‘ఫిర్ ఏక్ బార్....’
సంపాదకీయం
‘ఫిర్ ఏక్ బార్...కామెరాన్ సర్కార్’ అని నినాదమిచ్చిన బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ మాటే చివరికి నిజమైంది. సర్వేల అంచనాలన్నిటినీ తలకిందులు చేస్తూ బ్రిటన్ ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోని కన్సర్వేటివ్ పార్టీ అధికారాన్ని నిలబెట్టుకుంది. అంతేకాదు... ఈసారి లిబరల్ డెమొక్రటిక్ పార్టీ సాయం అవసరం లేకుండా అది సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. 650 స్థానాలున్న హౌస్ ఆఫ్ కామన్స్‌లో ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 326 స్థానాలకంటే మరో అయిదు స్థానాలను అదనంగా పొంది తన బలాన్ని 331కి పెంచుకుంది. రద్దయిన సభలో కన్సర్వేటివ్‌ల బలం 306 మాత్రమే. గట్టి పోటీ ఇచ్చి కన్సర్వేటివ్‌ల బలాన్ని గణనీయంగా తగ్గిస్తుందనుకున్న లేబర్ పార్టీ 26 స్థానాలు కోల్పోయి 232 స్థానాలకు పరిమితమైంది. ఆ పార్టీ ప్రచార సారథి ఎడ్ మిలిబాండ్ మూడుచోట్లనుంచి పోటీ చేసి ఒకచోట మాత్రమే గెలిచాననిపించుకున్నారు. స్కాట్లాండ్లో స్కాటిష్ నేషనల్ పార్టీ(ఎస్ఎన్పీ) అందరి అంచనాలనూ తలకిందులు చేస్తూ 59 స్థానాల్లో 56 కైవసం చేసుకోవడంతో లేబర్ పార్టీ ఆశలన్నీ అడుగంటాయి. ఈ ఎన్నికలు మూడు ప్రధాన పార్టీల్లో పెను సంక్షోభాన్ని తీసుకొచ్చాయి. లేబర్ పార్టీ నాయకుడు మిలిబాండ్తోపాటు లిబరల్ డెమొక్రటిక్ పార్టీ నాయకుడు నిక్ క్లెగ్, యూకే ఇండిపెండెన్స్ పార్టీ(యూకేఐపీ) నాయకుడు నెజైల్ ఫెరాజ్లు పదవులకు రాజీనామా చేశారు.
బ్రిటన్‌లో గత అయిదేళ్లుగా కొనసాగిన కన్సర్వేటివ్-లిబరల్ డెమొక్రటిక్ పార్టీ కూటమి ప్రభుత్వం చెప్పుకోదగ్గ విజయాలే సాధించింది. ఏడెనిమిదేళ్ల తర్వాత నిరుద్యోగం తగ్గుముఖం పట్టడం, ద్రవ్యోల్బణం బాదరబందీ లేకపోవడం, కొద్దో గొప్పో వేతనాలు పెరగడంవంటివి కన్సర్వేటివ్‌లకు అనుకూల వాతావరణాన్ని ఏర్పరిచాయి. జీడీపీ తగ్గుముఖంలో ఉండటం, పారిశ్రామికరంగం, నిర్మాణ రంగాలను మందకొడితనం ఆవరించడం వగైరాలను లేబర్ పార్టీ ఎత్తిచూపినా వాటి ప్రభావం ఇంకా స్పష్టంగా కనబడని ప్రస్తుత పరిస్థితుల్లో ఓటర్లు ఆ ప్రచారాన్ని విశ్వసించలేదు. పైగా ఆర్థిక రంగం కాస్త మెరుగవుతున్న సూచనలు కనిపిస్తున్న తరుణంలో ఈ ఒరవడి కొనసాగితేనే మేలు జరుగుతుందని భావించారు. ఈ ఎన్నికల్లో కన్సర్వేటివ్‌లు లేబర్ పార్టీ కంటే స్వల్ప ఆధిక్యతను మాత్రమే కనబరచగలరని సర్వేలు చెప్పిన జోస్యం కూడా ఓటర్లను ప్రభావితం చేసింది. అదే జరిగితే లేబర్ పార్టీ ఎస్ఎన్పీతో పొత్తు కుదుర్చుకుని ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుందని, దాన్ని కాపాడుకోవడం కోసం స్కాట్లాండ్లో తిరిగి రిఫరెండం నిర్వహించడంతోసహా ఆ పార్టీ పెట్టే డిమాండ్లన్నిటికీ తలొగ్గుతుందని జనం భయపడ్డారు. ఈ విషయంలో కామెరాన్ చేసిన ప్రచారాన్ని వారు బలంగా నమ్మారు. అందుకే లేబర్ పార్టీపై మొగ్గు చూపినవారు సైతం చివరి నిమిషంలో కన్సర్వేటివ్లవైపు వెళ్లారన్నది విశ్లేషకుల అంచనా. స్కాట్లాండ్ ప్రాంతంలో జాతీయ ఆకాంక్షలను రేకెత్తించి లేబర్ పార్టీకి పడాల్సిన ఓట్లన్నీ ఎస్ఎన్పీ తన్నుకుపోయింది. ఆ ప్రాంతంలో లేబర్పార్టీకున్న 41 స్థానాల్లో 40 స్థానాలు ఎస్ఎన్పీ కైవసమయ్యాయి. ఇక దేశంలోని వేల్స్, ఇంగ్లండ్ ప్రాంతాల్లో సైతం జాతీయ ఆకాంక్షల కారణంగానే లేబర్ పార్టీ ఘోరంగా దెబ్బతింది. 