు దాటే క్రమంలో కారును రెండు లారీలు ఢీకొట్టాయి. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. తరువాత కూడా పలు ప్రమాదాలు జరిగాయి. ఇక్కడ బ్రిడ్జి నిర్మించాలన్న డిమాండ్ ఎన్నో ఏళ్లుగా ఉంది. ఎట్టకేలకు ఇప్పుడక్కడ అండర్ పాస్ నిర్మాణం జరుగుతోంది. బ్రిడ్జి పూర్తయితే ప్రమాదాలు ఆగిపోతాయని భావిస్తున్నారు’’ ఇక్కడే కాదు.. హైదరాబాద్–నాగ్‌పూర్ కారిడార్‌గా పిలిచే 44వ నంబరు జాతీయ రహదారిపై పగలు, రాత్రి తేడా లేకుండా నిత్యం వేలాది వాహనాలు పరుగులు తీస్తుంటాయి. దీంతో రహదారిపై పలు పట్టణాలు, గ్రామాలు, చౌరస్తాల వద్ద నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు ఏడాదికేడాది పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించి, రోడ్డు ప్రమాదాలు నివారించడానికి భారత జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ (ఎన్హెచ్ఏఐ) నడుం కట్టింది. హైదరాబాద్‌లోని బోయిన్పల్లి నుంచి తెలంగాణ రాష్ట్రం ముగిసి మహారాష్ట్రలోకి ప్రవేశించే బోరజ్ దాకా బ్లాక్ స్పాట్లను గుర్తించిన ఎన్హెచ్ఏఐ దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. ఇప్పటికే పలు చోట్ల సర్వీస్ రోడ్ల నిర్మాణాలు, రోడ్ల మరమ్మతులు చేపట్టారు. ప్రధాన సమస్యగా ఉన్న జంక్షన్లు, కూడళ్ల వద్ద అండర్ పాస్‌లు, వంతెనల నిర్మాణ పనులు మొదలుపెట్టారు. ఏడాది, ఏడాదిన్నర కాలంలో పనులన్నీ పూర్తి చేయాలని ఎన్హెచ్ఏఐ లక్ష్యంగా పెట్టుకుంది. బోయిన్పల్లి నుంచి బోరజ్ దాకా.... బోయిన్పల్లి నుంచి మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల మీదుగా రాష్ట్ర సరిహద్దుల్లోని బోరజ్ దాకా 44వ నంబరు జాతీయ రహదారిపై ఎన్హెచ్ఏఐ పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టింది. బోయిన్పల్లి నుంచి కాళ్లకల్ దాకా 27 కిలోమీటర్ల మేర రూ.933 కోట్ల వ్యయంతో ఆరు వరుసల రహదారిని నిర్మిస్తోంది. ఇందులో ఐదు అండర్‌పాస్‌లు, నాలుగు ఫ్లై ఓవర్లున్నాయి. సుచిత్ర, డెయిరీ ఫాం, హైటెన్షన్ రోడ్డు, దూలపల్లి, కొంపల్లి, మేడ్చల్ ప్రాంతంలో ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మిస్తారు. మెదక్ జిల్లా పరిధిలోకి వచ్చే రెడ్డిపల్లి, జప్తి శివునూర్, గోల్డెన్ దాబా ప్రాంతాల్లో మూడు అండర్ పాస్‌లు నిర్మిస్తున్నారు. జాతీయ రహదారి నుంచి కామారెడ్డి పట్టణంలోకి ఎంటర్ అయ్యే నర్సన్నపల్లి చౌరస్తా, పట్టణం నుంచి బయటకు వెళ్లే టేక్రియాల్ చౌరస్తా వద్ద రెండు అండర్ పాస్‌లు నిర్మిస్తున్నారు. సదాశివనగర్ మండలంలోని పద్మాజివాడీ చౌరస్తా వద్ద కూడా అండర్ పాస్ నిర్మాణం పనులు మొదలయ్యాయి. నిర్మల్ జిల్లా కడ్తాల్ జంక్షన్, ఆదిలాబాద్ జిల్లాలోని గుడి హత్నూర్ జంక్షన్ల వద్ద అండర్ పాస్‌ల నిర్మాణాలు ప్రారంభించాల్సి ఉంది. రూ. పదకొండు వందల కోట్లతో.. రోడ్ల విస్తరణ, అండర్‌పాస్‌లు, సర్వీస్ రోడ్లు, ఫ్లై ఓవర్ బ్రిడ్జిల నిర్మాణాలకు రూ.