వాట్సాప్‌ను ఎలా నిషేధిస్తారు?
రియోడిజనిరో: వాట్సాప్‌పై నిషేధం విధించడాన్ని బ్రెజిల్ సుప్రీంకోర్టు తప్పుబట్టింది. అలా ఎలా చేస్తారని కిందిస్థాయి కోర్టును మందలించింది. వెంటనే నిషేధం ఎత్తివేయాలని ఆదేశించింది. డ్రగ్స్ రవాణా ముఠా వాట్సాప్ ద్వారా మాత్రమే కమ్యూనికేషన్ కొనసాగించారని, ఆ సమాచారం తమకు ఇవ్వాలని వాట్సాప్ పేరెంటింగ్ సంస్థ ఫేస్ బుక్‌ను బ్రెజిల్ పోలీసులు ఆశ్రయించారు. అయితే, వ్యక్తిగత సమాచారం ఇవ్వబోమని ఫేస్ బుక్, వాట్సాప్ పోలీసులకు స్పష్టం చేశాయి.
దీంతో కింది కోర్టును సంప్రదించిన విచారణ అధికారులు వాట్సాప్ పై నిషేధం విధించేలా అనుమతి తెచ్చుకున్నారు. కేసు విచారణకు తమకు సహకరించడం లేదని దాదాపు నాలుగు గంటలు వాట్సాప్ నిషేధించారు. ఈ చర్యలపట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన కొన్ని పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా కింది కోర్టును ఉన్నత న్యాయ స్థానం మొట్టికాయలు వేసింది. మంగళవారం మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో వాట్సాప్‌పై కొన్నిగంటలపాటు నిషేధం విధించారు.