ప్లేస్మెంట్ల ఖిల్లా ఖరగ్ఫూర్
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న విద్యా సంస్థల్లో ఐఐటీ ఖరగ్‌పూర్ ప్రపంచంలో 77వ స్థానంలో (దేశంలో తొలిస్థానం) నిలిచింది. అలాగే ఐఐటీ బాంబే 93వ స్థానాన్ని పొందింది. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ విద్యా సంస్థల్లో ఉద్యోగ అవకాశాలపై ‘గ్రాడ్యుయేట్ ఎంప్లాయబిలిటీ ర్యాంకింగ్స్’ పేరుతో క్వాక్వరెల్లీ సైమండ్స్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో దేశం నుంచి ఈ రెండు విద్యా సంస్థలే టాప్-100లో స్థానం దక్కించుకున్నాయి. సర్వే నివేదికను సంస్థ ఇటీవల వెల్లడించింది. ఈ జాబితాలో అమెరికాలోని స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక టాప్-200లో ఐఐటీ మద్రాస్ 119, ఐఐటీ ఢిల్లీ 160, ఢిల్లీ యూనివర్సిటీ 175 స్థానాల్లో నిలిచాయి.
అమెరికా, ఇంగ్లండ్, చైనా, ఫ్రాన్స్‌కు చెందిన విద్యా సంస్థలు టాప్-10లో చోటుదక్కించుకున్నాయి. 2014-15 లో ప్రపంచవ్యాప్తంగా 1,239 విద్యా సంస్థల్లో 44 వేల మంది విద్యార్థుల నుంచి వివరాలను సేకరించి సర్వే చేపట్టినట్లు క్వాక్వరెల్లీ సైమండ్స్ వెల్లడించింది. ఐదు అంశాలను ప్రాతిపదికగా తీసుకొని ర్యాంకులు ఇచ్చినట్లు తెలిపింది. ఉద్యోగాలు ఇచ్చే సంస్థల ప్రాముఖ్యతకు 30 శాతం, ఆయా సంస్థలతో భాగస్వామ్యానికి 25 శాతం, పూర్వ విద్యార్థులకు 20 శాతం, క్యాంపస్ ప్లేస్మెంట్ల నిర్వహణకు 15 శాతం, గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాల కల్పనకు 10 శాతం ప్రాధాన్యం ఇచ్చి సర్వే చేసినట్లు వివరించింది.
మొదలైన క్యాంపస్ ప్లేస్మెంట్లు
ఎన్ఐటీలు, ఐఐటీల్లో 2015-16 విద్యా సంవత్సరానికి సంబంధించి క్యాంపస్ ప్లేస్మెంట్లు మొదలయ్యాయి. ఈనెల 1న ప్రారంభమైన తొలి విడత ప్లేస్మెంట్లు ఈనెల 20 వరకు కొనసాగనున్నాయి. రెండో విడత ప్లేస్‌మెంట్స్ మేళాలను జనవరి 5 నుంచి ఏప్రిల్ నెలాఖరు వరకు నిర్వహించనున్నట్లు ఐఐటీ ఖరగ్‌పూర్ వెల్లడించింది. ఇప్పటివరకు జరిగిన ఉద్యోగ మేళాలో ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ బాంబే విద్యార్థులకు కంపెనీలు అత్యధికంగా రూ. 2 కోట్ల వరకు ఆఫర్ చేసినట్లు తెలిసింది. వాటితోపాటు ఈసారి ఐఐటీ పట్నా విద్యార్థులకు కూడా కంపెనీలు అత్యధిక వేతనాన్ని ఆఫర్ చేసినట్లు సమాచారం.