bombay hight court
-
‘కోటా కోసం ఆత్మహత్యలు వద్దు’
సాక్షి, ముంబై : మరాఠాలు రిజర్వేషన్ల కోసం ఆత్మహత్యలకు పాల్పడవద్దని బాంబే హైకోర్టు మంగళవారం విజ్ఞప్తి చేసింది. ఈ అంశం న్యాయస్ధానాల పరిధిలో ఉన్నందున సంయమనం పాటించాలని సూచించింది. మరాఠాలు కోటా కోరుతూ హింసకు దిగడం కానీ, ఆత్మహత్యలకు పాల్పడటం కానీ చేయరాదని తాము కోరుతున్నామని జస్టిస్ రంజిత్ మోరే, జస్టిస్ అనుజా ప్రభుదేశాయ్లతో కూడిన డివిజన్ బెంచ్ కోరింది. బీసీ కమిషన్ మరాఠాలకు కోటాపై ఇప్పటివరకూ చేపట్టిన కసరత్తును వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నివేదిక సమర్పించిన క్రమంలో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా కమిషన్ ఏర్పాటు చేసిన ఐదు ఏజెన్సీలు క్రోడీకరించిన సమాచారం, అథ్యయనాలను కమిషన్ నియమించిన నిపుణుల కమిటీ క్రోడీకరిస్తోందని సెప్టెంబర్ 5లోగా కమిటీ తన నివేదికను సమర్పించే అవకాశం ఉందని సీనియర్ న్యాయవాది రవి కదం, ప్రభుత్వ న్యాయవాది అభినందన్ వాగ్యాని కోర్టుకు తెలిపారు. ఈ నివేదికను పరిశీలించిన అనంతరం కమిషన్ నవంబర్ మాసాంతానికి తన తుది నివేదికను ప్రభుత్వానికి అందచేస్తుందని చెప్పారు. కమిషన్ తన కసరత్తును త్వరితగతిన చేపట్టేలా చూడాలని బెంచ్ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. -
షారూక్పై కేసు విచారణ 26కు వాయిదా
ముంబై : అద్దె గర్భం ద్వారా కుమారుడిని పొందిన నటుడు షారూఖ్ఖాన్, అంతకు ముందు చట్టానికి వ్యతిరేకంగా లింగనిర్ధారణ పరీక్షలు చేయించాడని ఆరోపిస్తూ సామాజిక కార్యకర్త వర్ష దేశ్పాండే వేసిన కేసును బాంబే హైకోర్టు ఈ నెల 26కు వాయిదా వేసింది. అంతకు ముందు తమ ముందుకు వచ్చిన కేసుపై న్యాయమూర్తి మాట్లాడుతూ ‘అతడు ముందస్తు లింగనిర్ధారణ పరీక్షలు జరిపించారని ఎలా ఆరోపిస్తున్నారు.. బిడ్డ పుట్టకముందే పరీక్షలు చేయించాడా.. నివేదిక ఎప్పుడు ఇచ్చారు..అంటూ వర్షాను ప్రశ్నించారు. తదుపరి విచారణను ఆగస్టు 26కు వాయిదా వేస్తూ, అప్పటిలోగా అన్ని రికార్డులను కోర్టుకు అందజేయాలని ఆదేశించారు. -
బీసీసీఐకి ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టులో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్పాట్ ఫిక్సింగ్పై బీసీసీఐ నియమించిన ద్విసభ్య కమిటీ విషయమై బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. అయితే ఈ పిటీషన్ను విచారించేందుకు మాత్రం సుప్రీం కోర్టు సమ్మతించింది. ఐపీఎల్ బెట్టింగ్ ఉదంతంలో చెన్నై ఫ్రాంచైజీ ప్రిన్సిపల్ గురునాథ్ మెయ్యప్పన్, రాజస్థాన్ రాయల్స్ సహ యజమాని రాజ్కుంద్రాలపై బోర్డు నియమించిన ద్విసభ్య కమిటీ వీరిద్దరికి క్లీన్చిట్ ఇచ్చింది. అయితే ఈ దర్యాప్తుతో నిజానిజాలు వెలుగులోకి రావని బీహార్ క్రికెట్ సంఘం కేసు వేసింది. దీన్ని విచారించిన బాంబే హైకోర్టు ఆ కమిటీ అనైతికమని, రాజ్యాంగబద్ధమైనది కాదని తీర్పునిచ్చింది. దీన్ని సవాలు చేస్తూ బీసీసీఐ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. బాంబే హైకోర్టు తీర్పుపై స్టే ఇస్తూ... మధ్యంతర తీర్పు వెలువరించాలని బోర్డు కోరింది. అయితే సర్వోన్నత న్యాయస్థానం ‘స్టే’కు నిరాకరించింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. దీనిపై రెండు వారాల్లోగా కౌంటర్ ఫైల్ దాఖలు చేయాలని ప్రతివాది అయిన బీహార్ క్రికెట్ సంఘాన్ని ఆదేశించింది.