booth level staff
-
ఎమ్మెల్సీ ఎన్నికల ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల
సాక్షి, అమరావతి: రాష్ట్ర శాసన మండలిలో పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గాల నుండి ఎన్నికైన ఐదుగురు సిట్టింగ్ సభ్యులు వచ్చే ఏడాది మార్చి 29న పదవీ విరమణ చేయనున్నారు. వారి నియోజకవర్గాలకు ముసాయిదా ఓటర్ల జాబితా (డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్స్)ను రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం విడుదల చేసింది. ఈ మేరకు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ జాబితాలపై డిసెంబర్ 9 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామని, వాటిని పరిష్కరించి తుది జాబితాలను డిసెంబర్ 30న విడుదల చేస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. డ్రాఫ్ట్ రోల్లో నమోదు చేసుకోలేకపోయిన అర్హులందరూ గ్రాడ్యుయేట్ల నియోజకవర్గం కోసం ఫారం–18, ఉపాధ్యాయుల నియోజకవర్గం కోసం ఫారం–19లో నమోదుకు దరఖాస్తులను దాఖలు చేయవచ్చని, ఏవైనా అభ్యంతరాలుంటే ఓటర్లు ఫారం–7, సవరణల కోసం ఫారం–8లో దాఖలు చేయవచ్చని తెలిపారు. బూత్ స్థాయి ఏజెంట్ల సాయం ముసాయిదా జాబితాలో సవరణల కోసం బూత్ స్థాయి ఏజెంట్ల సాయం తీసుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది. అలాగే ఏజెంట్ల బాధ్యతలను కూడా వివరించింది. చనిపోయిన, మారిన ఓటర్లను ఇంటింటి సర్వే ద్వారా, ఇతర మార్గాల ద్వారా గుర్తించి ఒక జాబితా తయారు చేసి, నిర్ణీత ఫార్మాట్లో అధికారులకు అందించవచ్చని తెలిపింది. ఇలా ఏజెంట్లు ఒక రోజులో 10కి మించకుండా దరఖాస్తులను ఫైల్ చేయవచ్చని చెప్పింది. రాజకీయ పార్టీలు ప్రతి పోలింగ్ స్టేషన్‌కు బూత్ లెవల్ ఏజెంట్లను నియమించాలని ఆదేశించింది. -
చంద్రబాబును ఏపీ క్షమించదు: నరేంద్ర మోదీ
తిరువళ్లూరు(తమిళనాడు): కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించగా ఆయన ఆశయాలకు తిలోదకాలిచ్చి కాంగ్రెస్‌తోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పొత్తుపెట్టుకున్నారని ప్రధాని మోదీ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాబును ఎన్నటికీ క్షమించరని ఆయన విమర్శించారు. ‘నా పోలింగ్ బూత్ బలమైన పోలింగ్ బూత్’ పేరిట ప్రధాని మోదీ ఇటీవల పార్టీ బూత్ కమిటీల సభ్యులతో ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నారు. గత నాలుగున్నరేళ్లలో బీజేపీ ప్రభుత్వం అమలుచేసిన పథకాలను వివరిస్తూ కార్యకర్తలను ఉత్సాహ పరుస్తున్నారు. ఇందులో భాగంగానే తమిళనాడులోని తిరుచ్చి, మదురై, చెన్నై సెంట్రల్, నార్త్ చెన్నై, తిరువళ్లూరు తదితర ప్రాంతాలకు చెందిన బీజేపీ బూత్ కమిటీ సభ్యులతో ఆదివారం ప్రత్యేక టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. గత నాలుగున్నరేళ్లలో బీజేపీ చేపట్టిన సంక్షేమ పథకాలను ఈ సందర్భంగా మోదీ వారికి వివరించారు. అనంతరం కార్యకర్తల ప్రశ్నలకు సమాధానం చెబుతూనే, భవిషత్తు కార్యాచరణపై దిశా నిర్దేశం చేశారు. పార్టీ నేత ఒకరు వచ్చే ఎన్నికల్లో పొత్తు ఎవరితో ఉంటుందని ప్రశ్నించగా మోదీ సమాధానమిస్తూ బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడే వారితోనే ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటామన్నారు. ఈ విషయంలో ఎవరూ కూడా అపోహలకు గురి కావద్దన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీని స్థాపించి విజయం సాధించారన్నారు. అయితే, ఎన్టీఆర్ ఆశయాలకు నీళ్లొదిలి కాంగ్రెస్‌తోనే పొత్తు పెట్టుకున్న ప్రస్తుత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును ఆ«ంధ్రప్రదేశ్ ప్రజలు క్షమించబోరన్నారు. అలాంటి అనైతిక పొత్తులకు బీజేపీ పాకులాడబోదని కార్యకర్తలకు హమీ ఇచ్చారు. ఇటీవల మహా కూటమి అంటూ మాట్లాడుతున్న నేతలకు స్వలాభం, పదవుల యావ తప్ప మరేమీ లేదని విమర్శించారు. ఈ కూటమి కులీన కుటుంబాల అపవిత్ర కూటమి అని నిప్పులు చెరిగారు. అందులో ఉన్న పార్టీల నేతలంతా ఒకప్పుడు కాంగ్రెస్ పోకడలతో భంగపడిన వారేనని అన్నారు. ‘సోషలిస్ట్ నేత రామ్ మనోహర్ లోహియానే తమకు ఆదర్శమని చెప్పుకుంటున్న ఈ నేతలు.. పార్టీ సిద్ధాంతాలు, జాతిహితంపై రాజీపడే పార్టీగా కాంగ్రెస్‌ను ఆయన తిట్టిపోసేవారని గుర్తుంచుకోవాలి. కూటమి నేతలు ఎమర్జెన్సీ సమయంలో జైలు జీవితం గడిపిన వారే. సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయం సింగ్‌ను అక్రమ కేసులతో కాంగ్రెస్ వేధించింది. గతంలో కాంగ్రెస్, డీఎంకేల నడుమ బద్ధవైరం ఉన్న విషయాన్ని ఎవరూ మర్చిపోలేరు. తమిళనాడులో డీఎంకే అయినా ఉండాలి లేదా తామైనా ఉండాలని అప్పట్లో విర్రవీగిన కాంగ్రెస్.. నేడు ఆ పార్టీతో అంటకాగడం అవకాశవాదం తప్ప మరేమీ లేదన్నారు. -
తలుపు తట్టుడే..!
సాక్షి, పెద్దపల్లి: ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా చమటోడ్చుతున్న అభ్యర్థులు ప్రచార శైలిని విభిన్నంగా మార్చారు. ఓవైపు మాస్‌గా ప్రచారం సాగిస్తూనే.. మరో వైపు ప్రతీ ఇంటి తలుపు తట్టే విధంగా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఇందుకోసం క్షేత్రస్థాయిలో కొన్ని ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు పోలింగ్ బూత్‌ల వారీగా బృందాలు కేటాయించగా, బీజేపీ ఓటరుజాబితాలోని పేజీల వారీగా కూడా కమిటీలు ఏర్పాటు చేయడం విశేషం. బూత్‌స్థాయిలో కమిటీలు ఏ ఒక్క ఓటరును వదిలిపెట్టకుండా, ప్రతీ ఇంటికి తమ ప్రచారం వెళ్లేలా అభ్యర్థులు ప్రణాళికలు రూపొందించుకున్నారు. గతంలో అభ్యర్థులు గ్రామాల్లోని ప్రధాన వీధుల గుండా, కాలనీల్లో మాత్రమే ప్రచారాన్ని పరిమితం చేశారు. ఓటరు స్లిప్‌లు పంచే సమయంలోనే ఇంటింటికి వెళ్లే వాళ్లు. కానీ.. ఈసారి చాలా ముందుగా ఎన్నికల వాతావరణం జిల్లాలో ఏర్పడడంతో అన్ని పార్టీలు ముందస్తు వ్యూహరచనలు చేశాయి. పల్లెలు, పట్టణాలు అనేతేడా లేకుండా అన్ని ఇళ్లను తట్టే విధంగా ప్రచారాన్ని రూపొందించాయి. అభ్యర్థులు ప్రచారం చేస్తూ వెళుతుంటే, కొన్ని ప్రత్యేక బృందాలు మాత్రం తమకు కేటాయించిన ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలోనే నిమగ్నమవుతున్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోలింగ్ బూత్‌ల వారీగా పార్టీ కమిటీలు నియమించాయి. ఒక్కోబూత్ పరిధిలో పదిమంది పార్టీ కార్యకర్తలు ప్రచారపర్వాన్ని నిత్యం కొనసాగిస్తుంటారు. ఆ బూత్ పరిధిలో ఉన్న ఓటర్లను కలుస్తూ తమపార్టీకే ఓటు వేయాలంటూ నేరుగా ప్రభావితం చేస్తారు. ఇక బీజేపీ రథసారథి అమిత్‌షా జాతీయస్థాయిలో పన్నిన వ్యూహాలను ఇక్కడా అమలు చేస్తున్నారు. అన్ని పార్టీలు పోలింగ్ బూత్‌ను పరిగణలోకి తీసుకొని కమిటీలు వేస్తుంటే, బీజేపీ మాత్రం ఓఅడుగు ముందుకేసి కమ్మకమిటీ వేసింది. ఓటరుజాబితాలోని ఒకపేజీలో ఉన్న ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఏర్పాటు చేసేదే కమ్మకమిటీ. దాదాపు 50 మంది ఓటర్లకు ఇన్‌చార్జీగా ఆ కమిటీ పనిచేస్తుండడంతో.. ప్రచార ప్రభావం ఓటర్లపై నేరుగా పడుతుందనే భావనతో అభ్యర్థులున్నారు. అందుకే పోలింగ్ బూత్‌స్థాయి కమిటీలు, కమ్మ కమిటీలకు పార్టీలు ప్రాధాన్యమిస్తున్నాయి. అయితే ఈ కమిటీలు పూర్తిస్థాయిలో