అద్భుత విజయం: పక్షవాతానికి గురైన వ్యక్తి నుంచి..
కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు అరుదైన ఘనత సాధించారు. పక్షవాతానికి గురై పూర్తిగా మాట్లాడే శక్తిని కోల్పోయిన వాళ్ల నుంచి.. చెప్పదల్చుకున్న విషయాల్ని బయటకు రప్పించే టెక్నాలజీని రూపొందించారు. ‘స్పీచ్ న్యూరోప్రోస్థెసిస్’ Speech Neuroprosthesisతో అభివృద్ధి చేసిన ఈ టెక్నాలజీ.. బ్రెయిన్ నుంచి గొంతు ద్వారా సిగ్నల్స్ సేకరించి, అటుపై పేషెంట్లు చెప్పదల్చుకున్న విషయాన్ని ఎదురుగా ఉన్న తెరపై వేగంగా డిస్ప్లే చేస్తాయి.
ఫ్లోరిడా: కాలిఫోర్నియా యూనివర్సిటీ(UCSF) న్యూరోసర్జన్ డాక్టర్ ఎడ్వర్డ్ ఛాంగ్ నేతృత్వంలోని బృందం పదేళ్ల పరిశోధనల తర్వాత ఈ విజయాన్ని సాధించింది. ఇంతకు ముందు ఇలాంటి పరిశోధనలే జరిగినప్పటికీ.. చేతి కండరాల కదలికల ద్వారా చెప్పదల్చుకున్న విషయాన్ని రాబట్టడం లాంటి ఫలితాలొచ్చాయి. కానీ, కాలిఫోర్నియా బృందం సాధించిన విజయంలో.. నేరుగా స్వర వ్యవస్థకే అనుసంధానమై ఉండడం వల్ల ఒక్కో అక్షరం కాకుండా, ఒకేసారి ఎక్కువ పదాలను తెరపై చూపించేందుకు ఆస్కారం ఏర్పడింది. తద్వారా సాధారణ వ్యక్తి మాట్లాడగలిగినట్లే.. పెరాలసిస్ బారినపడ్డ వ్యక్తి నుంచి(75 శాతం) సందేశాలను ఆశించొచ్చు. పైగా ఇది సంక్లిష్టమైన పద్ధతి కాదని, పేషెంట్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని డాక్టర్ ఎడ్వర్డ్ ఛాంగ్ వెల్లడించారు.
‘స్టెనో’ పేరుతో కొనసాగిన ఈ ప్రాజెక్ట్‌కు ఫేస్బుక్ స్పాన్సర్ చేసింది. పక్షవాతానికి గురైన వ్యక్తి నుంచి సహజంగా పదాలను బయటకు తెప్పించడం నిజంగా ఓ అద్బుత విజయంగా పేర్కొంటూ న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో బుధవారం ఈ పరిశోధనకు సంబంధించిన విషయాల్ని ప్రచురించింది. కేవలం పక్షవాతానికి గురైమాత్రమే కాదు.. ఎంతో మంది రోడ్డు ప్రమాదాల్లో, షాక్‌లతో మాట్లాడలేని స్థితికి చేరుకుంటుంటారు. వాళ్ల కోసం ఈ న్యూరాల్ టెక్నాలజీ ఉపయోగపడొచ్చని ఆ జర్నల్‌లో పలువురు వైద్యు నిపుణులు అభిప్రాయపడ్డారు.
జుకర్‌బర్గ్ ఖుష్
బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ ద్వారా(సిగ్నల్స్ చేరివేత ద్వారా) పేషెంట్ చెప్పాలనుకున్న విషయం తెరపై దానికదే టైప్ కావడం ఈ న్యూరల్ టెక్నాలజీ ప్రత్యేకం. ఇక తమ సౌజన్యంతో రూపొందించిన ఈ న్యూరల్ టెక్నాలజీ ఘన విజయంపై ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ హర్షం వ్యక్తం చేశాడు. ఈ మేరకు ఫేస్బుక్ అకౌంట్లో ఒక పోస్ట్ పెట్టాడు. ‘బ్రావో’ పేరుతో జరిగిన ఈ అధ్యయనంలో 15 ఏళ్ల క్రితం యాక్సిడెంట్లో గాయపడి కదల్లేని స్థితికి చేరుకున్న ఓ వ్యక్తిపై కాలిఫోర్నియా ప్రొఫెసర్లు పరిశోధనలు చేశారు. ‘నాకేం దాహంగా లేదు, నా వాళ్లను పిలవండి, బాగానే ఉన్నా’ లాంటి పదాల్ని ఆ వ్యక్తి వ్యక్తం చేశాడు.