మహిళల్లో వచ్చే క్యాన్సర్లలో రొమ్ముక్యాన్సర్ కేసులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. గ్లోబల్ క్యాన్సర్ అబ్జర్వేటరీ (గ్లోబోకాన్) గణాంకాల ప్రకారం మనదేశంలో ప్రతి నాలుగు నిమిషాలకొక కొత్త కేసు నమోదవుతోందని ఒక అంచనా. ఏటా 1,78,000 కొత్త కేసులొస్తున్నాయంటూ ఆ సంస్థ వెల్లడించింది. ప్రతి లక్షమంది మహిళల్లో 30 మంది కొత్తగా రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే నగరాల్లో దీని విస్తృతి ఎక్కువ. మహిళల్లో ఇంతగా కనిపించే రొమ్ముక్యాన్సర్‌ను తొలిదశల్లోనే కనుగొంటే, దాని నుంచి పూర్తిగా విముక్తి పొందవచ్చు.
ఈ నెల (అక్టోబరు) ‘రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసం’ సందర్భంగా మహిళలను వెన్నాడే ఈ ఆరోగ్య సమస్య నివారణ, విముక్తిమార్గాల వంటి అంశాలతో ఓ కథనం. అన్ని క్యాన్సర్‌లలాగే రొమ్ముక్యాన్సర్ వ్యాప్తినీ డాక్టర్లు నాలుగు దశలుగా పేర్కొంటారు. ఇందులోని తొలిదశ లేదా రెండోదశల్లో దీన్ని గుర్తిస్తే వ్యాధిని సులభంగానే తగ్గించవచ్చు. మూడు, నాలుగు దశల్లో కూడా విముక్తి పొందేందుకు చాలావరకు అవకాశమున్నా... చికిత్స ఒకింత కష్టమవుతుంది. రొమ్ముక్యాన్సర్ నుంచి పూర్తిగా నయమయ్యేవారి సంఖ్య ఇటీవల చాలా ఎక్కువ.
కొన్ని కారణాలు
రొమ్ముక్యాన్సర్‌కు ప్రధానంగా రెండు రకాల కారణాలుంటాయి. మొదటిది నివారించలేనివీ, రెండు... నివారించగలిగే కారణాలు.
∙వయసు పెరుగుతున్నకొద్దీ రొమ్ముక్యాన్సర్ ముప్పూ పెరుగుతూ ఉంటుంది. ఇది నివారించలేని కారణం. ఇక కొందరు మహిళల్లో హార్మోన్లు ఎక్కువగా స్రవించడం. ఇవి మినహా మిగతావన్నీ దాదాపుగా నివారించదగిన కారణాలే. ఉదాహరణకు...
∙ఉండాల్సినదానికి మించి బరువు పెరగడం (ఊబకాయం).
∙ఆధునిక జీవనశైలిలో భాగంగా ఆహారాల్లో కొవ్వులు, కొలెస్ట్రాల్ ఎక్కువగా తీసుకోవడం.
∙పెళ్లి, తొలిచూలు బిడ్డ పుట్టడంలో ఆలస్యం జరగడం.
ముప్పు ఎవరెవరిలో...
∙రెండు రొమ్ముల్లోనూ క్యాన్సర్ వచ్చిన కుటుంబాల వారిలో ఆ కుటుంబాల్లో ఒకవేళ పురుషుల్లోనూ అదే క్యాన్సర్ వస్తే బాగా దగ్గరి బంధువుల్లో (అమ్మ, అమ్మమ్మలు, అక్కచెల్లెళ్లు, మేనత్తల్లో) రొమ్ము క్యాన్సర్ ఉండటం. వారిలోనూ 40 ఏళ్లకి తక్కువ వయసులోనే దీని బారిన పడటం. ఆ కుటుంబ సభ్యుల్లోనే ఇతర క్యాన్సర్‌లు ఎక్కువగా కనిపించడం (ముఖ్యంగా అండాశయాల క్యాన్సర్స్ రావడం) ∙జీన్ మ్యుటేషన్స్ కనిపించడం, పదేళ్ల వయసుకు ముందే రజస్వల కావడం అలాగే 50 ఏళ్లు పైబడినా నెలసరి ఆగకపోవడం.
ముందస్తు నివారణ ఇలా...
మామూలుగా క్యాన్సర్ నివారణ దాదాపు అసాధ్యమే అయినా... తొలి రెండు దశల్లో గుర్తించడం ఇంచుమించు నివారణతో సమానం. కొందరిలో రొమ్ము క్యాన్సర్ ముప్పు ఎక్కువ. ఇలాంటివారు కొన్ని పరీక్షలు ద్వారా తమ ముప్పును ముందే గుర్తించవచ్చు. ఇలా గుర్తించగలిగితే, వ్యాధి నుంచి ఇంచుమించు పూర్తిగా తప్పించుకున్నట్లే.
►ఊబకాయాన్ని తగ్గించుకోవడం (ఇందుకోసం ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహార, వ్యాయామాలతో ఎత్తుకు తగినట్లు బరువును నియంత్రించుకోవాలి).
