breast cancer awarenss
-
బ్రెస్ట్ క్యాన్సర్.. ప్రతి నాలుగు నిమిషాలకొక కేసు, ఇలా గుర్తుపట్టండి
మహిళల్లో వచ్చే క్యాన్సర్లలో రొమ్ముక్యాన్సర్ కేసులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. గ్లోబల్ క్యాన్సర్ అబ్జర్వేటరీ (గ్లోబోకాన్) గణాంకాల ప్రకారం మనదేశంలో ప్రతి నాలుగు నిమిషాలకొక కొత్త కేసు నమోదవుతోందని ఒక అంచనా. ఏటా 1,78,000 కొత్త కేసులొస్తున్నాయంటూ ఆ సంస్థ వెల్లడించింది. ప్రతి లక్షమంది మహిళల్లో 30 మంది కొత్తగా రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే నగరాల్లో దీని విస్తృతి ఎక్కువ. మహిళల్లో ఇంతగా కనిపించే రొమ్ముక్యాన్సర్‌ను తొలిదశల్లోనే కనుగొంటే, దాని నుంచి పూర్తిగా విముక్తి పొందవచ్చు. ఈ నెల (అక్టోబరు) ‘రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసం’ సందర్భంగా మహిళలను వెన్నాడే ఈ ఆరోగ్య సమస్య నివారణ, విముక్తిమార్గాల వంటి అంశాలతో ఓ కథనం. అన్ని క్యాన్సర్లలాగే రొమ్ముక్యాన్సర్ వ్యాప్తినీ డాక్టర్లు నాలుగు దశలుగా పేర్కొంటారు. ఇందులోని తొలిదశ లేదా రెండోదశల్లో దీన్ని గుర్తిస్తే వ్యాధిని సులభంగానే తగ్గించవచ్చు. మూడు, నాలుగు దశల్లో కూడా విముక్తి పొందేందుకు చాలావరకు అవకాశమున్నా... చికిత్స ఒకింత కష్టమవుతుంది. రొమ్ముక్యాన్సర్ నుంచి పూర్తిగా నయమయ్యేవారి సంఖ్య ఇటీవల చాలా ఎక్కువ. కొన్ని కారణాలు రొమ్ముక్యాన్సర్‌కు ప్రధానంగా రెండు రకాల కారణాలుంటాయి. మొదటిది నివారించలేనివీ, రెండు... నివారించగలిగే కారణాలు. ∙వయసు పెరుగుతున్నకొద్దీ రొమ్ముక్యాన్సర్ ముప్పూ పెరుగుతూ ఉంటుంది. ఇది నివారించలేని కారణం. ఇక కొందరు మహిళల్లో హార్మోన్లు ఎక్కువగా స్రవించడం. ఇవి మినహా మిగతావన్నీ దాదాపుగా నివారించదగిన కారణాలే. ఉదాహరణకు... ∙ఉండాల్సినదానికి మించి బరువు పెరగడం (ఊబకాయం). ∙ఆధునిక జీవనశైలిలో భాగంగా ఆహారాల్లో కొవ్వులు, కొలెస్ట్రాల్ ఎక్కువగా తీసుకోవడం. ∙పెళ్లి, తొలిచూలు బిడ్డ పుట్టడంలో ఆలస్యం జరగడం. ముప్పు ఎవరెవరిలో... ∙రెండు రొమ్ముల్లోనూ క్యాన్సర్ వచ్చిన కుటుంబాల వారిలో ఆ కుటుంబాల్లో ఒకవేళ పురుషుల్లోనూ అదే క్యాన్సర్ వస్తే బాగా దగ్గరి బంధువుల్లో (అమ్మ, అమ్మమ్మలు, అక్కచెల్లెళ్లు, మేనత్తల్లో) రొమ్ము క్యాన్సర్ ఉండటం. వారిలోనూ 40 ఏళ్లకి తక్కువ వయసులోనే