రాత్రి బీచ్‌లో స్నానం.. యువకుడు షాక్
సిడ్నీ: ఆస్ట్రేలియాలో రాత్రి పూట బీచ్‌లో స్నానానికి దిగిన ఓ యువకుడికి షాక్ ఎదురైంది. అరగంటపాటు సముద్రం ఒడ్డున స్నానం చేసి బయటకు వచ్చిన అతడి పాదాల నుంచి చీలమండలం నుంచి రక్తం కారడం ప్రారంభించింది. దీంతో అతడిని ఆస్పత్రిలో చేర్పించగా పరీక్షించి చికిత్స చేసిన వైద్యులకు కూడా అలా ఎందుకు జరిగిందో అంతు చిక్కని ప్రశ్నగా మారింది. వైద్యులు, అక్కడి వారంతా కేవలం ఊహాగానాలు మాత్రమే చేశారే తప్ప ఏ ఒక్కరూ ఇదీ కారణం అని స్పష్టం చేయలేకపోయారు.
వివరాల్లోకి వెళితే.. శ్యామ్ కానిజే అనే 16 ఏళ్ల యువకుడు మెల్‌బోర్న్‌లోని బ్రిగ్టాన్ బీచ్‌లో రాత్రి ఆరుగంటల ప్రాంతంలో బీచ్‌లో స్నానానికి దిగాడు. అరగంటపాటు అందులోనే ఉండిపోయాడు. కాళ్లు మొత్తం కూడా మొద్దు బారినట్లు అనిపించడంతో బయటకు వచ్చి చూడగా రక్తం కారుతూ కనిపించింది. 'ఆ చల్లటి నీళ్లు నా కాళ్లు మొద్దుబారేలాగా చేశాయి. రక్తం చూసి బహుశా నా కాళ్లకు ఏవైనా మేకులో, నీడిల్ సూదులో గుచ్చుకున్నాయి అని అనుకున్నాను. తీక్షణగా చూస్తే అలా ఏం కనిపించలేదు' అని చెప్పాడు. అతడి రెండు కాళ్ల చీలమండలానికి వందల సంఖ్యలో అతి సూక్ష్మమైన రంధ్రాలు కనిపించాయి. అలా ఎందుకు జరిగిందో వైద్యులకు కూడా అర్థం కాలేదు. అయితే, నీటి పేలు అతడిని కుట్టి ఉంటాయని అంటున్నారు. అది కూడా జరిగి ఉండదని స్పష్టమైంది.