Bokka Narsimha Reddy
-
బీజేపీలో కలవరం.. కనీస విలువ లేని పదవి నాకెందుకంటూ ‘బొక్కా’ అలక
సాక్షి, రంగారెడ్డి: భారతీయ జనతాపార్టీ జిల్లా (గ్రామీణ) అధ్యక్షుడు బొక్కా నర్సింహారెడ్డి అలకబూనారు. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు అంటీముట్టనట్లు ఉంటూ రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు. నియోజకవర్గాల కన్వీనర్ల నియామకంలో తన మాట చెల్లుబాటు కాకపోవడంతో కినుక వహించిన బొక్క.. అధ్యక్ష పదవిని వదులుకునేందుకు సిద్ధపడ్డారు. ఆధిపత్యపోరుతో నియోజకవర్గంలో పార్టీగా రెండుగా చీలడంతో కమలం శిబిరంలో కలహాలకు దారితీసింది. ఈ నేపథ్యంలోనే నర్సింహారెడ్డి సూచించిన వ్యక్తిని సెగ్మెంట్ కన్వీనర్ పదవికి ఎంపిక చేయకపోవడంతో మనస్తాపానికి గురయ్యారు. గౌరవంలేని పదవి తనకెందుకని అధిష్టానం ముందు ఆక్రోషం వెళ్లగక్కినట్లు సమాచారం. అగ్రనేతలు బుజ్జగింపులతో ఒకింత మెత్తబడినప్పటికీ పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలతో నొచ్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. చెల్లుబాటు కాకపోవడంతో.. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో భాగంగా ఇటీవల నియోజకవర్గాలకు కన్వీనర్లు, కో కన్వీనర్లను నియమించారు. ఈ మేరకు రాష్ట్ర నాయకత్వం జిల్లా కోర్‌కమిటీ నుంచి అభిప్రాయాలు సేకరించింది. జిల్లా అధ్యక్షుడిగా బొక్కా కొన్నిపేర్లు సిఫార్సు చేశారు. పార్టీ ప్రకటించిన జాబితాలో తాను సూచించిన వ్యక్తికి కాకుండా మరొకరి పేరు ఉండడంతో ఆయన అవాక్కయ్యారు. పార్టీలో తన మాట చెల్లుబాటుకాకపోవడంతో అధ్యక్ష పదవిని సైతం త్యజించేందుకు సిద్ధపడగా.. పార్టీ నేతలు నచ్చజెప్పడంతో వెనక్కితగ్గారు. కానీ, పార్టీలో అంతర్గతంగా ఉన్న లుకలుకలు మరోసారి బయటపడటంతో కార్యకర్తల్లో ఆందోళన మొదలైంది. ఇప్పుడిప్పుడే సంస్థాగతంగా బలపడుతున్న పార్టీకి అధ్యక్షుడి అలక నష్టాలను తెచ్చిపేట్టే అవకాశం లేకపోలేదు. శిక్షణ తరగతులకు దూరంగా.. క్షేత్రస్థాయి కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దేందుకు ప్రతి రెండేళ్లకోసారి ప్రశిక్షణ్ శిబిరాలను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం శామీర్‌పేటలో పార్టీ శిక్షణ శిబిరాలు ప్రారంభమయ్యాయి. పార్టీ మూల సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం, వారిని పార్టీ వైపు ఆకర్షితులను చేయడం, సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడం ఈ శిబిరాల ముఖ్య ఉద్దేశం. రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ కేడర్ ఈ శిబిరానికి హాజరైంది. బొక్కా నర్సింహారెడ్డి మాత్రం దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో ఎల్బీనగర్ తర్వాత మహేశ్వరం నియోజకవర్గంలోనే పార్టీ బలంగా ఉంది. ఇది ఆయన సొంత నియోజకవర్గం కూడా. ఇక్కడి నుంచి అందెల శ్రీరాములు, తూళ్ల దేవేందర్‌గౌడ్ తనయుడు వీరేందర్‌గౌడ్ కూడా పోటీపడుతున్నారు. ఎవరికి వారు వ్యక్తిగత కేడర్‌ను తయారు చేసుకుంటున్నారు. ఈ వర్గపోరు కూడా ఆయన మనస్తాపం చెందటానికి మరో కారణమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
