broke down
-
మాట్లాడుతూనే ఏడ్చేసిన హీరోయిన్
న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొనే కంటతటి పెట్టింది. తాను తీవ్ర మానసిక ఒత్తిడిలోకి పోయిన సందర్భాలు గుర్తు చేసుకొని ఆ సమయంలో తన తల్లి, తండ్రి, సోదరి తన వెంట లేకుంటే తాను ఈ రోజు ఇక్కడ ఉండేదాన్ని కాదంటూ గద్గద స్వరంతో చెప్పింది. అయితే, ఏ విషయంలో ఒత్తిడికి లోనైందని మాత్రం చెప్పలేదు. 'లివ్ లవ్ లాఫ్' అనే తన స్వచ్ఛంద సంస్థ ద్వారా డిప్రెషన్ పై అవగాహనను ప్రారంభించిన సందర్భంగా దీపికా తన గతాన్ని గుర్తు చేసుకొని కన్నీరు పెట్టుకుంది. 'ఈరోజు మనం ఎలాంటి సమాజంలో బతుకుతున్నామనే విషయం ప్రతి ఒక్కరం తెలుసుకోవాలి.మన ముందు పెద్ద పోటీ ప్రపంచం ఉంది. అందులో నుంచి చొచ్చుకొని వెళ్లగలగాలి. అదే మంచిది కూడా. అదే సమయంలో ప్రతి ఒక్కరూ ఈ రోజుల్లో చాలా సున్నిత మనస్తత్వంగలవారిగా మారుతున్నారనే విషయం గుర్తు చేస్తున్నాను. ఏ ఒక్కరూ అలా మారకూడదు. ఈ సమాజానికి చెందిన వాళ్లం కాదనే ఆలోచన ఏ ఒక్కరి మనసులో అస్సలు రానీయకూడదు. మా అమ్మగురించి మీకో విషయం చెప్పాలనుకుంటున్నాను. మా అమ్మనాతో లేకుంటే నేను లేను. ఆమె అన్ని వేళలా నాతో ఉంది. అలాగే, నా తండ్రి, సోదరి కూడా. వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెబుతున్నాను' అంటూ దీపికా చెప్పింది. -
కన్నీళ్లు పెట్టుకున్న ప్రియాంక
ముంబై: బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కన్నీళ్లు పెట్టుకుంది. చిన్నపిల్లలా ఏడ్చింది. ఆమెను దర్శకుడు ప్రకాశ్ ఝా ఓదార్చారు. 'జై గంగాజల్' సినిమా షూటింగ్ సెట్ లో ఈ సన్నివేశం చోటుచేసుకుంది. యాక్షన్ సీన్ తీస్తుండగా సహనటుడు మానవ్ కాల్ మెడపై ప్రియాంక పొరపాటున తన్నింది. అతడు ఛాతిపై తన్నాలని ఫైట్ మాస్టర్ చెప్పగా, ప్రియాంక పొరపాటున అతడి మెడపై తన్నేసింది. దీంతో ఒక్కసారిగా అతడు కుప్పకూలాడు. యూనిట్ సభ్యులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. మానవ్ దెబ్బలేవీ తగలనప్పటికీ అతడు షాక్ తిన్నాడు. అయితే తాను చేసిన పొరపాటుతో ప్రియాంక వెంటనే కన్నీళ్లు పెట్టుకుంది. షూటింగ్ లో ఇలాంటివి సాధారణంగా జరుగుతుంటాయని దర్శకుడు ప్రకాశ్ ఝా సర్దిచెప్పినా ఆమె ఏడుపు ఆపలేదు. తాను కావాలని తన్నలేదని, పొరపాటుగా అలా జరిగిందని పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. మానవ్ వెంటనే తేరుకున్నా ప్రియాంక మాత్రం తప్పు చేసిన భావనతో చాలా బాధ పడిందని ప్రకాశ్ ఝా తెలిపారు. షూటింగ్ లో సహనటులకు ఆమె ఎంతో సహకరిస్తుందని కొనియాడాడు. -
విచారణలో సోమనాథ్ భారతి కన్నీళ్లు
న్యూఢిల్లీ: పోలీసుల విచారణలో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మాజీ మంత్రి సోమనాథ్ భారతి కన్నీరు పెట్టుకున్నారు. కేసు విచారణ నిమిత్తం పోలీసుల వేసిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ ఏడ్చేశారు. తనపై గృహహింసకు పాల్పడ్డారని, హత్చేసేందుకు కూడా ప్రయత్నించారని సోమనాథ్ భారతి భార్య లిపికా మిత్ర కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన చాలాసార్లు తప్పించుకోవాలని ప్రయత్నించి చివరకు సుప్రీంకోర్టు ఆదేశాలతో పోలీసులకు లొంగిపోయారు. విచారిస్తున్న సమయంలో ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారని విచారణ అధికారి తెలిపారు. ప్రస్తుతం ఆయనపై ఐపీసీ సెక్షన్ 212 (అపరాధికి ఆశ్రయం ఇవ్వడం) కింద కూడా కేసు నమోదు చేశామని, మరో ఐదుగురిని కూడా నిందితులుగా చేర్చామని చెప్పారు. ఇన్ని రోజులు ఎక్కడెక్కడకు వెళ్లారో, ఆయనకు ఎవరు ఆశ్రయం ఇచ్చారో అనే వివరాలు సేకరించినట్లు తెలిపారు. ఆయన ఏయే ప్రాంతాల్లో ఆశ్రయం పొందారో ఆ ప్రాంతాలకు తీసుకెళ్లి విచారణ జరపాల్సి ఉందని చెప్పారు.