Boxing india
-
భారత బాక్సింగ్ సంఘంపై వేటు
న్యూఢిల్లీ: భారత బాక్సింగ్ సంఘంపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు అంతర్జాతీయ అమోచ్యూర్ బాక్సింగ్ అసోసియేషన్ (ఏఐబీఏ) మరోసారి స్పష్టం చేసింది. అక్టోబర్ 3న గువాహటిలో జరిగే వార్షిక సమావేశానికి ఇప్పటికే సస్పెండయిన బాక్సింగ్ ఇండియా షెడ్యూల్ ను ఖరారు చేయడం చెల్లుబాటు కాదని, ఆ సమావేశానికి విలువ ఉండబోదని తెలిపింది. ఈమేరకు మంగళవారం భారత బాక్సింగ్ సంఘానికి ఏఐబీఏ చైర్మన్ కిషన్ నార్సీ ఈ-మెయిల్ ద్వారా తెలియజేశారు. రెండు వారాల పాటు జాతీయ స్థాయిలో జరిగే వార్షిక సమావేశాల షెడ్యూల్ ను ఏఐబీఏ పరిధిలో పనిచేసే అడ్ హక్ కమిటీ మాత్రమే ఖరారు చేస్తుందని నార్సీ పేర్కొన్నారు . భారత బాక్సింగ్ అసోసియేషన్ కు సంబంధించి సలహాలు, సూచనలకు ఏఐబీఏ ఆమోదం తప్పనిసరిగా పొందాలని నార్సీ తెలిపారు. దీన్ని ఉల్లంఘించినందున భారత బాక్సింగ్ సంఘంపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు తెలిపారు. ఈ తాజా సస్పెన్షన్ వేటు త్వరలో దోహాలో జరిగే వరల్డ్ చాంపియన్ షిప్ పోటీలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. -
బాక్సింగ్ ఇండియాను గుర్తించడం లేదు
తేల్చి చెప్పిన ఐఓఏ జాతీయ క్రీడా సమాఖ్యలకు నిధులు కామన్వెల్త్, ఆసియా క్రీడల విజేతలకు రివార్డులు ఏజీఎంలో నిర్ణయాలు చెన్నై: నూతనంగా ఏర్పడిన బాక్సింగ్ ఇండియా (బీఐ)కు గుర్తింపునిచ్చేది లేదని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) స్పష్టం చేసింది. శుక్రవారం జరిగిన తమ సాధారణ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో సభ్యులు ఈ మేరకు తీర్మానించారు. బీఐకి ఇంతకుముందే తమ మాతృక బాడీ అయిన అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ-ఐబా) నుంచి గుర్తింపు లభించింది. మరోవైపు ‘ఐబా’ నిషేధానికి గురైన భారత అమెచ్యూర్ బాక్సింగ్ సమాఖ్య (ఐఏబీఎఫ్)ను ఇప్పటికీ తాము గుర్తిస్తున్నట్టు ఐఓఏ అధ్యక్షుడు ఎన్.రామచంద్రన్ తెలిపారు. దీంతో పూర్తిగా అయోమయ పరిస్థితి నెలకొన్నట్టయ్యింది. ‘బాక్సింగ్ వ్యవహారాన్ని మా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించాం. దీంతో బీఐకి గుర్తింపునివ్వరాదని ఏకగ్రీవంగా తీర్మానించాం. బీఐకి జరిగిన ఎన్నికల కోసం అటు ప్రభుత్వం కానీ, మా తరఫున కానీ పరిశీలకులు హాజరు కాలేదు. మాకిప్పటికే ఐఏబీఎఫ్ రూపంలో గుర్తింపు పొందిన బాక్సింగ్ సంఘం ఉంది. ఐఓఏ ఆధ్వర్యంలోనే ఎన్నికలు జరగాలని ఐబా అధ్యక్షుడితో గతంలో మాట్లాడాం. కానీ మా సూచనలను వారు పట్టించుకోకుండా ఏకపక్షంగా ఎన్నికలకు వెళ్లారు. భారత్‌లో ఓ సమాఖ్యకు ఎన్నికలు జరిగితే వాటిలో మా భాగస్వామ్యం లేకపోతే ఎలా?’ అని రామచంద్రన్ ప్రశ్నించారు. క్రీడా సమాఖ్యలకు ఆర్థిక సహాయం దేశంలోని ఆయా క్రీడా సమాఖ్య (ఎన్ఎస్ఎఫ్)లకు ఆర్థికపరంగా వెన్నుదన్నుగా నిలిచేందుకు ఐఓఏ ముందుకు రానుంది. ఈ మేరకు కార్పొరేట్ స్పాన్సర్షిప్లను ఆకర్షించేందుకు ప్రయత్నించనుంది. అలాగే ఎన్ఎస్ఎఫ్, రాష్ట్రాల ఒలింపిక్ సంఘాలకు ప్రతీ ఏడాది రూ.3 లక్షల గ్రాంట్‌ను ఇవ్వనుంది. ఈ ఏడాది జరిగిన కామన్వెల్త్, ఆసియా గేమ్స్‌లో పతకాలు సాధించిన ఆటగాళ్లకు నగదు బహుమతులను అందించ నుంది. -