దీని బారిన పడటం. ఆ కుటుంబ సభ్యుల్లోనే ఇతర క్యాన్సర్లు ఎక్కువగా కనిపించడం (ముఖ్యంగా అండాశయాల క్యాన్సర్స్ రావడం) ∙జీన్ మ్యుటేషన్స్ కనిపించడం, పదేళ్ల వయసుకు ముందే రజస్వల కావడం అలాగే 50 ఏళ్లు పైబడినా నెలసరి ఆగకపోవడం. ముందస్తు నివారణ ఇలా... మామూలుగా క్యాన్సర్ నివారణ దాదాపు అసాధ్యమే అయినా... తొలి రెండు దశల్లో గుర్తించడం ఇంచుమించు నివారణతో సమానం. కొందరిలో రొమ్ము క్యాన్సర్ ముప్పు ఎక్కువ. ఇలాంటివారు కొన్ని పరీక్షలు ద్వారా తమ ముప్పును ముందే గుర్తించవచ్చు. ఇలా గుర్తించగలిగితే, వ్యాధి నుంచి ఇంచుమించు పూర్తిగా తప్పించుకున్నట్లే. ►ఊబకాయాన్ని తగ్గించుకోవడం (ఇందుకోసం ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహార, వ్యాయామాలతో ఎత్తుకు తగినట్లు బరువును నియంత్రించుకోవాలి). ►కుటుంబ ఆరోగ్య చరిత్రలో రొమ్ము క్యాన్సర్ వచ్చినవారు ఉన్నప్పుడు... బీఆర్సీఏ1, బీఆర్సీఏ2 అనే జన్యు పరీక్షలు చేయించుకోవాలి. ఈ జన్యుపరీక్షల్లో పాజిటివ్ ఫలితాలు వస్తే రొమ్ము క్యాన్సర్ వచ్చేందుకు అవకాశాలు చాలా ఎక్కువ. ఆ రిపోర్టుల ఆధారంగా డాక్టర్ల కౌన్సెలింగ్‌తో...రొమ్ములుగానీ, ఫెలోపియన్ ట్యూబులు, అండాశయాలు తొలగించడం వల్ల రొమ్ముక్యాన్సర్ రాకుండానే నివారించవచ్చు. ►నివారించదగిన కారణాలను గుర్తించి, జీవన శైలిని మెరుగుపరచుకోవడం ద్వారా నివారించుకోవచ్చు. తొలిదశలోనే రొమ్ముక్యాన్సర్ గుర్తింపు ఇలా... ►సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ (ఎస్‌బీఈ) అనే సొంతంగా చేసుకునే పరీక్షల ద్వారా రొమ్ముల్లోని తేడాలను బట్టి...చాలావరకు ఎవరికివారే రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించడం సాధ్యమే. అందుకు చేయాల్సినవి... ► మహిళలు తమ రొమ్ముల్ని తాకుతూ పరీక్షించుకున్నప్పుడు అంతకు ముందు లేని గడ్డల వంటివి చేతికి / స్పర్శకు తెలుస్తున్నప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. నెలసరి అయిన ఏడవరోజున, స్నానం చేస్తున్నప్పుడు సబ్బుచేతితో చూసుకోవాలి. ► చర్మంపై నుంచి తాకినప్పుడు రొమ్ములోపల గడ్డ తగులుతూ ఉన్నా లేదా రొమ్ము ఆకృతిలో మార్పు కనిపించినా, చంకల్లో ఏదైనా గడ్డ కనిపించినా డాక్టర్‌కు తెలపాలి. ►ఇలాంటి గడ్డల్లో నొప్పి లేకపోయినా, రొమ్ములో సొట్టలు ఉన్నా, రొమ్ము పరిమాణంలో