బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, అందె శ్రీరాములు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జిల్లా సారథి బొక్క నర్సింహారెడ్డికి మొండిచేయి ఎదురైంది. మహేశ్వరం టికెట్‌పై ఆశలు పెట్టుకున్న ఆయనకు చివరకు టికెట్ దక్కలేదు. పార్టీ అధిష్టానం ఆదివారం విడుదల చేసిన ఐదో జాబితాలోనూ ఆయన పేరు లేదు. మహేశ్వరం సెగ్మెంట్‌కు అందెల శ్రీరాములు యాదవ్ పేరును ఖరారు చేశారు. సామాజిక సమీకరణలు నేపథ్యంలో ఆ సీటు బీసీలకు కేటాయించాల్సి వచ్చిందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ స్థానంపై బీజేపీ జిల్లా అధ్యక్షుడితోపాటు సీనియర్ నేతలు శ్రీరాములు, శంకర్‌రెడ్డి ఆశలు పెట్టుకున్నారు. ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ నర్సింహారెడ్డి పేరు దాదాపు ఖరారు చేసినా అధికారికంగా ప్రకటించలేదు. శ్రీరాములుకు టికెట్ ఇవ్వాలని సంఘ్ పరివార్ పెద్దలు తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది.
ఈ నేపథ్యంలోనే మహేశ్వరం సెగ్మెంట్ అభ్యర్థి ఎవరనేదానిపై అయోమయం నెలకొంది. ఇలా ఐదో జాబితా వరకు ఈ విషయంలో గోప్యత పాటించారు. ప్రధానంగా నర్సింహారెడ్డి, శ్రీరాములు మధ్యనే పోటీ నెలకొంది. ఈ క్రమంలో అభ్యర్థిని ఖరారు చేసే బాధ్యతలను పార్టీ సీనియర్ నేత జి.కిషన్‌రెడ్డికి బీజేపీ నాయకత్వం అప్పగించింది. రంగంలోకి దిగిన కిషన్‌రెడ్డి శనివారం రాత్రి నర్సింహారెడ్డి, శ్రీరాములుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. చివరకు శ్రీరాములు పేరు ఖరారుతో ఉత్కంఠకు తెరపడినట్లయింది. కొన్ని కారణా వల్ల శ్రీరాములకు టికెట్ ఇవ్వా ల్సి వస్తుందని బీజేపీ జిల్లా సారథికి కిషన్ రెడ్డి నచ్చజెప్పా రు. టికెట్ కోసం గట్టిగా ప్రయత్నించి భంగ పడ్డ ఆయనకు భవిష్యత్‌లో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment