ఆయకట్టు తడిసే.. రైతన్న మురిసే!
తుంగభద్ర ఎగువ కాల్వ ద్వారా ఆలూరు బ్రాంచి కెనాల్ రైతులకు ఏళ్ల తరబడి సాగునీరు అందని పరిస్థితిని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తిరగరాశారు. సాగునీరు రాక ఆయకట్టు రైతులు పంటలు నష్టపోయే పరిస్థితి లేకుండా చేశారు. రెండేళ్ల క్రితం ఆయన తీసుకున్న చర్యల కారణంగా ఎప్పుడూ నీరు లేక ఒట్టిపోయి దర్శనమిచ్చే ఏబీసీ ప్రస్తుతం నీటితో కళకళలాడుతూ ఆయకట్టు భూముల్లో సిరుల పంటకు కారణమవుతోంది.
ఆలూరు రూరల్/చిప్పగిరి : అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రాంతంలోని నిమ్మగల్ ప్రధాన రెగ్యులేటర్ నుంచి హెచ్ఎల్సీ ద్వారా ఆలూరు బ్రాంచి కెనాల్‌కు ఏటా 120 నుంచి 140 క్యూసెక్కుల టీబీ డ్యాం నీరు సరఫరా కావాల్సి ఉంది. ఈ నీటితో ఏబీసీ పరిధిలోని 19 డిస్టిబ్యూటర్ల కింద 14,225 ఎకరాల్లో పంటలు సాగు చేయాలి. అయితే వివిధ కారణాలతో 7 డీపీలకు మాత్రమే నీరు సరఫరా అవుతోంది. మిగతా డీపీల కింద ఉన్న ఆలూరు, చిప్పగిరి మండలా పరిధిలోని రామదుర్గం, నేమకల్, బెల్డోణ, హత్తిబెళగల్ తదితర గ్రామాల రైతులకు ఎదురుచూపులు తప్పేవి కాదు. నీరు రాకపోవడం, వచ్చినా సకాలంలో అందకపోవడంతో రైతులు పంటలు నష్టపోయేవాళ్లు. రైతుల పరిస్థితిని గమనించిన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సమస్య పరిష్కారానికి ఉపక్రమించారు.
హంద్రీనీవాపై దృష్టి..
హెచ్ఎల్సీకి కిలోమీటరు దూరంలోనే ఇక్కడి నీటిని అనంతపురం జిల్లాకు తీసుకెళ్తున్న హంద్రీనీవా సుజల స్రవంతి కాల్వ నిండుగా పారుతున్నా ఎగువ కాల్వ ఆయకట్టు నీటికి మొహం వాచే పరిస్తితిని ఎమ్మెల్యే గుర్తించారు. గుంతకల్ మండలం కమ్మకొట్టాల మీదుగా వెళ్తున్న ఆ కాల్వ నుంచి ఏబీసీ కెనాల్‌కు నీటిని అందించాలని సంబంధిత అధికారులను కోరారు. వారు స్పందించకపోవడంతో వాదనకు దిగారు. మన జిల్లా ఆయకట్టు అవసరాలు తీర్చిన తర్వాతే మిగతా ప్రాంతాలకు తరలించాలని పట్టుబట్టారు.
అధికార యంత్రాంగంతో పోరాటం..
ఎలాగైనా హంద్రీనీవా నీటిని ఏబీసీ ఆయకట్టుకు పారించాలని నిర్ణయించుకున్న ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఏబీసీ రైతులతో కలిసి 2014 అక్టోబర్ 19న గుంతకల్ మండలం కమ్మకొట్టాల వద్దకు చేరుకున్నారు. అక్కడ అనంతపురం జిల్లా పోలీస్ యంత్రాంగం, స్పెషల్ పార్టీ పోలీసులు అడ్డుకున్నా లెక్క చేయకుండా హంద్రీనీవా సుజలాస్రవంతి ప్రధాన కాలువకు గండి కొట్టి ఎగువ కాల్వకు నీటిని మళ్లించారు. ప్రస్తుతం ఆ కాలువ ద్వారా ఏబీసీ పరిధిలో 10 వేల ఎకరాలకు సాగునీరు అందుతోందని, ఇదంతా ఎమ్మెల్యే కృషి వల్లనే సాధ్యమైందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏబీసీ కెనాల్ కింద 10 నుంచి 16వ డీపీ వరకు నీరు పూర్తిస్థాయిలో పారుతోంది.