జర్నలిస్టులతో మంత్రిగారి పేచీ
తండ్రి నుంచి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చి లాలు పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్.. ఎవరితో ఎలా ఉండాలో మాత్రం ఇంకా నేర్చుకోలేకపోయాడు. దాంతో ఎప్పుడూ కొడుకు బదులు తాను వెళ్లే లాలు.. ఈసారి కూడా ముందుకు రాక తప్పలేదు. విషయం ఏమిటంటే, తేజ్ ప్రతాప్ యాదవ్ జర్నలిస్టులతో పేచీ పెట్టుకున్నాడు. కేసు పెడతానంటూ బెదిరించడంతో వాళ్లంతా బయటకు వెళ్లిపోతామన్నారు. చివరకు లాలు రంగప్రవేశం చేసి, జర్నలిస్టులను బుజ్జగించాల్సి వచ్చింది. ఆర్జేడీ 20వ వార్షికోత్సవం సందర్భంగా పట్నాలో ఓ సమావేశం ఏర్పాటుచేశారు. దానికి లాలు తన కొడుకులిద్దరూ.. ఆరోగ్యశాఖ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్, ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌లతో వెళ్లారు.
వేదిక మీద ఉన్న తేజ్ ప్రతాప్ యాదవ్ ఓ జర్నలిస్టు వద్ద ఉన్న కెమెరా తీసుకుని సరదాగా ఫొటోలు తీయడం మొదలుపెట్టాడు. మరో జర్నలిస్టు ఈ దృశ్యాన్ని తన సెల్ఫోన్లో వీడియో తీశాడు. దాంతో మంత్రిగారికి కోపం వచ్చింది. వెంటనే ఫోన్లోంచి ఆ వీడియో తీసేయాలని చెప్పాడు. కానీ అందుకు ఆ జర్నలిస్టు నిరాకరించడంతో పరువునష్టం దావా వేస్తానని బెదిరించాడు. దాంతో మీడియా వాళ్లకు కోపం వచ్చి, మొత్తం కార్యక్రమాన్ని అంతా కలిసి బహిష్కరిస్తామన్నారు. విషయం శ్రుతి మించుతోందని గమనించిన లాలు.. వెంటనే రంగప్రవేశం చేసి జర్నలిస్టులను బుజ్జగించారు.