అవమానాలు భరించలేకే టీడీపీకి రాజీనామా
సాక్షి, రాజంపేట: వైఎస్సార్ జిల్లా రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి పార్టీని సర్వనాశనం చేస్తున్నాడని ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బొల్లినేని రామ్మోహన్నాయుడు ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే తీరుకు నిరసనగా తన పదవికీ, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీలో జరుగుతున్న అవమానాలు భరించలేకే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. శనివారం రాజంపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఎమ్మెల్యేగా మల్లికార్జునరెడ్డి గెలవడానికి కమ్మ సామాజిక వర్గం కృషి చేసిందని, అయితే ఆయన నాలుగేళ్లుగా కమ్మ వర్గీయులను పూర్తిగా అణగదొక్కారని విమర్శించారు. అధికారుల నుంచి పనులు చేయించుకునేందుకు ఎమ్మెల్యే వర్గీయులు చేస్తున్న వ్యవహారాలు నియోజకవర్గంలో అందరికీ తెలిసిందేనన్నారు. ఎమ్మెల్యే పేరుతో కొందరు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, అలాగే భూదందా, కబ్జాలు చేస్తున్నారని ఆరోపించారు. రాజంపేట తహసీల్దారు నివసిస్తున్న అపార్టుమెంట్ అద్దె కూడా ఎమ్మెల్యే వర్గీయుల్లో కొందరు చెల్లిస్తున్నారంటే ఇక్కడి పరిస్థితి అర్థం చేసుకోవచ్చన్నారు.