►కుటుంబ ఆరోగ్య చరిత్రలో రొమ్ము క్యాన్సర్ వచ్చినవారు ఉన్నప్పుడు... బీఆర్‌సీఏ1, బీఆర్‌సీఏ2 అనే జన్యు పరీక్షలు చేయించుకోవాలి.
ఈ జన్యుపరీక్షల్లో పాజిటివ్ ఫలితాలు వస్తే రొమ్ము క్యాన్సర్ వచ్చేందుకు అవకాశాలు చాలా ఎక్కువ. ఆ రిపోర్టుల ఆధారంగా డాక్టర్‌ల కౌన్సెలింగ్‌తో...రొమ్ములుగానీ, ఫెలోపియన్ ట్యూబులు, అండాశయాలు తొలగించడం వల్ల రొమ్ముక్యాన్సర్ రాకుండానే నివారించవచ్చు.
►నివారించదగిన కారణాలను గుర్తించి, జీవన శైలిని మెరుగుపరచుకోవడం ద్వారా నివారించుకోవచ్చు.
తొలిదశలోనే రొమ్ముక్యాన్సర్ గుర్తింపు ఇలా...
►సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ (ఎస్‌బీఈ) అనే సొంతంగా చేసుకునే పరీక్షల ద్వారా రొమ్ముల్లోని తేడాలను బట్టి...చాలావరకు ఎవరికివారే రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించడం సాధ్యమే. అందుకు చేయాల్సినవి...
► మహిళలు తమ రొమ్ముల్ని తాకుతూ పరీక్షించుకున్నప్పుడు అంతకు ముందు లేని గడ్డల వంటివి చేతికి / స్పర్శకు తెలుస్తున్నప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. నెలసరి అయిన ఏడవరోజున, స్నానం చేస్తున్నప్పుడు సబ్బుచేతితో చూసుకోవాలి.
► చర్మంపై నుంచి తాకినప్పుడు రొమ్ములోపల గడ్డ తగులుతూ ఉన్నా లేదా రొమ్ము ఆకృతిలో మార్పు కనిపించినా, చంకల్లో ఏదైనా గడ్డ కనిపించినా డాక్టర్‌కు తెలపాలి.
►ఇలాంటి గడ్డల్లో నొప్పి లేకపోయినా, రొమ్ములో సొట్టలు ఉన్నా, రొమ్ము పరిమాణంలో మార్పులు గమనించినా డాక్టర్ల దృష్టికి తీసుకెళ్లాలి.
ఇక నిపుల్ విషయానికి వస్తే... అది ముడుచుకున్నట్లుగా లోపలివైపునకు తిరిగి ఉన్నా, నిపుల్ నుంచి రక్తస్రావం కనిపిస్తున్నా, పుండ్ల వంటివి కనిపించినా డాక్టర్‌ను సంప్రదించాలి.
అవసరమయ్యే వైద్యపరీక్షలు...
తొలుత డాక్టర్లు భౌతికంగా
పరీక్షలు చేయడం, తర్వాత మామోగ్రఫీ / ఎమ్మారై / అల్ట్రాసౌండ్, కోర్ బయాప్సీ (సూది పరీక్ష), అవసరమైతే జెనెటిక్ స్క్రీనింగ్‌తో నిర్ధారణ చేస్తారు.
అన్ని సందర్భాల్లోనూ ఈస్ట్రోజెన్ రిసెప్టర్, ప్రొజెస్టిరాన్ రిసెప్టర్, హర్–2 పరీక్షలూ; కొన్ని సందర్భాల్లో ఫ్రోజెన్ సెక్షన్ ఎగ్జామినేషన్ ∙ఛాతీ ఎక్స్‌రే ∙కడుపు స్కానింగ్‌తో పాటు అవసరమైతే ఎముకల స్కానింగ్ (మూడో దశలో) లేదా పెట్‌స్కాన్ చేస్తారు.
చికత్స
మహిళల్లో రొమ్ము క్యాన్సర్ తగ్గదనేది కేవలం అపోహ మాత్రమే. తొలి లేదా రెండో దశలో ఉన్న రొమ్ము క్యాన్సర్‌ను దాదాపుగా పూర్తిగా తగ్గించవచ్చు. ఇక కొన్ని సందర్భాల్లో శస్త్ర చికిత్స, రేడియేషన్, హార్మోనల్ థెరపీ, కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ వంటి చికిత్సలు అవసరం పడవచ్చు. క్యాన్సర్ తొలిదశలో ఉంటే రొమ్మును రక్షిస్తూ, క్యాన్సర్ ఇతర అవయవాలకు వ్యాపించకుండా ఆపవచ్చు. అప్పుడు మొదట సర్జరీ చేసి, వ్యాప్తి నివారణ కోసం ఆ తర్వాత హార్మోన్ థెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీలను చేస్తారు. రొమ్ము క్యాన్సర్‌ను మొదటిదశలోనే కనుగొంటే ఆంకో΄్లాస్టీ అనే శస్త్రచికిత్సతో రొమ్మును పూర్తిగా రక్షించడమూ సాధ్యమే.
-డా. సింహాద్రి చంద్రశేఖర్ రావు,
సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్.
Comments
Please login to add a commentAdd a comment