రోహ్‌తక్: తన వస్తువులు చోరీ చేసిన దొంగను ఓ యువతి ధైర్యంగా ఎదుర్కొని, అతడి ఆట కట్టించింది. నిందితుడిని పోలీసులకు పట్టించి శభాష్ అనిపించుకుంది. ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసా పత్రం కూడా అందుకోవడంతో స్థానికంగా ఆమె సెలబ్రిటీగా మారిపోయింది. ఆ వివరాలిలా ఉన్నాయి... డింపి గులాటీ అనే యువతి హర్యానాలోని రోహ్‌తక్‌లో నివాసం ఉంటోంది. పీఎన్‌బీ మెట్‌లైఫ్‌లో ఆమె ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలో బుధవారం ఆమె పని మీద తన స్కూటీపై ఝజ్జర్ రోడ్డువైపుగా వెళ్తోంది.
సునారియాకు చెందిన సందీప్ సింగ్ అనే దొంగ తన బైకుపై ఆమెను కాసేపు ఫాలో అయ్యాడు. ఆమె స్కూటీకి దగ్గరగా తన బైకును పోనిచ్చిన నిందితుడు.. డింపి బ్యాగును చోరీచేసి పరారయ్యేందుకు యత్నించాడు. ఆ దొంగను వెంబడించిన ఆ ధైర్యవంతురాలు కొద్దిసేపట్లోనే తన స్కూటీతో అతడి బైకును ఢీకొట్టి నిలువరించింది. అతడు కింద పడగానే అలర్ట్ అయిన డింపి.. సాయం కోసం గట్టిగా అరవడం మొదలుపెట్టింది. జరిగిన ఘటనతో కంగుతిన్న నిందితుడు ఇటుకతో తానను తానే గాయపరుచుకుని యువతిని బెదిరించి, ఆమెను దోషిగా చిత్రీకరించాలని చూశాడు.
స్థానికులు అక్కడికి చేరుకుని చోరుడు సందీప్‌ను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై 379బీ, 511, 309 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తన బ్యాగులో నగదుతో పాటు విలువైన బ్యాంకు కార్డులు ఉన్నాయని దొంగను పట్టుకోవడం తప్ప తనకు మరో మార్గం కనిపించలేదని డింపి పేర్కొంది. యువ ఉద్యోగిని డింపి సాహస చర్యను రోహ్‌తక్ ఎస్పీ పంకజ్ నైన్ ప్రశంసించారు. డింపిని తన కార్యాలయానికి పిలిపించి వ్యక్తిగతంగా అభినందించారు. మహిళలకు డింపి చర్య స్ఫూర్తిగా నిలవాలని, అందరూ ఆమెలాగే ధైర్యంగా ఇలాంటి ఘటనలను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.
దొంగను వెంబడించి.. అతడి బైకును ఢీకొట్టి!
Published Thu, Jul 6 2017 11:27 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM
Advertisement
Advertisement