రాజ్యసభలో మహిళా ఎంపీ కన్నీరుమున్నీరు
అన్నాడీఎంకే పార్టీకి చెందిన మహిళా ఎంపీ రాజ్యసభలో కన్నీరుమున్నీరయ్యారు. ఢిల్లీ విమానాశ్రయంలో డీఎంకే ఎంపీ తిరుచ్చి శివను చెంప మీద ఎడాపెడా కొట్టిన ఆమె.. తన ప్రాణాలకు ముప్పుందని, తమిళనాడులో తనకు రక్షణ లేదని, అందువల్ల రక్షణ కల్పించాలని కోరుతూ రాజ్యసభలో కన్నీరుపెట్టారు. శనివారం నాడు ఢిల్లీ విమానాశ్రయంలో ఇద్దరు ఎంపీలు గొడవపడి, కొట్టుకున్న తర్వాత.. పార్టీ అధినేత్రి జయలలిత వద్దకు వెళ్లి ఆమె జరిగిన విషయం గురించి చెప్పారు. అయితే.. పార్టీ పరువును బజారుకు ఈడ్చారంటూ ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాక, ఎంపీ పదవికి కూడా రాజీనామా చేయాలని జయలలిత ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం. (చదవండి: డీఎంకే ఎంపీకి చెంపదెబ్బలు)
అదే విషయాన్ని ఆమె పరోక్షంగా రాజ్యసభలో కూడా ప్రస్తావించారు. తన ప్రాణాలకు ముప్పుందని, తనకు ఉన్న రాజ్యాంగబద్ధమైన పదవి నుంచి రాజీనామా చేయాల్సిందిగా బలవంతం చేస్తున్నారని.. అయితే తాను మాత్రం రాజీనామా చేసేది లేదని ఆమె సభలో చెప్పారు. విమానాశ్రయంలో జరిగిన చిన్న గొడవను డీఎంకే ఎంపీ అనవసరంగా పెద్దది చేశారని, సోషల్ మీడియాలో కూడా తన పరువు తీసేలా వ్యవహరించారని అన్నారు. మహిళా ఎంపీ అయిన తనను ఇలా వేధిస్తుంటే ఇక తమకు రక్షణ ఎక్కడ ఉంటుందని అడిగారు. తమిళనాడులో తనకు రక్షణ లేనందున తగినంత భద్రత కల్పించాలని కోరారు.
ఒక నేత తనను చెంపమీద కొట్టారని చెప్పిన ఆమె.. ఎవరు కొట్టారో మాత్రం చెప్పలేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచే తన ప్రాణాలకు ముప్పుందని అన్నారు. సభ్యులందరికీ చైర్మన్ రక్షణ కల్పిస్తారని, అలాగే మీకు కూడా రక్షణ ఇస్తారని డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ అన్నారు. అయితే సభకు వచ్చి సమాధానం చెప్పుకునే అవకాశం లేనివాళ్ల పేర్లు మాత్రం ప్రస్తావించొద్దని తెలిపారు. కావాలనుకుంటే చైర్మన్కు ఒక లేఖ రాసి తగిన చర్య తీసుకోవాల్సిందిగా కోరవచ్చన్నారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు సహా ప్రతిపక్ష ఎంపీలు ఒక్కసారిగా లేచి.. తోటి సభ్యురాలి ఆవేదన ఏంటో వినాలని నినాదాలు చేశారు.