పదకొండు వందల కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. బోయిన్పల్లి నుంచి కాళ్లకల్ దాకా వంతెనలు, ఆరువరుసల రోడ్ల నిర్మాణానికి రూ.933 కోట్లు కేటాయించారు. రెడ్డిపల్లి, జప్తి శివునూర్, గోల్డెన్ దాబా జంక్షన్, నర్సన్నపల్లి, టేక్రియాల్, పద్మా జివాడీ చౌరస్తా, కడ్తాల్, గుడి హత్నూర్ వద్ద అండర్ పాస్‌ల కోసం దాదాపు రూ.2 వందల కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. పలు అండర్ పాస్‌ల నిర్మాణ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. కామారెడ్డి జిల్లాలో నర్సన్న పల్లి, టేక్రియాల్, పద్మాజివాడీ ఎక్స్రోడ్ల వద్ద పనులు వేగంగా నడుస్తున్నాయి. మెదక్ జిల్లాలోనూ పనులు కొనసాగుతున్నాయి. ఏడాదిలోపు పూర్తి చేస్తాం... ఏడాదిలోపు పూర్తి చేయాలన్న లక్ష్యంతో 44వ నంబరు జాతీయ రహదారిపై అండర్‌పాస్‌ల నిర్మాణ పనులు మొదలుపెట్టాం. చాలాచోట్ల సర్వీస్ రోడ్లను చేపట్టాం. హైదరాబాద్‌లో ఆరు వరుసల నిర్మాణం, ఫ్లై ఓవర్ల నిర్మాణాలు కూడా ఏడాదిన్నర లోపు పూర్తి చేస్తాం. ప్రమాదాల నివారణతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగి పోతాయి. -
సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటుదాం
కంటోన్మెంట్: దేశ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం ఉందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. పర్యాటక, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బోయిన్‌పల్లిలోని దివ్యాంగ్జన్లో నిర్వహించిన ‘వందే భారతం 2023’ నృత్యోత్సవ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రధాని మోదీ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ఉన్న భిన్న సంస్కృతుల వైభవాన్ని కాపాడే ప్రయత్నం ముమ్మరం చేశామన్నారు. అందులో భాగంగానే రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొనే కళాకారుల ఎంపిక కోసం నృత్యోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. సాంస్కృతిక శాఖ నాగ్‌పూర్ ఆధ్వర్యంలో తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్, చత్తీస్ఘడ్ రాష్ట్రాల కళాకారుల మధ్య పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇందులో ఉత్తమంగా రాణించిన వారికి డిసెంబర్ 6న నాగ్‌పూర్‌లో జోనల్ స్థాయి పోటీలు, అందులోనూ రాణించిన వారికి ఢిల్లీలో నిర్వహించే జాతీయ పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. జాతీయ స్థాయిలో ఉత్తమంగా రాణించిన కళాకారులకు వచ్చే ఏడాది జనవరి 25 వరకు ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించి, రిపబ్లిక్ డే పరేడ్‌లో ప్రదర్శనలు జరిపే అవకాశం కల్పిస్తామన్నారు. జీ–20 సమావేశాల్లోనూ ప్రదర్శనలు వచ్చే ఏడాది డిసెంబర్ 1వ తేదీ నుంచి 2024 నవంబర్ 30వ తేదీ వరకు దేశంలో 250 జీ–20 దేశాల సమావేశాలు జరుగుతాయని కిషన్‌రెడ్డి వెల్లడించారు. ఈ సమావేశాల్లో అన్ని ప్రాంతాల సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తామన్నారు. దివ్యాంగ్జన్లో నిర్వహించిన పోటీల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, చత్తీస్ఘడ్, మహరాష్ట్రలకు చెందిన కళాకారుల ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీత రాకేశ్ తివారీ, కళైమామణి రాజేశ్వరి సాయినాథ్, పొట్టి శ్రీరాములు వర్సిటికీ చెందిన కళాకారులు కట్టా హరినాథ్ రావు, వనజా ఉదయ్, కథక్ కళాకారులు పండిట్ అంజిబాబులను సన్మానించారు. -
