
న్యూఢిల్లీ: ఒక కుటుంబ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ సమాజాన్ని చీలుస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు. బీజేపీ మాత్రం సుఖసంతోషాలను వ్యాపింపజేస్తూ, ప్రజలను కలుపుతోందని అన్నారు. దాడుల భయంలో గుజరాత్ నుంచి ఇతర రాష్ట్రాల ప్రజలు తరలిపోతున్న నేపథ్యంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ బుధవారం రాయ్‌పూర్, మైసూర్, దామో, కారౌలి–ధోల్పూర్, ఆగ్రా నియోజకవర్గాలకు చెందిన బీజేపీ కార్యకర్తలతో ముచ్చటించారు. ఎన్నికల వేళ బీజేపీకి వ్యతిరేకంగా మహాకూటమి ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న ప్రతిపక్షాలపై ఆయన మండిపడ్డారు.
బెయిల్‌పై బయట ఉన్న కొందరు తమనితాము కాపాడుకునేందుకు ఒక్కటవుతున్నారని ఎద్దేవా చేశారు. వారు ప్రజల కోసం కలవడంలేదని, తనని అధికారం నుంచి తప్పించడమే వారి లక్ష్యమని అన్నారు. ‘ప్రతిదాన్ని ఎన్నికలతో ముడిపెడితే వాటి ప్రాధాన్యం తగ్గిపోతుంది. ఇందుకు సర్ చోటూరామ్ విగ్రహావిష్కరణ, స్వచ్ఛ్ భారత్ అభియాన్‌లే ఉదాహరణలు. బీజేపీ చేస్తున్న సామాజిక సేవ కొనసాగుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో సుఖశాంతులు తీసుకొచ్చేందుకు మనం ప్రయత్నిస్తుంటే, వారు (కాంగ్రెస్) ఒక కుటుంబం కోసం సమాజంలో చీలికలు తెస్తున్నారు. కార్యకర్తల అభిప్రాయాలు, సూచనలకు ప్రభుత్వం, పార్టీ అధిక ప్రాముఖ్యమిస్తాయి. అందువల్లే ప్రభుత్వ పథకాల ప్రయోజనాల్ని పేదలు, అణగారిన వర్గాలకు చేరువచేయగలుగుతున్నాం’ అని మోదీ అన్నారు.