పనిచేస్తేనే ఆ పార్టీల లక్ష్యం నెరవేరే అవకాశం ఉంది. క్షేత్రస్థాయి నుంచి నెట్వర్క్.. ఓటర్లను నేరుగా ప్రభావితం చేసేందుకు అన్నిపార్టీలు క్షేత్రస్థాయి నుంచి నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకొన్నాయి. బూత్‌కమిటీ, కమ్మ కమిటీలను సమన్వయపరిచేందుకు ఐదు గ్రామాలకు ఒక పార్టీ నాయకుడిని ఇన్‌చార్జీగా నియమించారు. ఈ గ్రామాల ఇన్చార్జీలను సమన్వయం చేసేందుకు మండల స్థాయిలో ఒక నాయకుడు, మండల స్థాయిలో నాయకులను సమన్వయ పరిచేందుకు నియోజకవర్గ స్థాయిలో పార్టీ సీనియర్ నేత ఒకరు పనిచేస్తున్నారు. దాదాపు అన్ని పార్టీలు ఇంచుమించు ఇదే తరహాలో ప్రచార కమిటీలు నియమించడం విశేషం. ఈ కమిటీల ద్వారా ఆయా గ్రామాల్లో ప్రచారం నిర్వహించడంతో పాటు, ఇతర పార్టీలకు చెందిన, తటస్థులుగా ఉన్న వాళ్లను పార్టీలో చేర్చుకునే పనిచేపట్టారు. ఇదిలాఉంటే కులాలు, మహిళా సంఘాలను ప్రభావితం చేసేపనిని కూడా కొంతమంది నేతలకు అప్పగించారు. ఇప్పటికే ఆయా సంఘాలతో టచ్‌లో ఉన్న సదరు నేతలు, పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. పోరు హోరాహోరీగా కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో ఓటర్లను వ్యక్తిగతంగా ప్రభావితం చేసే అంశాలపైనే అన్ని పార్టీల అభ్యర్థులు దృష్టి సారించారు. -
గెలుపు వ్యూహంలో బీజేపీ
సాక్షి, హన్మకొండ: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా భారతీయ జనతాపార్టీ వ్యూహాలకు పదును పెడుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలోనూ తన సత్తా చాటాలని చూస్తోంది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలతోపాటు, అనంతరం వచ్చే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే పొరుగు రాష్ట్రం కర్ణాటకకు చెందిన బీజేపీ నాయకులను అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా బాధ్యులను నియమించింది. వీరిని సమన్వయం చేసేందుకు పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో మరో ఇన్చార్జిని నియమించింది. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇద్దరేసి చొప్పున ఇన్చార్జిలను నియమించగా వారు జిల్లాకు చేరుకున్నారు. వారికి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో సమన్వయకర్తగా కర్ణాటక శాసనమండలి సభ్యుడు రఘునాథ్‌రావు మస్కపురిని పార్టీ జాతీయ నాయకత్వం నియమించింది. బీజేపీ వరంగల్ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట, పరకాల, భూపాలపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఇన్చార్జీలను నియమించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమిక పోషించడంతో పాటు పార్లమెంట్లో బిల్లుకు మద్దతు తెలిపి రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ కీలకంగా వ్యవహరించింది. ఈ క్రమంలో తెలంగాణలో పాగా వేయాలనే పట్టుదలతో బీజేపీ జాతీయ నాయకత్వం ముందుకు పోతోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తరచూ రాష్ట్ర పర్యటిస్తూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇటీవల కరీంనగర్లో జరిగిన బహిరంగ సభలో అమిత్ షా పాల్గొని ప్రసంగించారు. హైదరాబాద్‌లో పోలింగ్ బూత్ కమిటీల సభ్యుల సమావేశంలో పాల్గొని ఎన్నికల ఎదుర్కోవడంపై సూచనలు చేశారు. బూత్ స్థాయి కమిటీల నిర్మాణం.. బీజేపీ జాతీయ నాయకత్వం పార్టీని క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేయడంలో భాగంగా బూత్ స్థాయి కమిటీలు ఏర్పాటు చేసింది. బూత్ స్థాయిలో పార్టీని పటిష్టం చేయడం ద్వారానే ఎన్నికల్లో సులువుగా