మార్పులు గమనించినా డాక్టర్ల దృష్టికి తీసుకెళ్లాలి. ఇక నిపుల్ విషయానికి వస్తే... అది ముడుచుకున్నట్లుగా లోపలివైపునకు తిరిగి ఉన్నా, నిపుల్ నుంచి రక్తస్రావం కనిపిస్తున్నా, పుండ్ల వంటివి కనిపించినా డాక్టర్‌ను సంప్రదించాలి. అవసరమయ్యే వైద్యపరీక్షలు... తొలుత డాక్టర్లు భౌతికంగా పరీక్షలు చేయడం, తర్వాత మామోగ్రఫీ / ఎమ్మారై / అల్ట్రాసౌండ్, కోర్ బయాప్సీ (సూది పరీక్ష), అవసరమైతే జెనెటిక్ స్క్రీనింగ్‌తో నిర్ధారణ చేస్తారు. అన్ని సందర్భాల్లోనూ ఈస్ట్రోజెన్ రిసెప్టర్, ప్రొజెస్టిరాన్ రిసెప్టర్, హర్–2 పరీక్షలూ; కొన్ని సందర్భాల్లో ఫ్రోజెన్ సెక్షన్ ఎగ్జామినేషన్ ∙ఛాతీ ఎక్స్‌రే ∙కడుపు స్కానింగ్‌తో పాటు అవసరమైతే ఎముకల స్కానింగ్ (మూడో దశలో) లేదా పెట్‌స్కాన్ చేస్తారు. చికత్స మహిళల్లో రొమ్ము క్యాన్సర్ తగ్గదనేది కేవలం అపోహ మాత్రమే. తొలి లేదా రెండో దశలో ఉన్న రొమ్ము క్యాన్సర్‌ను దాదాపుగా పూర్తిగా తగ్గించవచ్చు. ఇక కొన్ని సందర్భాల్లో శస్త్ర చికిత్స, రేడియేషన్, హార్మోనల్ థెరపీ, కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ వంటి చికిత్సలు అవసరం పడవచ్చు. క్యాన్సర్ తొలిదశలో ఉంటే రొమ్మును రక్షిస్తూ, క్యాన్సర్ ఇతర అవయవాలకు వ్యాపించకుండా ఆపవచ్చు. అప్పుడు మొదట సర్జరీ చేసి, వ్యాప్తి నివారణ కోసం ఆ తర్వాత హార్మోన్ థెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీలను చేస్తారు. రొమ్ము క్యాన్సర్‌ను మొదటిదశలోనే కనుగొంటే ఆంకో΄్లాస్టీ అనే శస్త్రచికిత్సతో రొమ్మును పూర్తిగా రక్షించడమూ సాధ్యమే. -డా. సింహాద్రి చంద్రశేఖర్ రావు, సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్. -
బిలియనీర్ దంపతుల గుండు వెనుక స్ఫూర్తి నింపే కన్నీటి కథ
జెరోదా.. స్టాక్‌మార్కెట్‌తో పరిచయం ఉన్న వారికి బాగా తెలిసి కంపెనీ. స్టార్టప్‌గా మొదలై యూనికార్న్ కంపెనీగా మారింది. కనీసం డిగ్రీ కూడా లేకుండా ఇంత పెద్ద కంపెనీకి సీఈవో అయ్యాడు నితిన్ కామత్. సంపాదనలోనే కాదు భార్యపై ప్రేమను చాటడం సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించడంలో కూడా ముందున్నాడు ఈ నియో బిలియనీర్. జెరోదా స్థాపించకముందు ఓ కాల్సెంటర్లో పని చేశాడు నితిన్ కామత్. అక్కడే పరిచయమైంది సీమా పాటిల్. ఆ తర్వాత ఈ ప్రేమ.. ఏడుడగులతో పెళ్లి బంధంలోకి ఎంటరైంది. ఈ క్రమంలో 2010లో జెరోదా ప్రారంభించడం.. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదగడం చకచకా జరిగిపోయాయి. చిన్న వయసులోనే బిలియనీర్ అయ్యాడు నితిన్ కామత్. కానీ ఇంతలోనే వారి జీవితం ఊహించని మలుపు తీసుకుంది. ఎవరికి చెప్పుకోలేక ఆరోగ్యం బాగాలేదని హస్పిటల్‌కి వెళితే బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్టుగా తెలిసింది. ఆ నిజం తట్టుకోవడం ఆ దంపతులకు కష్టమైంది. మూడు వారాల పాటు ఎవరికీ చెప్పలేదు. ఎవరు ఏమనుకుంటారో అని భయం. కానీ క్యాన్సర్‌ని ఎక్కువ కాలం దాచి పెట్టలేమని అర్థమైంది. కుటుంబ సభ్యులు, దగ్గరి ఫ్రెండ్స్‌కి మాత్రమే చెప్పి చికిత్సకి రెడీ అయ్యారు. శ్రీమతి కోసం కీమో థెరపీ ప్రారంభమయ్యేప్పుడు అసలు కష్టాలు మొదలయ్యాయి.. వెంట్రుకలు రాలుతాయి కాబట్టి ముందుగానే సీమ గుండు చేయించుకుంది. భార్యకు బాసలగా నిలిచేందుకు ఆమెకు మనోధైర్యం కలిగించేందుకు నితీన్ తాను కూడా గుండు చేయించుకున్నాడు. చికిత్స కొనసాగినన్ని రోజులు ఇద్దరు గుండుతోనే జీవితం గడిపారు. గుండు ఎందుకంటే భార్యభర్తలిద్దరు గుండుతో ఉండటం పట్ల నితిన్ కామత్ స్పందిస్తూ... క్యాన్సర్ పట్ల సమాజంలో అనేక అపోహలు ఉన్నాయి. బయటకి చెప్పకుండా లోలోపలే దాచుకోవడం సరికాదు. అందుకే నా భార్యకు ధైర్యం చెప్పడంతో పాటు సమాజంలో ఉన్న అపోహలు తొలగించాలని అనుకున్నాను. అందుకే ఆమెకు జుట్టు లేనన్ని రోజులు నాకు జుట్టు వద్దు అనుకున్నాను. గుండు చేయించుకున్నాను. మమ్మల్ని చూసి ఎవరైనా అడిగితే.. క్యాన్సర్ గురించి, చికిత్స పద్దతుల గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్లియర్‌గా చెబుతున్నాను అంటున్నాడు నితిన్ కామత్. అపోహాలు పోవాలనే ఇంత కాలం ఈ దంపతులు పరిచయం ఉన్న వారికే క్యాన్సర్ గురించి తెలుసు. అయితే ఇంటర్నేషనల్ విమెన్స్ డేని పురస్కరించుకుని సీమా తన క్యాన్సర్ స్టోరిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మహిళల్లో ఎక్కువగా వచ్చే రొమ్ము క్యాన్సర్ పట్ల అపోహలు తొలగి పోవాలనే ఈ స్టోరీ పోస్ట్ చేస్తున్నట్టు పేర్కొంది. దీంతో వీరి గుండు వెనుక రహస్యం బయటి ప్రపంచానికి తెలిసింది. ప్రస్తుతం సీమా పాటిల్ క్యాన్సర్ నుంచి కోలుకుంటున్నారు. -
నూలుతో అల్లిన ప్రొస్తెటిక్ బ్రెస్ట్‌లను రూపొందించి..
