నూలుతో అల్లిన ప్రొస్తెటిక్‌ బ్రెస్ట్‌లను రూపొందించి.. | Knitted knockers are an alternative for breast cancer survivors | Sakshi
Sakshi News home page

బ్రెస్ట్‌కు ఆ‘దారం’గా... నూలుతో అల్లిన ప్రొస్తెటిక్‌ బ్రెస్ట్‌లను రూపొందించి..

Published Sat, Jan 29 2022 12:44 AM | Last Updated on Sat, Jan 29 2022 8:27 AM

Knitted knockers are an alternative for breast cancer survivors - Sakshi

నూలుతో ప్రొస్తెటిక్‌ బ్రెస్ట్‌ను రూపొందిస్తూ...

ముప్పై ఆరేళ్ల వయసులో రొమ్ము క్యాన్సర్‌ నుంచి కోలుకున్న డాక్టర్‌ రోహిణి పాటిల్‌ తను అనుభవించిన బాధ ఇతర బ్రెస్ట్‌ క్యాన్సర్‌ మహిళలకు రాకూడదనుకుంది. సిలికాన్‌ ప్రొస్తెటిక్‌ బ్రెస్ట్‌కు అయ్యే ఖర్చు అందరూ భరించలేరని, నూలుతో అల్లిన ప్రొస్తెటిక్‌ బ్రెస్ట్‌లను రూపొందించి, ఉచితంగా అందజేస్తోంది. 2018లో ప్రారంభించిన ‘నిటెడ్‌ నాకర్స్‌ ఇండియా’ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న మహిళలకు చేరవవుతున్నారు డాక్టర్‌ రోహిణి. నూలు రొమ్ముల తయారీ వెనకాల కృషి గురించి, మహిళలకు ఉచితంగా అందజేస్తున్న విధానాల గురించి ఆమె మాటల్లోనే..

‘‘ఒక రోజు ఓ పెద్దావిడ నా శిబిరానికి వచ్చింది. ‘పది నెలల క్రితం రొమ్ము క్యాన్సర్‌ ఆపరేషన్‌ అయ్యింది. ఇప్పుడు అదే ప్లేస్‌లో గాయం కావడంతో ఆసుపత్రికి వచ్చాను’ అని చెప్పింది. నేనావిడచేత ఇంకాస్త మాట్లాడించాను. అప్పుడు ఆమె చెప్పింది విని చాలా బాధపడ్డాను. వెదురు బుట్టకు ఒక క్లాత్‌ను కలిపి కుట్టి, రొమ్ము స్థానంలో పెట్టుకుంటున్నట్టు, ఆ వెదురు కొన ఒరిపిడి వల్ల గాయమయ్యిందని చెప్పింది. రొమ్ము క్యాన్సర్‌ కారణంగా చికిత్సలో భాగంగా రొమ్మును తీసేస్తే అది ఆ మహిళల మానసిక స్థితిపైన తీవ్ర ప్రభావం చూపుతుంది. సిలికాన్‌ ప్రొస్తెటిక్‌ బ్రెస్ట్‌ల ఖరీదు ఎక్కువ కావడంతో వాటిని మహిళలకు ఉచితంగా అందించలేకపోయాను.

ఒంటరి తల్లిని..?
2002లో నాకు క్యాన్సర్‌ ఉన్నట్లు నిర్ధారణ అయినప్పుడు ఆలోచనలో పడ్డాను. మా కుటుంబంలో చిన్న వయస్సులో బ్రెస్ట్‌ క్యాన్సర్‌ కేసులు లేవు. దీంతో నేను ఈ వ్యాధిని అంత తొందరగా అంగీకరించలేక పోయాను. పైగా ఎనిమిదేళ్ల బిడ్డకు ఒంటరి తల్లిని. నా బిడ్డ పోషణకు, చదువుకు ఖర్చులను నేనే చూసుకోవాలి. దీంతో నా చికిత్స కాస్త ఆలస్యం అయ్యింది. రొమ్ము భాగాన్ని తీసేయాల్సి వచ్చింది. చీర కట్టేటపుడు రెండు భుజాల మీదా పల్లూ పట్టుకుని ఛాతీ కనిపించకుండా ఉండేదాన్ని. నేను డాక్టర్‌ అయినప్పటికీ, రొమ్ము తొలగిం^è డాన్ని ఆపలేకపోయాను. చికిత్స గాయాలు మానాయి. దీంతో క్లాత్‌ను ఒక బంతిలా చేసి బ్లౌజ్‌ లోపల ఉంచడం ప్రారంభించాను.

ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ...
మా కుటుంబసభ్యుల సలహా మేరకు మరో డాక్టర్‌ని కలిసినప్పుడు ‘మీరు ప్రొస్తెటిక్‌ బ్రెస్ట్‌ ఎందుకు ఉపయోగించకూడదు’ అని నన్ను అడిగాడు. డాక్టర్‌ అయిన తర్వాత కూడా ఈ ప్రశ్న నా మదిలో ఎందుకు రాలేదనే ప్రశ్న నన్ను ఆశ్చర్యపరిచింది. వెంటనే ప్రొస్తెటిక్‌ బ్రెస్ట్‌ కొనడానికి వెళ్లాను, దాని ఖరీదు రూ. 6,000 అని చెప్పారు. ఈ మొత్తం నాకు చాలా ఎక్కువ. దీంతో సిలికాన్‌తో చేసిన ప్రొస్తెటిక్‌ బ్రెస్ట్‌ వద్దనుకున్నాను. క్యాన్సర్‌ చికిత్సలో భాగంగా ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ, నేను జీవించాలనే నా ఆశ వదులుకోలేదు.  

