విడిగానా?.. కలివిడిగానా?
స్కాట్లాండ్లో నేడే ప్రజాభిప్రాయ సేకరణ
యునెటైడ్ కింగ్డమ్లో కొనసాగడమా? స్వాతంత్య్రమా?
ఇరు వాదనలకు దాదాపు సమాన మద్ధతు
కలిసుండాలని బ్రిటన్ హామీల వర్షం
స్వాతంత్య్రానికి మొగ్గు చూపుతున్న స్కాట్లాండ్ యువత
ఎడిన్బర్గ్: బ్రిటన్‌తో 307 ఏళ్ల అనుబంధాన్ని కొనసాగించడమా? లేక స్వతంత్ర దేశంగా తొలి అడుగులు వేయడమా?.. అని స్కాట్లాండ్ ప్రజలు నిర్ణయించుకునేది నేడే. యూరోప్.. ముఖ్యంగా బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ దశ, దిశ తేలేది నేడే. కలిసుందామనే బ్రిటన్ నేతల భావోద్వేగ అభ్యర్థన ఫలిస్తుందా? లేక కలి‘విడి’గా ఉందామనే స్కాట్లాండ్ వాసుల ఆలోచన గెలుస్తుందా?..అని యావత్ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్కాట్లాండ్ రెఫరెండానికి ముహూర్తం ఈ రోజే.
స్కాట్లాండ్ స్వాతంత్య్రాన్ని నిర్ణయించే ప్రజాభిప్రాయ సేకరణ గురువారం జరగనుంది. ఈ రెఫరెండంలో ‘స్కాట్లాండ్ స్వతంత్ర దేశంగా ఉండాలా?’ అన్న ఏకైక ప్రశ్నకు ‘ఉండాలి(యెస్)’.. లేదా ‘వద్దు(నో)’ అంటూ దాదాపు 43 లక్షల మంది స్కాట్లాండ్ పౌరులు ఏకవాక్య సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే ఈ రెఫరెండం ప్రచారం కూడా ‘ఎస్’ గ్రూప్, ‘నో’ గ్రూప్‌లుగా విడిపోయింది. 16 ఏళ్లు పైబడిన స్కాట్లాండ్ పౌరులకు ఈ రెఫరెండంలో పాల్గొనే అర్హత ఉంటుంది. స్థానిక కాలమానం ప్రకారం గురువారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది. ఆ వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. శుక్రవారం ఉదయం వరకు తుది ఫలితం ప్రకటిస్తామని చీఫ్ కౌంటింగ్ ఆఫీసర్ మేరీ పిట్కైత్లీ స్పష్టం చేశారు. లండన్ కాలమానం కన్నా భారత్ కాలమానం నాలుగున్నర గంటలు ముందుంటుందన్న విషయం గమనార్హం.
అటో.. ఇటో.. ఎటైనా.. స్వల్ప మెజారిటీనే!