ముప్పై ఆరేళ్ల వయసులో రొమ్ము క్యాన్సర్ నుంచి కోలుకున్న డాక్టర్ రోహిణి పాటిల్ తను అనుభవించిన బాధ ఇతర బ్రెస్ట్ క్యాన్సర్ మహిళలకు రాకూడదనుకుంది. సిలికాన్ ప్రొస్తెటిక్ బ్రెస్ట్కు అయ్యే ఖర్చు అందరూ భరించలేరని, నూలుతో అల్లిన ప్రొస్తెటిక్ బ్రెస్ట్‌లను రూపొందించి, ఉచితంగా అందజేస్తోంది. 2018లో ప్రారంభించిన ‘నిటెడ్ నాకర్స్ ఇండియా’ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న మహిళలకు చేరవవుతున్నారు డాక్టర్ రోహిణి. నూలు రొమ్ముల తయారీ వెనకాల కృషి గురించి, మహిళలకు ఉచితంగా అందజేస్తున్న విధానాల గురించి ఆమె మాటల్లోనే.. ‘‘ఒక రోజు ఓ పెద్దావిడ నా శిబిరానికి వచ్చింది. ‘పది నెలల క్రితం రొమ్ము క్యాన్సర్ ఆపరేషన్ అయ్యింది. ఇప్పుడు అదే ప్లేస్‌లో గాయం కావడంతో ఆసుపత్రికి వచ్చాను’ అని చెప్పింది. నేనావిడచేత ఇంకాస్త మాట్లాడించాను. అప్పుడు ఆమె చెప్పింది విని చాలా బాధపడ్డాను. వెదురు బుట్టకు ఒక క్లాత్‌ను కలిపి కుట్టి, రొమ్ము స్థానంలో పెట్టుకుంటున్నట్టు, ఆ వెదురు కొన ఒరిపిడి వల్ల గాయమయ్యిందని చెప్పింది. రొమ్ము క్యాన్సర్ కారణంగా చికిత్సలో భాగంగా రొమ్మును తీసేస్తే అది ఆ మహిళల మానసిక స్థితిపైన తీవ్ర ప్రభావం చూపుతుంది. సిలికాన్ ప్రొస్తెటిక్ బ్రెస్ట్ల ఖరీదు ఎక్కువ కావడంతో వాటిని మహిళలకు ఉచితంగా అందించలేకపోయాను. ఒంటరి తల్లిని..? 2002లో నాకు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయినప్పుడు ఆలోచనలో పడ్డాను. మా కుటుంబంలో చిన్న వయస్సులో బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు లేవు. దీంతో నేను ఈ వ్యాధిని అంత తొందరగా అంగీకరించలేక పోయాను. పైగా ఎనిమిదేళ్ల బిడ్డకు ఒంటరి తల్లిని. నా బిడ్డ పోషణకు, చదువుకు ఖర్చులను నేనే చూసుకోవాలి. దీంతో నా చికిత్స కాస్త ఆలస్యం అయ్యింది. రొమ్ము భాగాన్ని తీసేయాల్సి వచ్చింది. చీర కట్టేటపుడు రెండు భుజాల మీదా పల్లూ పట్టుకుని ఛాతీ కనిపించకుండా ఉండేదాన్ని. నేను డాక్టర్ అయినప్పటికీ, రొమ్ము తొలగిం^è డాన్ని ఆపలేకపోయాను. చికిత్స గాయాలు మానాయి. దీంతో క్లాత్‌ను ఒక బంతిలా చేసి బ్లౌజ్ లోపల ఉంచడం ప్రారంభించాను. ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ... మా కుటుంబసభ్యుల సలహా మేరకు మరో డాక్టర్ని కలిసినప్పుడు ‘మీరు ప్రొస్తెటిక్ బ్రెస్ట్ ఎందుకు ఉపయోగించకూడదు’ అని నన్ను అడిగాడు. డాక్టర్ అయిన తర్వాత కూడా ఈ ప్రశ్న నా మదిలో ఎందుకు రాలేదనే ప్రశ్న నన్ను ఆశ్చర్యపరిచింది. వెంటనే ప్రొస్తెటిక్ బ్రెస్ట్ కొనడానికి వెళ్లాను, దాని ఖరీదు రూ. 