క్రమశిక్షణతోనే ఉన్నత స్థానం
సత్సంకల్పంతో ముందుకు సాగాలి
బ్రహ్మకుమారీల ‘బట్టి’ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం చినరాజప్ప
అన్నవరం : సత్సంకల్పంతో ముందుకు సాగితే అంతా మంచే జరుగుతుందనే బ్రహ్మకుమారీల సిద్ధాంతం తనను ఎంతగానే ప్రభావితం చేసిందని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. బ్రహ్మకుమారీలు ప్రతిపాదించే ఈశ్వరతత్వం, యోగాభ్యాసం వంటి వాటిని ఆచరించడం వల్లే తనలో క్రమశిక్షణ అలవడిందన్నారు. తాను ఉన్నత స్థానానికి చేరుకోవడానికి అది కారణమైందని చెప్పారు. అన్నవరం దేవస్థానంలోని సీతారామ సత్రంలో బుధవారం బ్రహ్మకుమారీలు నిర్వహించిన ‘సిద్ధి స్వరూప సాధన బట్టి’ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ తాను బ్రహ్మకుమారీ సమాజంలో సభ్యుడనని చెప్పారు. రాజస్థాన్లోని మౌంటు అబూలోని బ్రహ్మకుమారీల విశ్వవిద్యాలయ కేంద్ర కార్యాలయాన్ని పలుమార్లు సందర్శించినట్టు తెలిపారు. ఎంపీ తోట నరసింహం మాట్లాడుతూ శాంతి, ప్రేమ, సత్సంకల్పం ద్వారా దేన్నయినా సాధించవచ్చనే బ్రహ్మకుమారీల సిద్ధాంతం ప్రస్తుత పరిస్థితుల్లో ఆచరణీయమన్నారు. విశిష్ట అతిథిగా రాజయోగిని, ఢిల్లీ ఓం శాంతి రిట్రీట్ సెంటర్ ఇన్చార్జి బ్రహ్మకుమారి ఆశా దీదీ మాట్లాడుతూ శ్రద్ధ, మనస్సులో దృఢత్వం, ఏకాగ్రతతో ఏ పని చేసినా సత్ఫలితాలను ఇస్తుందని తెలిపారు. అనంతరం వేదిక మీద ప్రముఖులంతా ‘బట్టి’ కేకును కట్ చేశారు. బ్రహ్మకుమారీల కాకినాడ యూనిట్ ఇన్చార్జి బీకే రజనీ బెహన్ మాట్లాడుతూ 13 ఏళ్లుగా అన్నవరం దేవస్థానంలో బట్టి కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. బుధవారం నుంచి శనివారం వరకూ తెల్లవారుజాము 4 గంటల నుంచి రాత్రి వరకూ వివిధ ఆధ్మాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, అన్నవరం దేవస్థానం చైర్మన్ రాజా ఐ.వి.రోహిత్, పలు ప్రాంతాల నుంచి వచ్చిన బ్రహ్మకుమారి, బ్రహ్మకుమార్లు పాల్గొన్నారు.