bride arrested
-
మొదటి రాత్రే భర్తకు మత్తుమందు.. ఆ తర్వాత..
ఛండీగఢ్: ఆమె తన అందంతో గాలం వేసి పరిచయం చేసుకుంటుంది.. ఈ తర్వాత పెళ్లి చేసుకుంటుంది. ఇక, ఫస్ట్ నైట్ రోజున వరుడికి మత్తుమందు ఇచ్చి.. డబ్బులు, నగలతో మాయమవుతుంది. ఇలా ఏకంగా ఏడుగురికి షాకిస్తున్న కిలాడీ లేడీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. పెళ్లి పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఏడుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఓ మహిళ విడాకులు తీసుకుని మరో పెళ్లి చేసుకోవాలనుకునే వారిని, పెళ్లికాని యువకుల్ని టార్గెట్ చేసింది. ముందుగా ఎవరో ఒకరిని పరిచయం చేసుకొని.. తనకు తల్లిదండ్రులు ఎవరూ లేరని, తన పెళ్లి ఓ మధ్యవర్తితో జరిగిందని అందరినీ నమ్మించేది. ఇందుకు ఆమె ముఠా సభ్యులు సహకరించేవారు. దీంతో వారి మధ్య ఉన్న సంబంధాన్ని పెళ్లి వరకు తీసుకొచ్చేది. వివాహం అయిన తర్వాత మొదటి రాత్రే మత్తుమందు మాత్రలు ఇచ్చి ఇంట్లో ఉన్న డబ్బు, నగలతో అక్కడి నుంచి ఉండాయించేది. ఇలా జరుగుతున్న క్రమంలో ఆమె వివాహం చేసుకున్న నాలుగో భర్త రాజేందర్‌ను మోసం చేసి డబ్బులు, నగలతో పారిపోయింది. దీంతో రాజేందర్ పోలీసులను ఆశ్రయించాడు. వారి పెళ్లికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలను పోలీసులకు చూపించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. దర్యాప్తు చేస్తుండగానే సదరు మహిళ శనివారం ఏడో పెళ్లి చేసుకుంది. ఈ క్రమంలో పోలీసులు.. ఆమెను, ఆ ముఠా సభ్యులను పట్టుకున్నారు. విచారణలో భాగంగా.. ఆమె మొదటగా ఖేడీ కరమ్ శామ్లి ప్రాంతానికి చెందిన సతీష్‌ను పెళ్లి చేసుకుంది. ఓ బిడ్డకు తండ్రి అయిన సతీష్ రెండో వివాహంగా ఆమెను పెళ్లి చేసుకున్నాడు. రెండో వివాహం జనవరి 1న రాజస్థాన్‌లో జరిగింది. ఫిబ్రవరి 15న మూడో వివాహం.. ఫిబ్రవరి 21న నాలుగో వివాహం రాజేందర్‌తో.. ఐదో వివాహం కుటానాకు చెందిన గౌరవ్‌తో.. ఆరో వివాహం కర్నాల్‌కు చెందిన సందీప్‌తో జరిగింది. చివరగా ఏడో వివాహం మార్చి 26న (శనివారం) బుద్వాకు చెందిన సుమిత్తో జరిగింది. దీంతో వీరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. -
పెళ్లి పేరుతో సంపన్నులను బుట్టలో వేసుకొని..
వైఎస్ఆర్ జిల్లా, ఖాజీపేట/గిద్దలూరు: పవిత్రమైన వివాహ బంధాన్ని ఎగ‘తాళి’ చేసేలా వ్యవహరించి వరుసగా ఆరుగురిని వివాహం చేసుకున్న ఓ నిత్య పెళ్లికూతురును వైఎస్సార్ జిల్లా ఖాజీపేట పోలీసులు అరెస్టు చేశారు. మైదుకూరు రూరల్ సీఐ కంభగిరి రాముడు విలేకరుల సమావేశంలో వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఖాజీపేట మండలం కొమ్మలూరుకు చెందిన భూమిరెడ్డి రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి మూడు నెలల క్రితం ప్రకాశం జిల్లా అర్థవీడు మండలం మోదినీపురం గ్రామానికి చెందిన మౌనికను వివాహం చేసుకున్నాడు. ఈ ఏడాది ఆగస్టు నెల 25న ఆమె తండ్రి వచ్చి కూతురిని పుట్టింటికి తీసుకెళ్తున్నానని చెప్పి పిలుచుకుని వెళ్లాడు. ఆమె వెళ్లేటప్పుడు అత్తింటిలో నుంచి బంగారు నగలను తీసుకెళ్లింది. ఆమె తిరిగి రాకపోగా, ఆమె పుట్టింట్లో కూడా లేకపోవడంతో అన్నిచోట్లా గాలించి ఈనెల 10న ఆమె భర్త రామకృష్ణారెడ్డి పోలీసుకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు మౌనికతో పాటు, ఆమె తండ్రి అనంతరెడ్డి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు వీరిని మైదుకూరు పట్టణంలో గుర్తించి ఆదివారం అరెస్టు చేశారు. మౌనిక, ఆమె తండ్రి అనంతరెడ్డి తోపాటు రత్నావల్ చంటినాయక్ ఒక ముఠాగా ఏర్పడ్డారు. ఆ నగలను విక్రయించి వచ్చిన డబ్బుతో వీరు ముగ్గురూ జల్సాలు చేసేవారు. ముగ్గురిపై ఛీటింగ్ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కిలాడీ లేడీది ప్రకాశం జిల్లా