రైతులపై శ్రద్ధ లేని ప్రభుత్వం
= ఎన్నికల్లో ఇచ్చిన ధరల స్థిరీకరణ హామీ ఏమైంది ?
= ఒక్కరోజైనా రైతు సమస్యలపై పాలకులు చర్చించారా ?
= వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరపై జరిగిన చర్చా వేదికలో రైతు నాయకుల ధ్వజం
ఒంగోలు టూటౌన్: వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించడంలో పాలకుల వైఫల్యంపై రైతు సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతికూల వాతావరణాన్ని సైతం ఎదుర్కొని పండించిన పంటకు కనీస మద్దతు ధర కల్పించకపోవడంపై మండిపడ్డారు. స్థానిక రంగా భవనంలో వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు కల్పనలో ప్రభుత్వాల వైఫల్యం–రైతు సంఘాల కర్తవ్యంపై సోమవారం చర్చా వేదిక నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఆచార్య రంగా కిసాన్ సంస్థ అధ్యక్షుడు ఆళ్ళ వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ మాజీ ప్రధాని చరణ్ సింగ్, ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్రెడ్డి, ఆచార్య ఎన్జీ రంగా సమయంలో రైతులను కొంత వరకైనా ఆదుకున్నారని గుర్తు చేశారు. ప్రస్తుత పాలకులు రైతులకు గిట్టుబాటు కల్పించకపోవడం, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను సకాలంలో ఆదుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత పాలకులు రైతులకు «రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ ఏర్పాటు చేస్తానని ఇచ్చిన వాగ్దానం ఏమైందని ప్రశ్నించారు. కరువు పరిస్థితుల్లో క్షామ నివారణ చర్యలు ప్రభుత్వం చేపట్టాలని ప్రకాశం జిల్లా అభివృద్ధి వేదిక జిల్లా అధ్యక్షుడు చుండూరి రంగారావు అన్నారు.
సీపీఐ ఎంఎల్ నాయకుడు పి.కోటేశ్వరరావు మాట్లాడుతూ పాలకులకు రాజధాని నిర్మాణంలో ఉన్న శ్రద్ధ రైతులపై లేదన్నారు. అసెంబ్లీలో రైతు కుటుంబాల నుంచి వచ్చామని చెప్పుకునే మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్క రోజు అయిన రైతుల సమస్యలపై సమీక్షించారా అంటూ ప్రశ్నించారు. రైతు సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి దుగ్గినేని గోపినాథ్ మాట్లాడుతూ ప్రస్తుతం మిరప, కంది, శనగ పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నా పాలకులు చోద్యం చూస్తున్నారని అన్నారు.
రైతులు, రైతు సంఘాల్లో ఐక్యత లేకపోవడం వల్లనే పాలకులకు అలుసైందని ఏపీ రైతు సంఘం నాయకుడు పమిడి వెంకట్రావు అన్నారు. పక్క రాష్ట్రాలు రైతులను ఆదుకునే తీరును మన పాలకులు ఎందుకు అనుసరించలేకపోతున్నారని మరో ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వి.హనుమారెడ్డి ప్రశ్నించారు. కార్యక్రమంలో ఆచార్య రంగా కిసాన్ సంస్థ ప్రధాన కార్యదర్శి చుంచు శేషయ్య, ఆక్వా రైతు సంఘం నాయకుడు అన్నెం కొండలరాయుడు, తెలుగు రైతు సంఘం నాయకులు కొండ్రగుంట వెంకయ్య, పెంట్యాల హనుమంతరావు, మండవ శ్రీనివాసరావు, పలు రైతు సంఘాల నాయకులు, అభ్యుదయ రైతులు పాల్గొన్నారు.