6 వరుసలుగా నాగ్‌పూర్ హైవే
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ చిక్కులతో విలవిల్లాడుతున్న 44వ నంబర్ జాతీయ రహదారి(నాగ్‌పూర్– నిజామాబాద్ హైవే)ని హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఆరు వరుసలకు విస్తరించనున్నారు. ఈ మేరకు భారత జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ (ఎన్హెచ్ఏఐ) ప్రతిపాదించింది. హైదరాబాద్‌లోని బోయిన్పల్లి నుంచి మేడ్చల్ తర్వాత ఉండే కాల్లకల్ వరకు దాదాపు 24 కి.మీ. మేర రహదారిని విస్తరించాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖకు తాజాగా ప్రతిపాదించింది. ఇందుకు దాదాపు రూ.1,300 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేసింది. దీనికి కేంద్రం నుంచి అనుమతి రావాల్సి ఉంది. ఈ జాతీయ రహదారికి ఇరువైపులా మేడ్చల్ వరకు కొత్త కాలనీలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ చిక్కులు ఏర్పడుతున్నాయి. కూడలి ప్రాంతాల్లో సిగ్నల్ పడితే కిలోమీటర్ మేర వాహనాల బారులు తీరుతున్నాయి. దీంతో ఈ రహదారిని విస్తరించాలని చాలాకాలం నుంచి ప్రజలు కోరుతున్నారు. భారీ ఎలివేటెడ్ కారిడార్లతో.. బోయిన్పల్లి నుంచి మేడ్చల్ వరకు కీలక కూడళ్లలో భారీ ఎలివేటెడ్ కారిడార్లకు ప్రణాళిక రచించారు. హైదరాబాద్ నుంచి మేడ్చల్ వెళ్లే దారిలో తొలుత కీలక జంక్షన్ అయిన సుచిత్ర కూడలి వద్ద 2 కి.మీ. పొడవైన వంతెన నిర్మించనున్నారు. ఇక్కడి నుంచి 10 కి.మీ. అంటే గుండ్లపోచంపల్లి వరకు మూడు భారీ వంతెనలు ఉంటాయి. సుచిత్ర కూడలి మొద టిది కాగా, సినీప్లానెట్ కూడలి వద్ద 560 మీటర్ల పొడవుతో రెండో వంతెన, కొంపల్లి–దూలపల్లి మధ్య 1.2 కి.మీ. మేర మూడో వంతెన నిర్మిస్తారు. అక్కడి నుంచి మేడ్చల్ దాటేవరకు రోడ్డును పూర్తి స్థాయిలో విశాలంగా మారుస్తారు. మేడ్చల్ దాటే వరకు రెండున్నర కి.మీ. మేర వంతెన నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టును రెండు భాగాలుగా విభజించారు. బోయిన్పల్లి నుంచి గుండ్ల పోచంపల్లి వరకు పనులకు రూ.450 కోట్లు, అక్కడి నుంచి మేడ్చల్ వరకు చేపట్టే పనులకు రూ.850 కోట్లు ప్రతిపాదించారు. -
బోయిన్పల్లి కేసు: సిద్దార్ధ గ్యాంగ్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో.. మరో 15 మందిని అదుపులోకి తీసుకున్నామని, మాదాల సిద్దార్థ అండ్ గ్యాంగ్‌ను అరెస్ట్ చేశామని సీపీ అంజనీకుమార్ తెలిపారు. అఖిలప్రియకు మాదాల సిద్దార్థ కిడ్నాప్ గ్యాంగ్‌ను సప్లై చేశాడని చెప్పారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ మాదాల సిద్దార్థ విజయవాడలో ఈవెంట్ మేనేజర్. అతడు తన స్విఫ్ట్ కారును కూడా కిడ్నాప్‌కు ఇచ్చాడు. కిడ్నాప్ కేసులో ఇప్పటి వరకు 19 మంది అరెస్ట్ అయ్యారు. సిద్దార్థకు అఖిలప్రియ రూ.5 లక్షల సుపారీ ఇచ్చారు. మిగతా 20 మందికి తలా రూ.25 వేలు ఇచ్చారు. అడ్వాన్స్‌గా సిద్దార్థకు రూ.74 వేలు ఇచ్చారు. ( మంత్రిగా ఉన్నప్పటి