కంటోన్మెంట్: దేశ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం ఉందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. పర్యాటక, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బోయిన్‌పల్లిలోని దివ్యాంగ్జన్‌లో నిర్వహించిన ‘వందే భారతం 2023’ నృత్యోత్సవ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రధాని మోదీ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ఉన్న భిన్న సంస్కృతుల వైభవాన్ని కాపాడే ప్రయత్నం ముమ్మరం చేశామన్నారు.
అందులో భాగంగానే రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొనే కళాకారుల ఎంపిక కోసం నృత్యోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. సాంస్కృతిక శాఖ నాగ్‌పూర్ ఆధ్వర్యంలో తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్, చత్తీస్‌ఘడ్ రాష్ట్రాల కళాకారుల మధ్య పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇందులో ఉత్తమంగా రాణించిన వారికి డిసెంబర్ 6న నాగ్‌పూర్‌లో జోనల్ స్థాయి పోటీలు, అందులోనూ రాణించిన వారికి ఢిల్లీలో నిర్వహించే జాతీయ పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. జాతీయ స్థాయిలో ఉత్తమంగా రాణించిన కళాకారులకు వచ్చే ఏడాది జనవరి 25 వరకు ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించి, రిపబ్లిక్ డే పరేడ్‌లో ప్రదర్శనలు జరిపే అవకాశం కల్పిస్తామన్నారు.
జీ–20 సమావేశాల్లోనూ ప్రదర్శనలు
వచ్చే ఏడాది డిసెంబర్ 1వ తేదీ నుంచి 2024 నవంబర్ 30వ తేదీ వరకు దేశంలో 250 జీ–20 దేశాల సమావేశాలు జరుగుతాయని కిషన్‌రెడ్డి వెల్లడించారు. ఈ సమావేశాల్లో అన్ని ప్రాంతాల సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తామన్నారు. దివ్యాంగ్జన్‌లో నిర్వహించిన పోటీల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌ఘడ్, మహరాష్ట్రలకు చెందిన కళాకారుల ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీత రాకేశ్ తివారీ, కళైమామణి రాజేశ్వరి సాయినాథ్, పొట్టి శ్రీరాములు వర్సిటికీ చెందిన కళాకారులు కట్టా హరినాథ్ రావు, వనజా ఉదయ్, కథక్ కళాకారులు పండిట్ అంజిబాబులను సన్మానించారు.
Comments
Please login to add a commentAdd a comment