ప్రయత్నాల ఫలితం
తక్కువ ఖర్చుతో కృత్రిమ స్తనాలను తయారు చేయాలనే విషయంపైన నా ప్రయత్నాలు సంవత్సరం పాటు కొనసాగాయి. వీటన్నింటి మధ్యలోనే నా కొడుకు పై చదువులకోసం అమెరికా వెళ్లాడు. ఒకసారి నేను మా అబ్బాయిని కలవడానికి అమెరికా వెళ్లాను. అక్కడ బ్రెస్ట్‌ క్యాన్సర్‌ గ్రూప్‌ని కలిసాను. సిలికాన్‌ బ్రెస్ట్‌లకు బదులుగా నూలుతో అల్లిన ప్రొస్తెటిక్‌ బ్రెస్ట్‌లను వారు ఉపయోగిస్తున్నారని తెలుసుకుని ఆశ్చర్యపోయాను. మన దేశానికి తిరిగి వచ్చినప్పుడు ఇక్కడ వాటిని ప్రారంభించాలనుకుని, చాలా మందిని కలిశాను. నూలు కు సరిపడా డబ్బులు ఒకరు, అల్లిన బ్రెస్ట్‌ పోస్టింగ్‌కు అయ్యే ఖర్చును ఒకరు.. ఇలా నా స్నేహబృందంలో కొందరు తీసుకున్నారు. అలా ‘నిటెడ్‌ నాకర్స్‌ ఇండియా’ మొదలైంది.

నాకేదో ప్రయోజనం అనుకున్నవారంతా!
నాతో మొదలైన ఈ ఆలోచన ఇప్పుడు ప్రజలకు చేరుతూనే ఉంది. మహిళలు కూడా వివిధ ప్రాంతాల నుండి వచ్చి చేరడం మొదలుపెట్టారు. కొందరు ఖర్చుకు డబ్బులు ఇవ్వడం, మరికొందరు నూలు బ్రెస్ట్‌ల అల్లిక పనిని చేపట్టారు. ముందుగా స్థానిక ప్రభుత్వాసుపత్రికి అవసరమైన మహిళలు నిట్‌ నాకర్లను తీసుకోమని చెబుతుండేదాన్ని. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే.. ఒకరోజు ఆసుపత్రికి చేరుకోవడం ఆలస్యమైతే చాలు మహిళల క్యూ చాంతాడంత అయి ఉంటుంది. అక్కడి వైద్యులు నన్ను చూస్తూనే ‘కృత్రిమ స్తనాలు ఇచ్చే చెల్లెలు ఎప్పుడు వస్తారు’ అని అడుగుతున్నారు. అని చెప్పేవారు. రొమ్ము క్యాన్సర్‌ నుండి బయటపడిన వ్యక్తిగా, ముఖ్యంగా డాక్టర్‌ అయినందున మహిళలకు అవగాహన కల్పించడం నా బాధ్యతగా భావించాను.

మొదట్లో నాగపూర్‌లోని కాలేజీలు, ఇన్‌స్టిట్యూట్‌లు, ఇరుగు పొరుగు గ్రామాలకు వెళ్లి కనుక్కోమని మహిళలనే కోరాను. ‘మా కుటుంబంలో ఎవరికీ క్యాన్సర్‌ లేద’ని చాలా చోట్ల విన్నాను. సాధారణంగా ప్రజలు క్యాన్సర్‌ను జన్యుపరమైన వ్యాధిగా భావిస్తారు. అదే సమయంలో గ్రామాల్లోని మహిళల పని వ్యవసాయంతో ముడిపడి ఉండటంతో ఒకరోజు జీతం వదులుకొని, చెకప్‌కు డబ్బులు ఖర్చుపెట్టడం ఎందుకో వారికి అర్థం కాలేదు. దీంతో స్వయంగా శిబిరాలు నిర్వహించి, చెకప్‌ల కోసం మహిళలకు 50 శాతం రాయితీతో కూపన్‌లు పంపిణీ చేసేదానిని. ఇప్పుడు మహిళలు అర్ధం చేసుకుంటున్నారు. తమ సమ్మతిని తెలియజేస్తున్నారు’’ తన పని గురించి వివరిçస్తారు రోహిణీ పాటిల్‌.                                

డాక్టర్‌ రోహిణీ పాటిల్‌


పాతికేళ్లుగా వైద్యవృత్తిలో కొనసాగుతున్నారు డాక్టర్‌ రోహిణి పాటిల్‌. మెడికల్‌ ఆఫీసర్‌గా, లెక్చరర్‌గా, క్యాన్సర్‌ అవేర్‌నెస్‌ స్పీకర్‌గా ఉన్నారు. ‘నిట్టెడ్‌ నాకర్స్‌ నాగపూర్‌ అనే ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు. రొమ్ము క్యాన్సర్‌ బారిన పడి, తగ్గిన వారికి నూలుతో అల్లిన కృత్రిమ రొమ్మును అందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement