brave women
-
భుజ్ ది ప్రైడ్ ఆఫ్ ఇండియా: మేమున్నాం!!
డిసెంబర్ 8, 1971 ఇండియా-పాక్ యుద్ధకాలం..బాంబుల భయంతో వణుకుతున్న ఊరు. బాంబులు కురిసినా సరే దేశం కోసం చనిపోయినా పరవాలేదనే సాహసోపేత నిర్ణయం. ‘మేమున్నాం’ అంటూ ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 300 మంది వీర నారీమణుల తెగువ. 72 గంటల వ్యవధిలో ఎయిర్‌ఫోర్స్ బేస్ పునరుద్ధరణ. ప్రాణాలకు తెగించి మరీ దేశభక్తిని చాటుకున్న వైనం! అంతేనా.. ప్రభుత్వ అవార్డు సొమ్మును దానం చేసిన దాతృత్వం.. జయహో.. వీరమహిళలు!! చలి పులిలా విజృంభిస్తుంది. కాని ఆ ఊరు చలితో కాదు ‘బాంబుల భయం’తో వణికిపోతుంది. అందరూ ఆకాశం వైపు భయం భయంగా చూస్తున్నారు. పాకిస్థాన్ జెట్స్ భుజ్ (కచ్ జిల్లా, గుజరాత్)లోని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌పై బాంబులు వేశాయి. ఈ నేపథ్యంలో ఎయిర్‌బేస్‌ను పునరుద్ధరించడానికి భారత వైమానిక దళం బీఎస్ఎఫ్ జవాన్ల సహాయం కోరింది. పునరుద్ధరణ తక్కువ సమయంలో జరగాలంటే ఎక్కువమంది శ్రామికులు కావాలి. వారిని వెదికిపట్టి తీసుకురావడానికి సమయం లేదు. దగ్గరి గ్రామాల్లోని వారి సహాయం కోరాలి.ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఎవరి ఇంట్లో వాళ్లు ఉన్న ఆ సమయంలో ఎవరు బయటకు వస్తారు? వచ్చినా సహాయపడతారా?రకరకాల సందేహాలను పటాపంచలుచేస్తూ... ఒక్కరు కాదు ఇద్దరు కాదు మాదపూర్ గ్రామానికి చెందిన 300 మంది స్త్రీలు ‘మేమున్నాం’ అంటూ ముందుకువచ్చారు. పునరుద్ధరణ పనుల్లో చురుగ్గా పాలుపంచుకున్నారు. డిసెంబర్ 8, 1971 ఇండియా-పాక్ యుద్ధకాలం నాటి దృశ్యం ఇది. ఆనాటి భుజ్ ఎయిర్ బేస్‌ను పునర్నిర్మించిన 300 మంది మహిళలను సగౌరవంగా గుర్తు తెచ్చుకుంటుంది ‘భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’ చిత్రం. (అజయ్ దేవ్‌గణ్, సంజయ్‌దత్, సోనాక్షిసిన్హా ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా వోటీటీలో విడుదలైంది) ఈ నేపథ్యంలో ఆనాటి జ్ఞాపకాలు ఆసక్తికరంగా మారాయి. ‘చనిపోయినా సరే, దేశం కోసం చనిపోయాను అనే తృప్తి మిగులుతుంది...అని ఒకరికొకరం ధైర్యం చెప్పుకొని పనిలోకి దిగాము’ అని ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటుంది సెఘాని అనే మహిళా యోధురాలు. ఆ 300 మంది మహిళలలో ఒకరైన హిరూ బుదియాలో మొదట ఒక సందేహం...‘వెళుతున్నాను సరే, కూలిపని తప్ప నాకు ఏది తెలియదు. నేను చేయగలనా?’ఆ తరువాత భయం... ‘పనిలో ఉండగా పై నుంచి బాంబులు పడితే... ఇంకేమైనా ఉందా!’తనలోని ధైర్యానికి, సందేహాలతో కూడిన భయానికి మధ్య ఆ సమయంలో పెద్ద యుద్ధమే జరిగింది. కాని చివరికి ధైర్యమే గెలిచింది. దేశభక్తి గొప్పతనం అదే కదా! (చదవండి : Mirabai Chanu: ట్రెడిషనల్ ఔట్ఫిట్, ట్వీట్ వైరల్) ‘చిన్నచిన్న విషయాలకే భయపడే నాకు అంతధైర్యం ఎలా వచ్చిందో తెలియదు. ఏదో శక్తి ఆవహించినట్లు అనిపించింది’ అని ఆరోజును గుర్తు తెచ్చుకుంటుంది వీరు లఖాని. 72 గంటల వ్యవధిలో ఎయిర్‌ఫోర్స్ బేస్‌ను పునరుద్ధరించే పని పూర్తయింది.యుద్ధం పూర్తయిన తరువాత గ్రూప్ అవార్డ్‌గారూ. 50,000 ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఈ మొత్తాన్ని గ్రామ పంచాయతీ కమ్యూనిటీ హాల్ కోసం ఇచ్చి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు వీరమహిళలు. -
కేరళ వరదలు: ఇంట్లోకి పాము..
వరదలు తగ్గుముఖం పట్టడంతో ఊపిరి పీల్చుకున్న కేరళ ప్రజలకు ఇప్పుడు పాముల భయం వెంటాడుతోంది. పునరావస కేంద్రాల నుంచి ఇళ్లకు చేరుతున్న వారు ప్రళయ బీభత్సం మిగిల్చిన విషాదాన్ని చూసి బోరుమంటున్నారు. వరదలతో ఇళ్లలో నక్కిన పాములను చూసి భయంతో చచ్చిపోతున్నారు. ఇప్పటికే పాము కాట్లతో కొందరు ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది చికిత్స పొందుతున్నారు. మాములుగా చిన్నకీటకాలను చూస్తేనే భయంతో వణికిపోతారు మహిళలు. అలాంటిది ఓ మహిళ తన ఇంటికి వచ్చిన ఓ కొండచిలువను ధైర్యంగా వెళ్లగొట్టిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఇంటి ప్రహారి గోడపైకి ఎక్కిన పామును ఆ మహిళ బూజు కర్రతో వెళ్లగొట్టి తమ కుటుంబాన్ని రక్షించింది. ఏ మాత్రం జంకకుండా పదేపదే కర్రను నేలకు కొడుతూ ఆ పామును వెళ్లగొట్టింది.ఆమె సాహసాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. -
యువతి ధైర్య సాహసాలకు ఎస్పీ ప్రశంసలు
రోహ్తక్: తన వస్తువులు చోరీ చేసిన దొంగను ఓ యువతి ధైర్యంగా ఎదుర్కొని, అతడి ఆట కట్టించింది. నిందితుడిని పోలీసులకు పట్టించి శభాష్ అనిపించుకుంది. ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసా పత్రం కూడా అందుకోవడంతో స్థానికంగా ఆమె సెలబ్రిటీగా మారిపోయింది. ఆ వివరాలిలా ఉన్నాయి... డింపి గులాటీ అనే యువతి హర్యానాలోని రోహ్తక్లో నివాసం ఉంటోంది. పీఎన్బీ మెట్‌లైఫ్‌లో ఆమె ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలో బుధవారం ఆమె పని మీద తన స్కూటీపై ఝజ్జర్ రోడ్డువైపుగా వెళ్తోంది. సునారియాకు చెందిన సందీప్ సింగ్ అనే దొంగ తన బైకుపై ఆమెను కాసేపు ఫాలో అయ్యాడు. ఆమె స్కూటీకి దగ్గరగా తన బైకును పోనిచ్చిన నిందితుడు.. డింపి బ్యాగును చోరీచేసి పరారయ్యేందుకు యత్నించాడు. ఆ దొంగను వెంబడించిన ఆ ధైర్యవంతురాలు కొద్దిసేపట్లోనే తన స్కూటీతో అతడి బైకును ఢీకొట్టి నిలువరించింది. అతడు కింద పడగానే అలర్ట్ అయిన డింపి.. సాయం కోసం గట్టిగా అరవడం మొదలుపెట్టింది. జరిగిన ఘటనతో కంగుతిన్న నిందితుడు ఇటుకతో తానను తానే గాయపరుచుకుని యువతిని బెదిరించి, ఆమెను దోషిగా చిత్రీకరించాలని చూశాడు. స్థానికులు అక్కడికి చేరుకుని చోరుడు సందీప్‌ను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై 379బీ, 511, 309 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తన బ్యాగులో నగదుతో పాటు విలువైన బ్యాంకు కార్డులు ఉన్నాయని దొంగను పట్టుకోవడం తప్ప తనకు మరో మార్గం కనిపించలేదని డింపి పేర్కొంది. యువ ఉద్యోగిని డింపి సాహస చర్యను రోహ్తక్ ఎస్పీ పంకజ్ నైన్ ప్రశంసించారు. డింపిని తన కార్యాలయానికి పిలిపించి వ్యక్తిగతంగా అభినందించారు. మహిళలకు డింపి చర్య స్ఫూర్తిగా నిలవాలని, అందరూ ఆమెలాగే ధైర్యంగా ఇలాంటి ఘటనలను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.