6,000 అని చెప్పారు. ఈ మొత్తం నాకు చాలా ఎక్కువ. దీంతో సిలికాన్‌తో చేసిన ప్రొస్తెటిక్ బ్రెస్ట్ వద్దనుకున్నాను. క్యాన్సర్ చికిత్సలో భాగంగా ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ, నేను జీవించాలనే నా ఆశ వదులుకోలేదు. ప్రయత్నాల ఫలితం తక్కువ ఖర్చుతో కృత్రిమ స్తనాలను తయారు చేయాలనే విషయంపైన నా ప్రయత్నాలు సంవత్సరం పాటు కొనసాగాయి. వీటన్నింటి మధ్యలోనే నా కొడుకు పై చదువులకోసం అమెరికా వెళ్లాడు. ఒకసారి నేను మా అబ్బాయిని కలవడానికి అమెరికా వెళ్లాను. అక్కడ బ్రెస్ట్ క్యాన్సర్ గ్రూప్‌ని కలిసాను. సిలికాన్ బ్రెస్ట్‌లకు బదులుగా నూలుతో అల్లిన ప్రొస్తెటిక్ బ్రెస్ట్‌లను వారు ఉపయోగిస్తున్నారని తెలుసుకుని ఆశ్చర్యపోయాను. మన దేశానికి తిరిగి వచ్చినప్పుడు ఇక్కడ వాటిని ప్రారంభించాలనుకుని, చాలా మందిని కలిశాను. నూలు కు సరిపడా డబ్బులు ఒకరు, అల్లిన బ్రెస్ట్ పోస్టింగ్‌కు అయ్యే ఖర్చును ఒకరు.. ఇలా నా స్నేహబృందంలో కొందరు తీసుకున్నారు. అలా ‘నిటెడ్ నాకర్స్ ఇండియా’ మొదలైంది. నాకేదో ప్రయోజనం అనుకున్నవారంతా! నాతో మొదలైన ఈ ఆలోచన ఇప్పుడు ప్రజలకు చేరుతూనే ఉంది. మహిళలు కూడా వివిధ ప్రాంతాల నుండి వచ్చి చేరడం మొదలుపెట్టారు. కొందరు ఖర్చుకు డబ్బులు ఇవ్వడం, మరికొందరు నూలు బ్రెస్ట్ల అల్లిక పనిని చేపట్టారు. ముందుగా స్థానిక ప్రభుత్వాసుపత్రికి అవసరమైన మహిళలు నిట్ నాకర్లను తీసుకోమని చెబుతుండేదాన్ని. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే.. ఒకరోజు ఆసుపత్రికి చేరుకోవడం ఆలస్యమైతే చాలు మహిళల క్యూ చాంతాడంత అయి ఉంటుంది. అక్కడి వైద్యులు నన్ను చూస్తూనే ‘కృత్రిమ స్తనాలు ఇచ్చే చెల్లెలు ఎప్పుడు వస్తారు’ అని అడుగుతున్నారు. అని చెప్పేవారు. రొమ్ము క్యాన్సర్ నుండి బయటపడిన వ్యక్తిగా, ముఖ్యంగా డాక్టర్ అయినందున మహిళలకు అవగాహన కల్పించడం నా బాధ్యతగా భావించాను. మొదట్లో నాగపూర్‌లోని కాలేజీలు, ఇన్స్టిట్యూట్లు, ఇరుగు పొరుగు గ్రామాలకు వెళ్లి కనుక్కోమని మహిళలనే కోరాను. ‘మా కుటుంబంలో ఎవరికీ క్యాన్సర్ లేద’ని చాలా చోట్ల విన్నాను. సాధారణంగా ప్రజలు క్యాన్సర్‌ను జన్యుపరమైన వ్యాధిగా భావిస్తారు. అదే సమయంలో గ్రామాల్లోని మహిళల పని వ్యవసాయంతో ముడిపడి ఉండటంతో ఒకరోజు జీతం వదులుకొని, చెకప్‌కు డబ్బులు ఖర్చుపెట్టడం ఎందుకో వారికి అర్థం కాలేదు. దీంతో స్వయంగా శిబిరాలు నిర్వహించి, చెకప్‌ల కోసం మహిళలకు 50 శాతం రాయితీతో కూపన్లు పంపిణీ చేసేదానిని. ఇప్పుడు మహిళలు అర్ధం చేసుకుంటున్నారు. తమ సమ్మతిని తెలియజేస్తున్నారు’’ తన పని గురించి వివరిçస్తారు రోహిణీ పాటిల్. డాక్టర్ రోహిణీ పాటిల్ పాతికేళ్లుగా వైద్యవృత్తిలో కొనసాగుతున్నారు డాక్టర్ రోహిణి పాటిల్. మెడికల్ ఆఫీసర్‌గా, లెక్చరర్‌గా, క్యాన్సర్ అవేర్నెస్ స్పీకర్‌గా ఉన్నారు. ‘నిట్టెడ్ నాకర్స్ నాగపూర్ అనే ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు. రొమ్ము క్యాన్సర్ బారిన పడి, తగ్గిన వారికి నూలుతో అల్లిన కృత్రిమ రొమ్మును అందిస్తున్నారు. -
