టెలీకాన్ఫరెన్స్ ద్వారా తిరువళ్లూరులోని బూత్ ఏజెంట్‌లతో ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ
తిరువళ్లూరు(తమిళనాడు): కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించగా ఆయన ఆశయాలకు తిలోదకాలిచ్చి కాంగ్రెస్‌తోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పొత్తుపెట్టుకున్నారని ప్రధాని మోదీ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాబును ఎన్నటికీ క్షమించరని ఆయన విమర్శించారు. ‘నా పోలింగ్ బూత్ బలమైన పోలింగ్ బూత్’ పేరిట ప్రధాని మోదీ ఇటీవల పార్టీ బూత్ కమిటీల సభ్యులతో ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నారు.
గత నాలుగున్నరేళ్లలో బీజేపీ ప్రభుత్వం అమలుచేసిన పథకాలను వివరిస్తూ కార్యకర్తలను ఉత్సాహ పరుస్తున్నారు. ఇందులో భాగంగానే తమిళనాడులోని తిరుచ్చి, మదురై, చెన్నై సెంట్రల్, నార్త్ చెన్నై, తిరువళ్లూరు తదితర ప్రాంతాలకు చెందిన బీజేపీ బూత్ కమిటీ సభ్యులతో ఆదివారం ప్రత్యేక టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. గత నాలుగున్నరేళ్లలో బీజేపీ చేపట్టిన సంక్షేమ పథకాలను ఈ సందర్భంగా మోదీ వారికి వివరించారు. అనంతరం కార్యకర్తల ప్రశ్నలకు సమాధానం చెబుతూనే, భవిషత్తు కార్యాచరణపై దిశా నిర్దేశం చేశారు.
పార్టీ నేత ఒకరు వచ్చే ఎన్నికల్లో పొత్తు ఎవరితో ఉంటుందని ప్రశ్నించగా మోదీ సమాధానమిస్తూ బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడే వారితోనే ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటామన్నారు. ఈ విషయంలో ఎవరూ కూడా అపోహలకు గురి కావద్దన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీని స్థాపించి విజయం సాధించారన్నారు. అయితే, ఎన్టీఆర్ ఆశయాలకు నీళ్లొదిలి కాంగ్రెస్‌తోనే పొత్తు పెట్టుకున్న ప్రస్తుత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును ఆ«ంధ్రప్రదేశ్ ప్రజలు క్షమించబోరన్నారు. అలాంటి అనైతిక పొత్తులకు బీజేపీ పాకులాడబోదని కార్యకర్తలకు హమీ ఇచ్చారు.
ఇటీవల మహా కూటమి అంటూ మాట్లాడుతున్న నేతలకు స్వలాభం, పదవుల యావ తప్ప మరేమీ లేదని విమర్శించారు. ఈ కూటమి కులీన కుటుంబాల అపవిత్ర కూటమి అని నిప్పులు చెరిగారు. అందులో ఉన్న పార్టీల నేతలంతా ఒకప్పుడు కాంగ్రెస్ పోకడలతో భంగపడిన వారేనని అన్నారు. ‘సోషలిస్ట్ నేత రామ్ మనోహర్ లోహియానే తమకు ఆదర్శమని చెప్పుకుంటున్న ఈ నేతలు.. పార్టీ సిద్ధాంతాలు, జాతిహితంపై రాజీపడే పార్టీగా కాంగ్రెస్‌ను ఆయన తిట్టిపోసేవారని గుర్తుంచుకోవాలి. కూటమి నేతలు ఎమర్జెన్సీ సమయంలో జైలు జీవితం గడిపిన వారే. సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయం సింగ్‌ను అక్రమ కేసులతో కాంగ్రెస్ వేధించింది. గతంలో కాంగ్రెస్, డీఎంకేల నడుమ బద్ధవైరం ఉన్న విషయాన్ని ఎవరూ మర్చిపోలేరు. తమిళనాడులో డీఎంకే అయినా ఉండాలి లేదా తామైనా ఉండాలని అప్పట్లో విర్రవీగిన కాంగ్రెస్.. నేడు ఆ పార్టీతో అంటకాగడం అవకాశవాదం తప్ప మరేమీ లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment