Chris Gayle: ఐసీసీ వద్దంది, ఇప్పుడు నేను యూనివర్స్ బాస్ కాదు..
Chris Gayle Universe Boss: వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్‌ను ప్రపంచవ్యాప్తంగా అతని అభిమానులు ముద్దుగా యూనివర్స్ బాస్ అని పిలుస్తుంటారు. ఈ ట్యాగ్ అతనికెవరూ ఇవ్వకపోయినా తనతంట తానే అలా ఫిక్స్ అయిపోయాడు. అతని బ్యాట్ మీద కూడా యూనివర్స్ బాస్ అనే స్టిక్కర్ ఉంటుంది. అయితే, ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో గేల్ బ్యాట్‌పై యూనివర్స్ బాస్‌కు బదులు 'ది బాస్' అని రాసుండటం చర్చనీయాంశంగా మారింది. దీంతో గేల్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు.
Chris Gayle's got some fresh stickers after a short conversation with the ICC! 😅 #WIvAUS pic.twitter.com/99nxhrBrGP
— cricket.com.au (@cricketcomau) July 13, 2021
తాను యూనివర్స్ బాస్‌గా చెలామణి కావడం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ)కి ఇష్టం లేదని, ఐసీసీ అభ్యంతరం తెలపడంతోనే యూనివర్స్ బాస్‌ను ది బాస్‌గా మార్చుకున్నానని మ్యాచ్ అనంతరం తెలిపాడు. యూనివర్స్ బాస్‌పై ఐసీసీకి కాపీరైట్స్ ఉన్నాయని, దానిపై నేను ముందే కాపీరైట్స్ పొందాల్సి ఉండిందని పేర్కొన్నాడు. సాంకేతికంగా క్రికెట్లో ఐసీసీయే బాస్. వాళ్లతో నేను పనిచేయను. ఐసీసీతో సంబంధం లేదు. బ్యాటింగ్‌లో నేనే బాస్. అంటూ మ్యాచ్ అనంతరం గేల్ వ్యాఖ్యానించడం హాట్ టాపిక్‌గా మారింది. దీనికి సంబంధించిన ఓ వీడియోను క్రికెట్ ఆస్ట్రేలియా తమ అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది.
ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో గేల్ సిక్సర్ల వర్షం కురిపించాడు. 38 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 67 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో 5 మ్యాచ్‌ల టీ20 సిరస్‌ను మరో రెండు మ్యాచ్‌లుండగానే విండీస్ 3-0తో కైవసం చేసుకుంది. ఇక ఇదే మ్యాచ్‌లోనే గేల్ టీ20ల్లో 14 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. పొట్టి ఫార్మాట్లో ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. గేల్ ఇప్పటివరకు 431 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఈ జాబితాలో గేల్ తర్వాతి స్థానాల్లో పోలార్డ్ 10836 పరుగులు, షోయబ్ మాలిక్ 10741, వార్నర్10017, విరాట్ కోహ్లీ 9235లు ఉన్నారు.