విజయం సాధించవచ్చని పార్టీ నమ్మకం. ఇందులో భాగంగా పోలింగ్ కేంద్రాల వారిగా శక్తి కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లేందుకు కృషి చేసింది. కర్ణాటక నుంచి వచ్చిన నియోజకవర్గ బాధ్యులు పోలింగ్ బూత్‌ల వారిగా కమిటీల వివరాలు సేకరిస్తూ పార్టీ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పార్టీ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి ద్వారా జాతీయ నాయకత్వానికి సమాచారమిస్తున్నారు. గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో అప్పటి హన్మకొండ పార్లమెంట్ నియోజకవర్గంతోపాటు అప్పటి హన్మకొండ, ప్రస్తుత వరంగల్ పశ్చిమ నియోజకవర్గం, వర్ధన్నపేట, పరకాల, పూర్వ శాయంపేట నియోజకవర్గాల్లో బీజేపీ నుంచి ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహించారు. దీంతో జిల్లాలో మరోసారి పట్టు నిలుపుకోవాలనే ధృడసంకల్పంతో బీజేపీ నాయకత్వం ఉంది. -
30 వరకు ఇంటింటా ఓటర్ల గణన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఇంటింటా ఓటర్ల గణన చేపట్టనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ ప్రకటించారు. 2019 ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా జూన్ 30 వరకు ఈ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. బుధవారం అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమైన ఆయన పోలింగ్ కేంద్రంలో బూత్ లెవల్ ఏజెంట్లను నియమించి సవరణ పక్కాగా నిర్వహించేందుకు సహకరించాలని కోరారు. -
నమ్మకానికి,నిబద్ధతకు ప్రతీక వైఎస్ జగన్
-
నేటి నుంచి పోలింగ్ స్లిప్‌ల పంపిణీ
చౌటుప్పల్/కలెక్టరేట్, న్యూస్‌లైన్,మొదటి విడతలో ప్రాదేశిక ఎన్నికలు జరిగే మండలాల్లో గురువారం నుంచి పోలింగ్ స్లిప్‌లను పంపిణీ చేయాలని కలెక్టర్ టి.చిరంజీవులు బూత్‌లెవల్ సిబ్బందిని ఆదేశించారు. మొదటి విడతలో ఎన్నికలు జరిగే మండలాలకు చెందిన జోనల్ అధికారులతో బుధవారం సాయంత్రం చౌటుప్పల్ తహసీల్దార్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సూర్యాపేట, మిర్యాలగూడ, దేవరకొండ రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 33 మండలాల్లో మొదటి విడతలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఈ నెల 6న జరగనున్నాయన్నారు. ఇప్పటికే బ్యాలెట్బాక్సులు, బ్యాలెట్ పేపర్లు అన్ని మండలాలకు పంపిణీ చేశామని చెప్పారు. గురువారం ఎన్నికల అధికారులు బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లను సరిచూసుకోవాలన్నారు. మొదటి విడత ఎన్నికలు జరిగే డివిజన్లలో 500 పోలింగ్ కేంద్రాలను అతి సమస్యాత్మకమైనవిగా, 800 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు *2కోట్ల వరకు నగదు పట్టుకున్నామని, 8 ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులు నమోదు చేశామని వివరించారు. బుధవారం చౌటుప్పల్‌లో పట్టుబడిన *1.62 కోట్ల విషయాన్ని ఆదాయపన్ను శాఖ అధికారులకు తెలియజేశామని చెప్పారు. మద్యాన్ని కూడా భారీగా నియంత్రించామని, గత ఏడాది ఏప్రిల్‌లో సరఫరా చేసిన కోటానే ప్రస్తుతం మద్యం దుకాణాలకు సరఫరా చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎన్నికల అధికారి చంద్రశేఖర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, జగన్‌రెడ్డి, శకుంతల, దేవసహాయం, శేషాద్రి, శ్రీనివాస్‌రావుతో పాటు కలెక్టరేట్ నుంచి జేసీ హరిజవహర్‌లాల్, ఏజేసీ వెంకట్రావు, ఎన్నికల పరిశీలకులు ప్రియదర్శిని, జెడ్పీ సీఈఓ దామోదర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.