Boris Becker
-
బోరిస్ బెకర్‌కు జైలుశిక్ష
లండన్: దివాలా కేసులో జర్మనీ టెన్నిస్ దిగ్గజం బోరిస్ బెకర్‌కు రెండున్నరేళ్ల జైలుశిక్ష విధించారు. 54 ఏళ్ల బెకర్ తన దగ్గర రుణ చెల్లింపులకు ఏమీ లేదని, దివాలా తీశానని ప్రకటించి... ఉన్న ఆస్తిపాస్తుల్ని దాచి, అక్రమంగా పెద్దమొత్తంలో నగదు బదిలీ చేశాడు. దీనిపై విచారించిన లండన్ కోర్టు దివాలా చట్టం ప్రకారం శిక్ష విధించింది. మొత్తం నాలుగు కేసులకి సంబంధించి గరిష్టంగా ఏడేళ్లదాకా జైలుశిక్ష విధించే అవకాశముంది. అయితే వాదోపవాదాల అనంతరం రెండున్నరేళ్ల శిక్షను ఖరారు చేసింది. జర్మనీలోని బ్యాంక్‌కు 50 లక్షల డాలర్ల (రూ.38.25 కోట్లు) రుణాన్ని చెల్లించకుండా అనైతిక పద్ధతిలో బోరిస్ బెకర్ దివాలా పిటిషన్‌తో బయటపడాలని చూశాడు. 2012 నుంచి బ్రిటన్‌లో నివసిస్తున్న బెకర్ మొత్తం ఆరు (వింబుల్డన్ –1985, 1986, 1989; ఆస్ట్రేలియన్ ఓపెన్–1991, 1996; యూఎస్ ఓపెన్–1989) గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్స్ సాధించాడు. -
ఫ్యాన్స్‌కు దూరంగా... ఫ్యాన్సీ డ్రెస్‌లో!
ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తిని గుర్తుపట్టగలరా... పాప్‌స్టార్ పోలికలతో ఉన్న ఇతను ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడంటే ఆటకు వీరాభిమానులు కూడా కాస్త ఆలోచిస్తారేమో! ఎందుకంటే ఇది దాదాపు మూడు దశాబ్దాలనాటి చిత్రం. ఇక్కడ ఉన్నది దిగ్గజ ఆటగాడు బోరిస్ బెకర్. 1985లో బెకర్ 17 ఏళ్ల వయసులో వింబుల్డన్ గెలిచి సంచనలం సృష్టించిన తర్వాత తీసిన ఫోటో ఇది. ఈ గెలుపుతో ప్రపంచవ్యాప్తంగా హాట్‌స్టార్‌గా మారిపోయిన బెకర్ అభిమానులనుంచి తప్పించుకునేందుకు అలా చేయాల్సి వచ్చింది. నాడు స్వదేశం జర్మనీలో అయితే బెకర్ అంటే ఒక రకమైన పిచ్చి, క్రేజ్! వింబుల్డన్ విజయానికి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అతను నాటి జ్ఞాపకాలను పంచుకున్నాడు. వింబుల్డన్ విజయంతో ఎక్కడకు వెళ్లినా జనం చుట్టుముట్టడంతో ఇలా అయితే స్వేచ్ఛగా తిరగలేనని భావించి ప్రత్యేకంగా ఒక ఫ్యాన్సీ షాప్‌కు వెళ్లి కొత్త రకం డ్రెస్‌ను, రింగుల జుట్టు గల విగ్‌ను కొనుక్కున్నాడు. అలా వేసుకున్నప్పుడు తీసుకుందే ఈ ఫోటో. అయితే ఇంతా చేసినా కొంత మంది గుర్తు పట్టేసి మీద పడిపోయారట! -
జొకోవిచ్ కోచ్‌గా బెకర్
బెల్గ్రేడ్: వచ్చే ఏడాది మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకోవాలని.. మరిన్ని గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గాలనే లక్ష్యంలో భాగంగా సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ జర్మనీ దిగ్గజం బోరిస్ బెకర్‌ను తన ప్రధాన కోచ్‌గా నియమించుకున్నాడు. ఇంతకాలం ప్రధాన కోచ్‌గా ఉన్న మరియన్ వజ్దా స్థానంలో బెకర్ వస్తాడు. అయితే కోచ్‌ల బృందంలో వజ్దాతోపాటు మిల్జాన్ అమనోవిచ్, గెబార్డ్ ఫిల్ గ్రిటిష్ కూడా కొనసాగుతారని ప్రస్తుతం ప్రపంచ రెండో ర్యాంకర్‌గా ఉన్న జొకోవిచ్ తెలిపాడు. 46 ఏళ్ల బెకర్ తన కెరీర్లో ఆరు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్‌తో కలిపి మొత్తం 64 టోర్నమెంట్లలో విజేతగా నిలిచాడు. వచ్చే ఏడాదిలో జనవరి 13న మొదలయ్యే సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి జొకోవిచ్‌తో కలిసి బెకర్ పనిచేస్తాడు. జొకోవిచ్, సెరెనాలకు ఐటీఎఫ్ పురస్కారాలు అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) 2013 సంవత్సరానికి జొకోవిచ్, సెరెనా విలియమ్స్‌లను వరల్డ్ చాంపియన్స్‌గా ప్రకటించింది. జొకోవిచ్‌కిది వరుసగా మూడో పురస్కారం కాగా సెరెనా ఖాతాలో నాలుగోసారి చేరింది.