నుంచే ‘మ్యాన్‌పవర్’!) ఫోరమ్ మాల్ వద్ద ఎట్‌హోమ్‌లో కిడ్నాపర్లు ఉన్నారు. కిడ్నాపర్లకు గుంటూరు శ్రీను దుస్తులు సమకూర్చాడు. మొయినాబాద్‌లో బాధితుల నుంచి సంతకాలు తీసుకున్నారు. స్టాంప్ పేపర్లను మల్లికార్జున్ సంపత్ అరేంజ్ చేశాడు. జగత్ విఖ్యాత్, భార్గవ్‌రామ్ పేర్లపై ఖాళీ పత్రాలు ఉన్నాయి. కిడ్నాప్‌లో విఖ్యాత్ ఇన్నోవా కారు ఏపీ 21 సీకే 2804 వినియోగించారు. విఖ్యాత్ కారులో భార్గవ్‌రామ్, మరో నలుగురు నిందితులు ఉన్నారు. భార్గవ్‌రామ్, విఖ్యాత్‌రెడ్డి, చంద్రహాస్ ప్రధాన నిందితులు. శ్రీను, భార్గవ్‌రామ్ తల్లిదండ్రులు పరారీలో ఉన్నార’’ని తెలిపారు. బోయిన్పల్లి కేసుపై నార్త్‌జోన్ డీసీపీ కల్మేశ్మర్ మాట్లాడుతూ.. ‘‘ కేసుకు సంబంధించి మరో 9 మంది నిందితుల కోసం గాలిస్తున్నాం. జగత్ విఖ్యాత్, భార్గవ్‌రామ్ కోసం వెతుకుతున్నాం. హైదరాబాద్ లోథా అపార్ట్మెంట్లోనే కిడ్నాప్ ప్లాన్ చేశారు. ఫోరంమాల్ ఎట్‌హోం లాడ్జిలో కిడ్నాప్‌కు సంబంధించిన ముఠాను ఉంచారు. కిడ్నాప్‌కు కావాల్సినవన్నీ గుంటూరు శ్రీను సమకూర్చాడు. మొయినాబాద్ ఫామ్‌హౌజ్‌లో బాధితుల నుంచి నిందితులు స్టాంప్ పేపర్లపై సంతకాలు తీసుకున్నారు. 5 సిమ్‌కార్డులు, ఒక బొమ్మ పిస్టల్ కొనుగోలు చేశారు. బాధితుల ఇంటి దగ్గర రెక్కీ నిర్వహించారు. 5 వాహనాల్లో మల్లికార్జున నగర్‌కు నిందితులు వచ్చారు. సన్‌సిటీ ఓఆర్ఆర్ వద్ద బాధితులను విడిచిపెట్టారు’’ -
మంత్రిగా ఉన్నప్పటి నుంచే ‘మ్యాన్‌పవర్’!
సాక్షి, హైదరాబాద్ : బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో మరో 15 మంది నిందితుల్ని బోయిన్పల్లి పోలీసులు శనివారం అరెస్టు చేశారు. దీంతో అఖిలప్రియ సహా ఇప్పటి వరకు అరెస్టయిన వారి సంఖ్య 19కి చేరింది. వీరంతా కిడ్నాప్ జరిగిన రోజు ప్రవీణ్‌రావు ఇంటికి ఆదాయపు పన్ను అధికారులుగా వెళ్లిన వారే అని దర్యాప్తు అధికారులు చెప్తున్నారు. గుంటూరు శ్రీనుతో చేసుకున్న ఒప్పందం ప్రకారం.. వీరిని విజయవాడకు చెందిన సిద్ధార్థ్ పంపాడని, అతడినీ అరెస్టు చేశామని పోలీసులు పేర్కొంటున్నారు. ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా అఖిలప్రియ మంత్రిగా పనిచేశారు. అప్పట్లో ఆమె హైదరాబాద్, బెంగళూరులో ఉండేవారు. అమరావతికి వెళ్లిన ప్రతిసారీ తన వెంట మందీమార్బలం ఉండాలని కోరుకునేది. విజయవాడ, అమరావతి ఆ చుట్టుపక్కల అఖిలప్రియ పర్యటన ఉన్నప్పుడల్లా ‘జన సమీకరణ’చేసే బాధ్యతల్ని శ్రీను నిర్వర్తించేవాడు. ఇతడికి విజయవాడలోని ఓ మ్యాన్‌పవర్ కన్సల్టెన్సీ నిర్వహించే సిద్ధార్థ్‌తో పరిచయం ఏర్పడింది. ప్రతి దఫా దాదాపు 20 మంది ఆమె వెంట ఉండేలా చూశారు. అప్పట్లో ఒక్కొక్కరికీ రోజుకు రూ.1,000 చొప్పున చెల్లించేవారు. ఐటీ అధికారులుగా తర్ఫీదు.. తాజాగా బోయిన్పల్లి కిడ్నాప్‌నకు కుట్ర పన్నిన అఖిలప్రియ, భార్గవ్‌రామ్.. ఆదాయపుపన్ను అధికారులుగా నటించడానికి అద్దెకు బౌన్సర్లను ఏర్పాటు చేయమని శ్రీను ద్వారా సిద్ధార్థ్‌కు తెలిపారు. రూ.50 వేలు అడ్వాన్సుగా ఇచ్చి.. విషయం సెటిల్ అయిన తర్వాత భారీ మొత్తం ఇస్తానంటూ శ్రీను హామీ ఇచ్చాడు. దీంతో