మహిళలకు అవగాహన పెరగాలి : డీజీపీ గౌతమ్ సవాంగ్
సాక్షి, విజయవాడ : సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలకు పోలీసుల సహకారం ఉంటుందని డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. మంగళవారం రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కోసం సిద్దార్ధ కళాశాల నుంచి నిర్వహించిన 3k వాక్ ను ఆయన ప్రారంభించారు. అనంతరం డీజీపీ మాట్లాడుతూ.. జీవనశైలిలో మార్పుల కారణంగా ఎక్కువమంది మహిళలు రొమ్ముక్యాన్సర్ బారిన పడుతున్నారని పేర్కొన్నారు. ఆహార విషయాల్లో జాగ్రత్తలు పాటిస్తూ, పౌష్టికాహారం తీసుకొని రోగనిరోధక శక్తి పెంచుకోవాలని సూచించారు. రొమ్ము క్యాన్సర్‌పై మరిన్ని అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలని నిర్వాహకులను కోరారు. -
అలరించిన ప్లాష్‌మాబ్
నెల్లూరు(అర్బన్): బ్రెస్ట్ క్యాన్సర్‌పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ నారాయణ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శన(ప్లాష్‌మాబ్) ఆకట్టుకుంది. తొలిసారిగా శనివారం నెల్లూరులోని ఎంబీజీ మాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని అందరూ ఆసక్తిగా తిలకించారు. అందరినీ ఆకర్షించేలా పింక్ టీషర్టులు ధరించిన యువతులు నృత్యాలు చేస్తూ అవగాహన కల్పించారు. నారాయణ మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలల సహకారంతో భార్గవ హెల్త్‌ప్లస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. వ్యాధిపై అవగాహన ఏర్పరచుకోవడం ద్వారా తగు వైద్యం పొంది బ్రెస్ట్ క్యాన్సర్‌ను పూర్తిగా నివారించవచ్చని రెడ్‌క్రాస్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అధికారి డాక్టర్ లక్ష్మి పేర్కొన్నారు. తన సోదరి ఇదే వ్యాధితో బాధపడుతూ మృతిచెందిందని, మరొకరు అలాంటి బాధ పడకూడదనే ఉద్దేశంతో కొన్నేళ్లుగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని భార్గవ హెల్త్‌ప్లస్ సీఈఓ ఎ.చంద్రశేఖరరెడ్డి చెప్పారు. కార్యక్రమంలో నారాయణ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీరామ్‌సతీష్, కిమ్స్(బొల్లినేని) ఈడీ గిరినాయుడు, ఎంజీ బ్రదర్స్ ఎండీ గంగాధర్, డీజిఎం రవికుమార్, శాఖవరపు వేణుగోపాల్,దేవరకొండ శ్రీనివాసులు, భాస్కర్‌నాయుడు, మహావీర్‌జైన్ పాల్గొన్నారు.