2010 వరకూ కంచుకోటలుగా ఉన్న ఎన్నో నియోజకవర్గాలు ఆ పార్టీకి దూరమయ్యాయి. ఈ ఎన్నికల్లో యూకేఐపీ ఓట్ల పరంగా చూస్తే మూడో స్థానంలో ఉన్నా ఒకే ఒక్క స్థానాన్ని గెలుచుకుని ఘోర పరాభవాన్ని పొందింది. ఓట్లను చీల్చడం ద్వారా లేబర్ పార్టీనే అది ఎక్కువగా దెబ్బతీసింది. వలసలపై యూకేఐపీ తీవ్ర వ్యతిరేకతను ప్రదర్శించినా అది కన్సర్వేటివ్‌లకు లాభించినట్టుగా ఆ పార్టీకి ఉపయోగపడలేదు. ఇరాక్ యుద్ధ సమయంలో లేబర్ పార్టీ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై జనం ఇప్పటికీ కోపంగా ఉన్నారని ఎన్నికలు రుజువుచేశాయి. ఆ సమయంలో ప్రధానిగా ఉన్న టోనీ బ్లెయిర్ అమెరికా చెప్పినట్టల్లా ఆడి దేశాన్ని యుద్ధంలోకి దించి ఆర్థికంగా కుంగదీశారన్న అభిప్రాయం జనంలో బలంగా ఉంది. మరోసారి లేబర్ పార్టీ విజయం సాధిస్తే అలాంటి పరిస్థితులే ఏర్పడగలవన్న అభిప్రాయం కూడా వ్యాప్తిలోకి వచ్చింది.
ఈసారి ఎన్నికల్లో ఉపాధి నిమిత్తం యూరప్ దేశాల నుంచి...మరీ ముఖ్యంగా ఫ్రాన్స్, ఇటలీల నుంచి వచ్చిపడుతున్న వలసలు ప్రధాన పాత్ర పోషించాయి. వీటని అరికట్టడానికి అవసరమైతే యూరప్ యూనియన్(ఈయూ)నుంచి బయటకు రావడానికి సిద్ధమని ప్రకటించిన కామెరాన్ మాటలే జనాన్ని ఆకట్టుకున్నాయి. వలసలపై ఈయూతో చర్చించడమే మార్గమని, ఆ సంస్థనుంచి తప్పుకోవడం ఆత్మహత్యాసదృశమవుతుందని లేబర్ పార్టీ చేసిన వాదన వారికి రుచించలేదు. ఆ పార్టీకి ఓటేస్తే వలసల విషయంలో కఠినంగా ఉండలేదన్న సంశయం వారికి కలిగింది. ఈ విషయంలో మిలిబాండ్ కంటే ప్రధానిగా ఉన్న కామెరాన్ గట్టిగా మాట్లాడుతున్నారన్న అభిప్రాయం అందరిలోనూ ఏర్పడింది. నిజానికి కామెరాన్ హామీ ఇచ్చినట్టు ఈయూలో కొనసాగడంపై 2017లో రిఫరెండం నిర్వహిస్తే అందువల్ల అంతిమంగా నష్టపోయేది బ్రిటనే. ఈయూలో భాగం కాదు గనుక బ్రిటన్ తన వలస చట్టాలను కఠినం చేసి ఎవరినీ రానీయకుండా చేయొచ్చుగానీ... ఇన్నాళ్లుగా యూరప్‌లో చలాయిస్తున్న పెద్దరికాన్ని, పరపతిని అది కోల్పోతుంది. పర్యవసానంగా అంతర్జాతీయంగా దాని పలుకుబడి క్షీణిస్తుంది. స్కాట్లాండ్లో మరోసారి రిఫరెండం డిమాండ్ ముందుకు వస్తుంది. జనం లేబర్ పార్టీ తిరిగి రావడంవల్ల ఎస్ఎన్పీ బలపడుతుందనుకున్నారుగానీ... కామెరాన్ ప్రతిపాదిస్తున్న చర్యలవల్ల ఆ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుందని గుర్తించలేకపోయారు. విజయోత్సవ ప్రసంగంలో కామెరాన్ స్కాట్లాండ్కూ, వేల్స్కూ అధికార వికేంద్రీకరణ చేస్తానని హామీ ఇచ్చారు. వాటి మాటెలా ఉన్నా 2017లో ఆయన నిర్వహిస్తానంటున్న రిఫరెండంపై కార్పొరేట్ వర్గాలు గుబులుగా ఉన్నాయి. ఆ విషయంలో కామెరాన్ తుది నిర్ణయం ఎలా ఉంటుందోనని బెంగపడుతున్నాయి. మొత్తానికి ఈసారి బ్రిటన్ ప్రజలు ఏక పార్టీ పాలనకు పట్టంగట్టారు. ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవడంలో స్వీయ విధానాలే ఆయనకు అడ్డంకి. వీటిలో ఎన్నిటిని ఆయన సవరించుకుని జనరంజకంగా పాలన సాగించగలరన్నది రాబోయే కాలం తేలుస్తుంది.