విజయవాడలోని వివిధ కాలనీలకు చెందిన దాదాపు 20మంది యువకుల్ని కూకట్‌పల్లిలోని పార్థ గ్రాండ్ హోటల్‌కు పంపాడు. వీరికి యూసుఫ్‌గూడలోని ఎంజీ ఎం స్కూల్ వద్ద ఐటీ అధికారులు, పోలీసులుగా నడుచుకోవడంపై భార్గవ్‌రామ్ తర్ఫీదు ఇచ్చాడు. కిడ్నాప్ పూర్తి కాగానే కొందరు, బాధితుల్ని విడిచిపెట్టిన తర్వాత మరికొందరు విజయవాడకు వెళ్లిపోయారు. దర్యాప్తులో ఈ విషయాలను గుర్తించిన పోలీసులు శనివారం సిద్ధార్థ్ సహా 15 మందిని అరెస్టు చేశారు. ఈ కేసులో ఈ నెల 11న అరెస్టయిన అఖిలప్రియ పీఏ బోయ సంపత్‌కుమార్, భార్గవ్‌రామ్ వ్యక్తిగత సహాయకుడు నాగరదొడ్డి మల్లికార్జున్‌రెడ్డి, డ్రైవర్ డోర్లు బాల చెన్నయ్యలను కస్టడీలోకి తీసుకోవాలని బోయిన్పల్లి అధికారులు నిర్ణయించారు. పరారీలో ఉన్న భార్గవ్‌రామ్, అతడి కుటుంబీకులు, గుంటూరు శ్రీను తదితరుల కోసం గాలిస్తున్నారు. -
ఏ క్షణమైనా అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్ అరెస్ట్!
సాక్షి, హైదరాబాద్ : బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియను రెండవరోజు కస్టడీలోకి తీసుకున్నారు. బేగంపేట్ మహిళా పోలీస్ స్టేషన్లో ఆమెను బోయినపల్లి పోలీసులు విచారిస్తున్నారు. భార్గవ్ రామ్ సహా ఇతర నిందితులు ఎక్కడున్నారు అన్న కోణంలోనూ విచారణ జరగనుంది. అంతేకాకుండా బాధిత కుటంబంతో బలవంతంగా సంతకాలు సేకరించిన పత్రాలు ఎక్కడ ఉన్నాయన్న కోణంలోనూ పోలీసులు ప్రశ్నల వర్షం కురింపించనున్నారు. (కథ.. స్క్రీన్‌ప్లే.. దర్శకత్వం.. భూమా అఖిలప్రియ!) మరోవైపు ఈ కేసులలో నిందితులు భార్గవ్ రామ్, గుంటూరు శ్రీనుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఏ క్షణం అయినా వారిని అరెస్టు చేసే అవకాశం ఉంది. ఇప్పటివరకు బోయినపల్లి కిడ్నాప్ కేసులో అఖిలప్రియతో పాటుమొత్తం మరో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మొత్తం 19 మంది ప్రమేయం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భార్గవ్‌రామ్, గుంటూరు శ్రీనులు పథకం ప్రకారమే కిడ్నాప్ చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇప్పటికే దీనికి సంబంధించి పలు కీలక ఆధారాలను సేకరించారు. నిందితులు ఉపయోగించిన కార్లు, సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. (అఖిలప్రియ బయటకొస్తే సాక్ష్యుల్ని బెదిరించవచ్చు ) -
అఖిలప్రియ బయటకొస్తే సాక్ష్యుల్ని బెదిరించవచ్చు
సాక్షి, హైదరాబాద్ : బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో దర్యాప్తును వేగవంతం చేశారు పోలీసులు. పరారీలో ఉన్న అఖిలప్రియ భర్త ఏ3 భార్గవరామ్ కోసం గాలిస్తున్నారు. బెయిల్ కోసం అఖిలప్రియ విశ్వప్రయత్నం చేస్తున్నారు. తన ఆరోగ్యం బాగాలేదని, బెయిల్ ఇవ్వాలని ఆమె కోరుతున్నారు. అయితే వైద్యపరీక్షల్లో ఆమె ఆరోగ్యంగానే ఉన్నట్లు తేలింది. రేపు(సోమవారం) కోర్టులో అఖిలప్రియ బెయిల్, కస్టడీపై విచారణ జరగనుంది. అఖిలప్రియ బయటకొస్తే సాక్షులను బెదిరించవచ్చని పోలీసులు తమ పిటిషన్లో పేర్కొన్నారు. కాగా, ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న అఖిలప్రియను