బీఎస్పీ నేత అరెస్ట్ అన్యాయం
తిరువళ్లూరు: బీఎస్పీ నేతపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ కోర్టు ఆవరణలోకి దూసుకెళ్లడానికి మహిళలు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. తిరువళ్లూరు జిల్లాలో బీఎస్పీ ఉపకార్యదర్శిగా ప్రేమ్ను సోమవారం ఉదయం పోలీసులు విచారణ పేరిట తీసుకెళ్లారు. అనంతరం ప్రేమ్పై హత్యాయత్నం కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఇదే విషయం స్థానికులకు తెలియడంతో పెద్దఎత్తున కోర్టు ఆవరణలోకి చేరుకున్న మహిళలు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోర్టులోకి దూసుకెళ్లడానికి ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం నెలకొంది.
ఇదే సమయంలో కోర్టు నుంచి జైలుకు ప్రేమ్ను తీసుకెళుతున్న వాహనం రావడంతో మహిళలు పోలీసుల వాహనాన్ని అడ్డుకుని నిరసన తెలిపారు. గతంలో ప్రేమ్పై పలు ఆరోపణలు, కేసులు ఉన్నాయని వివరించిన మహిళలు, ప్రస్తుతం ప్రశాంతంగా జీవిస్తున్న అతనిపై కేసులు నమోదు చేసి అక్రమంగా అరెస్టు చేయడం ఏమిటని ప్రశ్నించారు. దీంతో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. వాహనాన్ని అడ్డుకుని నిరసన వ్యక్తం చేసిన మహిళలను పక్కకు తప్పించిన పోలీసులు ప్రేమ్ను రిమాండ్కు తరలించారు. కోర్టు ఆవరణలో పోలీసులు, ఆందోళనకారులకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం నెలకొనడంతో ఉద్రిక్తత నెలకొంది.