ఐఓఏ సభ్యత్వం తీసుకోండి:ఐబా
న్యూఢిల్లీ:కొత్తగా ఏర్పాటైన బాక్సింగ్ ఇండియా (బీఐ)ను భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)లో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందిగా అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఐబా) కోరింది. ‘ఇప్పటిదాకా భారత్‌లో బాక్సింగ్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నఅడ్‌హక్ కమిటీ మరెంతో కాలం కొనసాగదు. ఇక ఈ క్రీడకు సంబంధించి అన్ని స్థాయిల పోటీలను తమ సహకారంతో బీఐ చూసుకుంటుంది. అంతకన్నా ముందు బాక్సింగ్ ఇండియా ఐఓఏ సభ్యత్వం కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. త్వరలోనే ఐఓఏ చార్టర్‌ను అనుసరించి గుర్తింపు పొందుతుంది’ అని ‘ఐబా’ పేర్కొంది. భారత అమెచ్యూర్ బాక్సింగ్ సమాఖ్యను రద్దు చేసిన అనంతరం ఈ క్రీడ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ఆరుగురు సభ్యుల అడ్‌హక్ కమిటీని నియమించింది. బాక్సింగ్ ఇండియాకు ‘ఐబా’ నుంచి తాత్కాలిక గుర్తింపు లభించడంతో బాక్సర్లు అధికారికంగా భారత్ తరఫున పాల్గొనే అవకాశం లభించింది. -
‘బాక్సింగ్’ బాధ్యతలపై ఐఓఏ ఆశ్చర్యం
తమకు సమాచారమే లేదని వెల్లడి న్యూఢిల్లీ: భారత బాక్సింగ్ బాధ్యతల్ని స్పాన్సర్లకు అప్పగిస్తూ అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య (ఏఐబీఏ) తీసుకున్న నిర్ణయంపై భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఆశ్చర్యం వ్యక్తం చేసింది. తమను సంప్రదించకుండా, కనీస సమాచారం కూడా ఇవ్వకుండా నిర్ణయం తీసుకోవడమేంటని ప్రశ్నించింది. బాక్సింగ్‌కు కొత్త సమాఖ్య ఏర్పడేదాకా నిర్వహణ బాధ్యతల్ని బాక్సింగ్ ఇండియా పేరిట ఏర్పడిన స్పాన్సర్ల గ్రూపునకు ఏఐబీఏ అప్పగించిన విషయం తెలిసిందే. అయితే అంతర్జాతీయ ఒలింపిక్ కౌన్సిల్ (ఐఓసీ) నిబంధనల ప్రకారం.. ఏ గ్రూపునైనా ఆమోదించేముందు ఏఐబీఏ తప్పనిసరిగా జాతీయ ఒలిం పిక్ కమిటీని సంప్రదించాల్సివుంటుందని ఐఓఏ ప్రధాన కార్యదర్శి రాజీవ్ మెహతా తెలిపారు. తమకుగానీ, తమ అధ్యక్షుడు ఎన్.రామచంద్రన్కుగానీ ఈ విషయంలో ఎటువంటి సమాచారం లేదని ఆయన వెల్లడించారు. ‘ఏ జాతీయ క్రీడా సమాఖ్యకైనా ఐఓఏ గుర్తింపు తప్పనిసరి. అథ్లెట్లు ఎవరైనా అంతర్జాతీయ పోటీలకు ఐఓఏ తరఫునే వెళ్లాలి. ఏఐబీఏ తీరు ఐఓసీ నిబంధనలకు విరుద్ధం’ అని మెహతా అన్నారు. కొద్ది రోజుల్లో ఐఓఏ సీనియర్ సభ్యులంతా ఢిల్లీలో సమావేశమై ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటామన్నారు.