లండన్‌లో హైదరాబాద్ యువతి మృతి
సాక్షి, హైదరాబాద్: ఫస్ట్ టర్మ్ అయిపోయింది.. సెలవు తీసుకుని ఇంటికొస్తానని చెప్పిన ఆ యువతి శాశ్వతంగా సెలవు తీసుకుంది. హైదరాబాద్ యువతి సాయి తేజస్వి కొమ్మారెడ్డి (24) లండన్‌లో దుర్మరణం చెందింది. ఒక్కగానొక్క బిడ్డ మృతి చెందడం, మృతదేహం రావడానికి సమయం పడుతుండటంతో నగరంలోని ఆమె కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. యాదాద్రి జిల్లా మోటకొండూరుకు చెందిన కొమ్మారెడ్డి శశిధర్ రెడ్డి, జ్యోతి దంపతులు నగరంలోని ఐఎస్‌సదన్ డివిజన్ లక్ష్మీనగర్ కాలనీలో ఉంటున్నారు.
వీరి కుమార్తె తేజస్వి సైదాబాద్‌లో ఇంజనీరింగ్ (సీఎస్ఈ) పూర్తి చేశారు. లండన్‌లోని క్రాన్ ఫీల్డ్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేయడానికి గతేడాది సెప్టెంబర్‌లో వెళ్లారు. ఈ నెల 11న తన స్నేహితులతో కలిసి అక్కడి బ్రైటన్ బీచ్‌లో విహారయాత్రకు వెళ్లి సముద్రంలో కొట్టుకుపోయారు. వెంట ఉన్న సహ విద్యార్థులు ఎమర్జెన్సీ రెస్పాన్స్‌కు సమాచారం ఇచ్చారు. అక్కడి బలగాలు గాలించి తేజస్వి మృతదేహాన్ని గుర్తించి ససెక్స్ కౌంటీ హాస్పిటల్‌కు తరలించారు. ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
ఆమె మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ విషయంపై కేటీఆర్‌కు ట్వీట్ చేసిన తేజస్వి బంధువులు మృతదేహం ఇక్కడకు తరలించడానికి సహకరించాలని కోరారు. బుధవారం మృతురాలి ఇంటికి వెళ్లిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో ఫోన్లో మాట్లాడించారు. మృతదేహం శుక్రవారం నాటికి నగరానికి చేరుకుంటుందని ఆమె కుటుంబీకులకు సమాచారం అందింది.
‘‘చనిపోవడానికి ముందు రోజు తేజస్వి తల్లిదండ్రులతో వీడియోకాల్‌లో మాట్లాడింది. ఫస్ట్ టర్మ్ పూర్తయిన విషయం చెప్పింది. వీలుంటే వారం లేదా పది రోజులు సెలవు తీసుకుని రమ్మని వాళ్లు చెప్పారు. ఆరేడు నెలల్లో గ్రాడ్యుయేషన్ కూడా ఉండటంతోసెర్మనీకి వెళ్లడానికి తల్లిదండ్రులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈలోపు ఇలా జరిగింది’’అని తేజస్వి బంధువులు తెలిపారు.
చదవండి: ఎంసెట్‌లో ఇంటర్ మార్కుల వెయిటేజ్ ఎత్తివేత