మొహిద్దీన్‌పురం.. ఆరు పెళ్లిళ్లు చేసుకుని భర్తలను మోసం చేస్తూ బంగారు నగలు, నగదుతో ఉడాయిస్తున్న మౌనికది ప్రకాశం జిల్లా అర్థవీడు మండలంలోని మొహిద్దీన్‌పురం. మొహిద్దీన్‌పురానికి చెందిన చేగిరెడ్డి అనంతరెడ్డిది పేద కుటుంబం కావడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. అనంతరెడ్డికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. మద్యం వ్యసనానికి బానిసైన అనంతరెడ్డి అందంగా ఉన్న తన కుమార్తెను పావుగా చేసుకుని సంపాదించాలనుకున్నాడు. పెళ్లి మీద పెళ్లి చేస్తూ నగలు, డబ్బుతో ఉడాయిస్తున్నాడు. మార్కాపురంలో మొదటి పెళ్లి చేశాడు. నెలకే ఇంటికి వచ్చింది. రెండో వివాహం గిద్దలూరు మండలంలోని వేములపాడు గ్రామంలో చేసుకుంది. రెండు నెలలకే నగలు, డబ్బుతో పుట్టింటికి చేరింది. రెండేళ్లు ఖాళీగా ఉన్న ఆమె.. తిరిగి మూడో పెళ్లి బేస్తవారిపేట మండలంలోని పందిళ్లపల్లెలో యువకుడిని చేసుకుంది. రెండు నెలలకే భర్తకు చెందిన బంగారు, నగదు తీసుకెళ్లడంతో వారు పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టారు. నాలుగో వివాహం తెనాలిలో, ఐదో పెళ్లి ఖాజీపేటలో చేసుకుని నగలు, డబ్బుతో పరారు కావడంతో అక్కడ కేసు నమోదయింది. ఆ కేసు ఉండగానే హైదరాబాద్‌కు చెందిన యువకుడిని ఆరో వివాహం చేసుకుంది. -
వరుడి కిడ్నాప్.. వధువు సహా నలుగురి అరెస్ట్
పట్నా: వరుడిని కిడ్నాప్ చేసిన వ్యవహారంలో వధువు సహా నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన బిహార్ లోని ముజఫర్ పూర్ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. ముజఫర్ పూర్ ఈస్ట్ డీఎస్పీ ముస్తాఫిక్ అహ్మద్ కథనం ప్రకారం.. జూలీ అనే యువతికి మిథాలీ గ్రామానికి చెందిన అభినయ్ కుమార్ తో వివాహం చేయాలని వధువు కుటుంబసభ్యులు నిశ్చయించుకున్నారు. అనుకున్నదే తడవుగా అభినయ్ ని వధువు బంధువులు నంద్ కిశోర్ సింగ్, మరికొందరు కలిసి కిడ్నాప్ చేశారు. అభినయ్ కిడ్నాప్ అయ్యాడని గైఘాట్ పోలీసులకు అతడి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకున్నారు. 'పకాడ్వా షాది' అనే సంప్రదాయం ప్రకారం తమకు కావలసిన వ్యక్తిని కిడ్నాప్ చేసి అతడికి బలవంతంగా పెళ్లి చేయడం బిహార్ లో కొనసాగుతుండేది. వధువు బంధువులు నిర్ణయించినట్లుగానే పెళ్లి ఏర్పాట్లు అన్ని జరిగిపోయాయి. శుక్రవారం మరికాసేపట్లో వివాహం జరుగుతుందనగా జూలీ ఇంటికి చేరుకున్న పోలీసులు అభినయ్ ని వారి చెర నుంచి విడిపించారు. అయితే వధువు తరఫు బంధువులు పోలీసులపై దాడులకు దిగి విధ్వంసం సృష్టించారు. పోలీసులను వారి దాడులను అడ్డుకుని కల్యాణ మండపం వద్ద ఉన్న వధువు సహా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వధువు జూలీని, ఆమె సోదరి, సోదరుడు, మరో వ్యక్తిని అరెస్ట్ చేసి విచారణ చేశారు. ఈ నలుగురిని అనంతరం స్థానిక కోర్టులో ప్రవేశపెట్టగా, షాహిద్ ఖుదీ రామ్ బోస్ సెంట్రల్ జైలుకు జ్యూడీషియల్ కస్టడీకి అప్పగించారు. అభినయ్ ఇష్టప్రకారమే వివాహం జరుగుతుందని వధువు బంధువులు పోలీసులను నమ్మించాలని చూశారు. అయితే అక్కడ వరుడి కుటుంబంగానీ, బంధువులుగానీ ఏ ఒక్కరూ లేరని నిర్ధారించుకున్న తర్వాతే పోలీసులు అతడిని రక్షించారని డీఎస్పీ తెలిపారు. తనను జూలీ బంధువులు కిడ్నాప్ చేశారని, బలవంతంగా పెళ్లి చేయాలని ప్రయత్నించారని ఆరోపించాడు. వధువు బంధువు ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ.. జూలీ, అభినయ్ కుమార్ కి గతంలోనే పెళ్లి నిశ్చయమైందని, కట్నం అడగటంతో గొడవ తలెత్తి పెళ్లి రద్దయిందని చెప్పాడు. ఆ కారణం వల్లే వరుడిని ఎలాగైనా తీసుకొచ్చి పెళ్లి చేయాలని చూశారని చెప్పుకొచ్చాడు. ఓ వ్యక్తిని కిడ్నాప్ చేయడంతో పాటు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని డీఎస్పీ ముస్తాఫిక్ అహ్మద్ వివరించారు.