'ఓ సింహమా.. ఇది నా ఇల్లు'
న్యూయార్క్: సాధారణంగా కుక్కను చూస్తేనే పిల్లి అమాంతం లగెత్తుతుంది. అలాంటిది ఇక సింహాన్ని చూస్తే పరిస్థితి ఏంటి. అది కూడా కళ్లలోకి కళ్లుపెట్టి పంజా విసురుతున్నా ఏమాత్రం జంకూబొంకూ లేకుండా కనీసం పట్టించుకోకుండా ఉంటే ఎలా ఉంటుంది.. అమెరికాలోని ఓ ఇంట్లో పిల్లి ఇలాగే చేసింది. ఓ ఇంటి యజమానులు తమ ఇంట్లో రెండు పిల్లులను పెంచుకుంటున్నారు. ఆ ఇల్లు ఓ అటవీ, కొండ ప్రాంతం మధ్యలో ఉండటంతో అప్పుడప్పుడు క్రూరమృగాల చప్పుళ్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఓ రోజు పిల్లి నివాసం ఉంటున్న ఆ ఇంటి గుమ్మం వద్దకు ఓ సింహం వచ్చింది.
గుమ్మం అవతల సింహం.. గుమ్మం ఇవతలిపక్క పిల్లి. ఆ సింహాన్ని చూసి అది పరుగెత్తిందా అంటే అదేం జరగలేదు. ఏంచక్కా దానిని ఓ సాధారణ జంతువులా చూసింది. అది గాండ్రుగాండ్రుమంటున్నా చెవులు వినిపించనట్లు.. పంజావిసురుతున్న పట్టనట్లు దానివైపే చూసింది. ఈ చర్యను చూసిన సింహం.. చిరాకుతో దానిని పట్టుకునేందుకు ప్రయత్నం చేసింది. చివరికి ఏం చేసేది లేక వెనుదిరిగి వెళ్లిపోయింది. మరికాసింత దూరం వెళ్లి ఆ గుమ్మంలో ఉన్న పిల్లివైపు చూసి.. లాభం లేకపోవడంతో ఇక చేసేది మళ్లీ అడవి బాట పట్టింది. ఈలోపు మరోపిల్లి వచ్చి ఏం జరిగింది అన్నట్లుగా డేర్‌గా ఉన్న పిల్లితో ముచ్చటించడం మొదలుపెట్టింది. ఇంతకీ ఆ పిల్లిని సింహం ఎందుకు ఏం చేయలేకపోయిందని అనుకుంటున్నారా.. మరేం లేదు. ఆ గుమ్మానికి అద్దంతో చేసిన తలుపులు బిగించి ఉన్నాయి. అందుకే సింహం గుమ్మం దాటి రాలేకపోయింది. పిల్లి దర్జాగా కూర్చుంది. దీనికి సంబంధించిన వీడియోను మాబెల్ అనే వ్యక్తి యూట్యూబ్‌లో పెట్టగా షికారు చేస్తోంది.