మొదట్లో స్కాట్లాండ్ స్వాతంత్య్రానికి స్థానికుల నుంచి అంతగా మద్దతు లభించలేదు. దాంతో ఈ రెఫరెండాన్ని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ క్రమంగా స్వాతంత్య్రం వైపు స్కాట్లాండ్ ప్రజలు మొగ్గు చూపుతుండటం, ఒపీనియన్ పోల్స్‌లోనూ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఓట్ల తేడా చాలా తక్కువగా ఉండటంతో ఉత్కంఠ, ఆసక్తి పెరిగింది. ప్రమాదం శంకించిన బ్రిటన్ నేతలు స్కాట్లాండ్కు క్యూ కట్టారు. బ్రిటన్ ప్రధాని డేవిడ్ కేమరాన్ కూడా స్వయంగా వెళ్లి.. ‘కష్టపడి నిర్మించుకున్న జాతిని విచ్ఛిన్నం చేయొద్ద’ంటూ స్కాట్ ప్రజలను కన్నీళ్లతో అభ్యర్థించారు. ఈ క్రమంలో ‘ఎస్’, ‘నో’ గ్రూపుల మధ్య ప్రచారం కూడా ఊపందుకుంది. స్కాట్లాండ్ వ్యాప్తంగా ర్యాలీలతో, కరపత్రాలతో హోరెత్తించారు. బుధవారం పత్రికల్లో ప్రచురితమైన ఒపీనియన్ పోల్స్‌లో.. బ్రిటన్‌తో కలిసుండాలనే వాదనకు అత్యంత స్వల్ప మెజారిటీ(52%) లభించింది. ఈ పరిస్థితుల్లో ఇంకా ఎటూ నిర్ణయించుకోని ఓటర్ల నిర్ణయం తుది ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. స్కాట్లాండ్ స్వాతంత్య్రాన్ని ఆ దేశ యువత ఎక్కువగా కోరుకుంటున్నారు. స్కాట్ స్వాతంత్య్ర కాంక్షను బలంగా ముందుకు తీసుకెళ్లిన నేత అలెక్స్ సాల్మండ్ బుధవారం ఉదయం దేశ ప్రజలను ఉద్దేశించి ఒక బహిరంగ లేఖ రాశారు. అందులో ‘బ్రిటన్‌తో 307 ఏళ్ల బంధం నుంచి విడిపోయే ఈ చరిత్రాత్మక అవకాశాన్ని వినియోగించుకోండి. శుక్రవారం కొత్తదేశంలో, కొత్త ఆకాంక్షలతో నిద్రలేవండి’ అని పిలుపునిచ్చారు. బ్రిటన్‌తో కలిసుంటేనే మెరుగైన భవిష్యత్తు ఉంటుందని స్వాతంత్య్రాన్ని వద్దనే గ్రూప్ వాదిస్తోంది. ‘నో’కు ఓటేస్తే పన్నులు, సంక్షేమ రంగం సహా పలు రంగాల్లో మరిన్ని అధికారాలు అప్పగిస్తామంటూ బ్రిటన్‌కు చెందిన 3 ముఖ్యమైన పార్టీలు స్కాట్లాండ్కు హామీ ఇచ్చాయి.
కేమరాన్‌కు కష్టకాలం
విడిపోవడానికే స్కాట్లాండ్ నిర్ణయించుకుంటే తక్షణ నష్టం బ్రిటన్ ప్రధాని డేవిడ్ కేమరాన్కేనని విశ్లేషకులు భావిస్తున్నారు. స్కాట్లాండ్నుంచి ఎన్నికైన ఎంపీలు దూరమైతే ఆయన ప్రధాని పదవిని కూడా కోల్పోయే ప్రమాదముందంటున్నారు. అలాగే, ప్రతిపక్ష టోరీల డిమాండ్ ప్రకారం.. ఇంగ్లండ్ చట్టాలపై స్కాట్లాండ్ ఎంపీలకు ఓటింగ్ హక్కును నిరాకరిస్తే.. బడ్జెట్ ఆమోదం పొందడం కూడా కష్టమేనని వివరిస్తున్నారు.
భారతీయుల ఓట్లు కీలకం
అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య తేడా స్వల్పంగా ఉండే అవకాశాలుండటంతో స్కాట్లాండ్లో స్థిరపడిన ఆసియన్లు, ముఖ్యంగా అక్కడి భారతీయుల ఓట్లు ఈ రెఫరెండంలో కీలకం కానున్నాయి. స్కాట్లాండ్ జనాభాలో పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఇండియాలకు చెందినవారు 3% పైగా ఉన్నారు. అయితే, వారు కూడా రెండు వర్గాలుగా విడిపోవడం విశేషం. యువత స్వాతంత్య్రానికి మద్దతిస్తుండగా.. పాతతరం వారు, ముఖ్యంగా అక్కడ పలు వ్యాపారాల్లో ఉన్నవారు బ్రిటన్‌తో కలిసుండాలనే కోరుకుంటున్నారు. వారు భారత్- పాకిస్థాన్ విభజన నాటి కష్టాలను ప్రస్తావిస్తున్నారు.