రోడ్డున పడ్డ రవాణా
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఎలాంటి రాతపూర్వక ఆదేశాలు లేకుండానే ప్రభుత్వం రవాణా శాఖపై స్వారీ చేస్తోంది. ఆదాయ లక్ష్యాల కంటే ముందు ఆధార్‌అనుసంధానంపై దృష్టి సారించాలన్న ఉన్నతాధికారుల ఆదేశాలు ఆ శాఖ సిబ్బందిని ఒత్తిడికి గురి చేస్తున్నాయి. నెలకు రూ.5 లక్షల ఆదాయం సమకూర్చాల్సిన ఎంవీఐ(బ్రేక్ ఇన్స్పెక్టర్లు)లూ వాహనాలు ఆపి ఆధార్ వివరాలడగాల్సివస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వాహనాల వివరాలతో ఆధార్ నెంబర్‌ను అనుసంధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండు మూడు చోట్ల ఏకంగా వాహనదారుల ఇళ్ల వద్దకే వెళ్లి వివరాల నమోదుకు ప్రయత్నించారు. అది విఫలం కావడంతో ఎలాగైనా ఆధార్ ప్రక్రియ పూర్తి చేయాలని సిబ్బంది మెడపై కత్తి పెట్టారు.
4 నెలల్లో 20 శాతమే
జిల్లాలో సుమారు 2.5 లక్షల వాహనాలు ఉన్నాయి. మరో 2 లక్షల డ్రైవింగ్ లెసైన్సులు ఉన్నాయి. నేరాల నియంత్రణ కోసం వాహనదారుల వివరాలతో పాటు ఆధార్ కార్డు నెంబర్‌నూ కంప్యూటర్లో పొందుపర్చాలని ప్రభుత్వం చెబుతున్నా దీని వెనుక బినామీ రేషన్ కార్డుల ఏరివేతే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. ఆధార్ సీడింగ్ ద్వారా ఒకటి కంటే ఎక్కువ వాహనాలు ఉన్న వారి వివరాలు తెలుసుకుని వాళ్ల రేషన్ కట్ చేసేందుకు పన్నాగం పన్నింది. అయితే ఈ ప్రక్రియకు వాహనాదారుల నుంచి సహకారం లభించడంలేదు. సీ బుక్, లెసైన్సు, వాహన వివరాలతో పాటు ఆధార్ కార్డు వివరాలు ఇవ్వకపోతే వాహనాన్ని సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నా జిల్లాలో ఇప్పటివరకు 20 శాతం లోపే సీడింగ్ పూర్తికావడమే దీనికి నిదర్శనం.
సిబ్బందిపై ఒత్తిడి
ఈ సమస్యలను ఉన్నతాధికారులకు వివరిస్తున్నా వినడం లేదు. ఆధార్ సీడింగ్ పూర్తి చేయాల్సిందేనంటూ బయటకు పంపిస్తున్నారు. దీంతో జిల్లా ఇన్చార్జి డీటీసీతో సహా మొత్తం అధికారులు, సిబ్బంది పాలకొండ, టెక్కలి, పలాస, ఇచ్ఛాపురం, చెక్‌పోస్టు ప్రాంతాల్లో స్పెషల్‌డ్రైవ్ నిర్వహిస్తున్నారు. తొలుత ఈ కార్యక్రమాన్ని ‘మెప్మా’ సహకారంతో చేపట్టారు. అది ఫెయిల్ కావడం, ప్రభుత్వ ఒత్తిడి పెరగడంతో రవాణాశాఖ సిబ్బంది ఎవరికి వారే టార్గెట్లు విధించుకుని రోడ్డెక్కారు. ప్రస్తుతం జిల్లాలో ఒక ఎంవీఐ పోస్టు ఖాళీ ఉంది. ఉన్నవారిలో ఇద్దరు ఎంవీఐలు కొత్త. మరో ఇద్దరు మహిళలు. అయినప్పటికీ వాహనాలు, లెసైన్సుల విభాగంలో చెరో 14 శాతం ఆధార్ సీడింగ్ చేయగలిగారు. ఆధార్ కోసం వాహనాలను ఆపితే నిబంధనల ఉల్లంఘనలూ కనిపిస్తున్నాయి. ఇసుక అక్రమ రవాణా, ఓవర్ లోడింగ్ వంటి అతిక్రమణలపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇలా రోజుకు కనీసం 200 కేసులు నమోదవుతున్నాయి. వాస్తవానికి మార్చి 31లోపు ఆదాయ లక్ష్యం పూర్తిచేయాల్సి ఉండగా అందులో 80 శాతమే పూర్తి చేసి, ఇప్పుడు ఆధార్‌పై పడ్డారు.
ఆగిన చెక్‌పోస్టు ప్రతిపాదనలు
విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు యూనిట్‌గా రవాణాశాఖ పరిధిలో ప్రస్తుతం ఇచ్ఛాపురంలో ఓ చెక్‌పోస్టు నడుస్తోంది.
ఇప్పుడు జిల్లాల వారీ చెక్ పోస్టులుండాలన్న నిబంధన మేరకు పార్వతీపురంలో మరో చెక్‌పోస్టు ఏర్పాటుకు గతంలో ప్రతిపాదనలు పంపించారు. విజయనగరానికి కొత్తగా డీటీసీనీ ఇచ్చారు. వాహనాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రెండు జిల్లాలకూ సరిహద్దు ప్రాంతంలో అక్రమార్కులకు చెక్ పెట్టేందుకు చెక్‌పోస్టు అవసరం. అయినప్పటికీ రాష్ట్ర విభజన, నష్టాల్లో ఉన్నామంటూ ప్రభుత్వం కొత్త చె క్పోస్టు ఏర్పాటుకు సుముఖంగా లేదని తెలిసింది.
ఏప్రిల్ నాటికి పూర్తి
ప్రభుత్వం ఇప్పుడు అన్నింటికీ ఆధార్ అడుగుతోంది. ఎవరరైనా రవాణా శాఖ వెబ్సైట్ తెరిచి ఆధార్ నెంబర్ జోడించవచ్చు. రవాణాశాఖ కార్యాలయంలో ఆధార్ జెరాక్సు కాపీ ఇవ్వొచ్చు. ఏప్రిల్ నాటికి ఆధార్ సీడింగ్, మాకిచ్చిన ఆదాయ లక్ష్యాలను పూర్తి చేస్తామన్న నమ్మకం ఉంది.
-ఆర్.నాగేశ్వరరావు, డీటీసీ(ఎఫ్ఏసీ)