తదుపరి విచారణ నిమిత్తం తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ పోలీసులు శుక్రవారం సికింద్రాబాద్‌లోని కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టడానికి ఆమెను వారంరోజుల పాటు విచారించాల్సి ఉందని పోలీసులు న్యాయస్థానాకి తెలిపారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న అఖిల ప్రియ అనుచరులు మరికొన్ని నేరాలు చేసినట్లు అనుమానాలు ఉన్నాయని, ఆమె భర్త భార్గవ్‌రామ్‌తో పాటు పరారీలో ఉన్న అనుచరులను అరెస్టు చేయాల్సి ఉందని కోర్టుకు నివేదించారు. ( అఖిలప్రియను కస్టడీకి ఇవ్వండి ) బోయిన్పల్లి నుంచి కిడ్నాప్ చేసిన ప్రవీణ్‌రావు, నవీన్‌రావు, సునీల్‌రావులను నగర శివార్లలోని ఫామ్‌హౌస్‌లో బంధించిన నిందితులు వారి నుంచి కొన్ని పత్రాలపై సంతకాలు తీసుకున్నారని దర్యాప్తు అధికారులు న్యాయస్థానానికి వివరించారు. వాటిని స్వాధీనం చేసుకోవాలంటే అవి ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలని తెలిపారు. మిగిలిన నిందితులను అరెస్టు చేసిన తర్వాతే కీలక ఘట్టమైన క్రైమ్ సీన్ రీ–కన్‌స్ట్రక్షన్‌ను చేపట్టాల్సి ఉందని పోలీసులు తమ పిటిషన్‌న్‌లో పేర్కొన్నారు. -
నలబై కోట్లు విలువైన వెండి పట్టివేత
సాక్షి, హైదరాబాద్: సిక్రింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లిలో పది టన్నుల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చెన్నై నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న కంటైనర్ సోమవారం పోలీసులకు పట్టుబడింది. వాహనంలోని వెండి విలువ సుమారు రూ.40 కోట్ల వరకు ఉండొచ్చని పోలీసులు అంచనావేస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వెండి తరలింపుపై పోలీసులకు అనుమానం రావడంతో వాహనాలు తనిఖీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో కంటైనర్‌ను తనిఖీ చేయగా.. దానిలో 9వేలకు పైగా వెండి కడ్డీలను పోలీసులు గుర్తించారు. వెండికి సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్లు, ఆధారాలు లేకపోవడంతో వాహనం డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వారి వద్ద నుంచి మరింత సమాచారాన్నిరాబట్టేందుకు ప్రశ్నిస్తున్నారు. ఇంత మొత్తంలో వెండి పట్టుబడడంతో దీనికి వెనుకున్న దందాపై పోలీసులు ఆరా తీస్తున్నారు. -
బాలుడి కిడ్నాప్ కలకలం.. నిందితుడి అరెస్ట్
బోయినపల్లి: బాలుడిని కిడ్నాప్ చేసిన నిందితుడిని నగర పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం బోయినపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని బాపూజీనగర్‌లో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. బేగంపేటలో శనివారం సాయంత్రం స్కూలుకు వెళ్లి వస్తున్న వంశీకృష్ణ(12)ను గుర్తుతెలియని దుండగుడు కిడ్నాప్ చేశాడు. కుమారుడు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే బోయినపల్లి బాపూజీనగర్ ప్రాంతంలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలుడు క్షేమంగానే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయని వారు పేర్కొన్నారు.