నర్సింహారెడ్డికి మొండిచేయి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జిల్లా సారథి బొక్క నర్సింహారెడ్డికి మొండిచేయి ఎదురైంది. మహేశ్వరం టికెట్‌పై ఆశలు పెట్టుకున్న ఆయనకు చివరకు టికెట్ దక్కలేదు. పార్టీ అధిష్టానం ఆదివారం విడుదల చేసిన ఐదో జాబితాలోనూ ఆయన పేరు లేదు. మహేశ్వరం సెగ్మెంట్‌కు అందెల శ్రీరాములు యాదవ్ పేరును ఖరారు చేశారు. సామాజిక సమీకరణలు నేపథ్యంలో ఆ సీటు బీసీలకు కేటాయించాల్సి వచ్చిందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ స్థానంపై బీజేపీ జిల్లా అధ్యక్షుడితోపాటు సీనియర్ నేతలు శ్రీరాములు, శంకర్‌రెడ్డి ఆశలు పెట్టుకున్నారు. ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ నర్సింహారెడ్డి పేరు దాదాపు ఖరారు చేసినా అధికారికంగా ప్రకటించలేదు. శ్రీరాములుకు టికెట్ ఇవ్వాలని సంఘ్ పరివార్ పెద్దలు తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే మహేశ్వరం సెగ్మెంట్ అభ్యర్థి ఎవరనేదానిపై అయోమయం నెలకొంది. ఇలా ఐదో జాబితా వరకు ఈ విషయంలో గోప్యత పాటించారు. ప్రధానంగా నర్సింహారెడ్డి, శ్రీరాములు మధ్యనే పోటీ నెలకొంది. ఈ క్రమంలో అభ్యర్థిని ఖరారు చేసే బాధ్యతలను పార్టీ సీనియర్ నేత జి.కిషన్‌రెడ్డికి బీజేపీ నాయకత్వం అప్పగించింది. రంగంలోకి దిగిన కిషన్‌రెడ్డి శనివారం రాత్రి నర్సింహారెడ్డి, శ్రీరాములుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. చివరకు శ్రీరాములు పేరు ఖరారుతో ఉత్కంఠకు తెరపడినట్లయింది. కొన్ని కారణా వల్ల శ్రీరాములకు టికెట్ ఇవ్వా ల్సి వస్తుందని బీజేపీ జిల్లా సారథికి కిషన్ రెడ్డి నచ్చజెప్పా రు. టికెట్ కోసం గట్టిగా ప్రయత్నించి భంగ పడ్డ ఆయనకు భవిష్యత్‌లో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. -
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి
బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి వికారాబాద్ రూరల్: కాలుష్యరహిత వాతావరణం కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని 22వ వార్డు కౌన్సిలర్ సుచరితరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ర్వహించిన హరితహారం కార్యక్రమానికి ఆయన హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుతం వాతావరణ కాలుష్యం పెరిగిపోయిందన్నారు. చెట్లను ఇష్టారాజ్యంగా నరికివేస్తూ వినాశనానికి ఒడిగడుతున్నారన్నారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటడంతోపాటు సంరక్షించుకునే బాధ్యతను సైతం తీసుకోవాలన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం పేద ప్రజల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టడం జరుగుతోందన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్, అసెంబ్లీ కన్వీనర్ పాండుగౌడ్, జిల్లా కార్యదర్శి విజయభాస్కర్‌రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర నాయకులు కేపీ రాజు, పట్టణ అధ్యక్షుడు సతీష్ కుమార్, అనిల్ యాదవ్, రాజు, నిరంజ¯ŒSరెడ్డి, అమరేందర్‌రెడ్డి, రాములు, శంకర్‌రెడ్డి, సుదర్శ¯ŒS, ఆంజనేయులు, నరోత్తంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.