Budan Beg
-
కారు దిగిన బేగ్
సాక్షిప్రతినిధి, ఖమ్మం: తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి సంస్థ చైర్మన్, ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు బుడాన్ బేగ్ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. బుధవారం ఆయన తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చేపట్టిన ఆయనకు ఒక దశలో మైనార్టీ కోటాలో కేసీఆర్ ఎమ్మెల్సీ పదవి ఇస్తారనే ప్రచారం కూడా జరిగింది. 2009లో టీఆర్ఎస్లో చేరిన బుడాన్ బేగ్ ఉద్యమ సమయంలో పార్టీలో కీలకంగా వ్యవహరించారు. అనేక ఆందోళనలు, ఉద్యమాలకు నేతృత్వం వహించిన ఆయనను టీఆర్ఎస్ పార్టీ 2014లో ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించింది. తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో ఆయన ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా పనిచేశారు. అయితే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బేగ్ ఆకస్మిక నిర్ణయం టీఆర్ఎస్లో కలకలం రేపింది. ఇటీవలి వరకు పార్టీ రాష్ట్ర నేతలు, సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, తుమ్మల నాగేశ్వరరావు వంటి ముఖ్యనేతల పర్యటనలు, సభలు, సమావేశాలు నిర్వహించిన సమయంలో వేదికపై అంతా తానై నడిపించిన ఆయన అకస్మాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారనే అంశం కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకుల్లో చర్చనీ యాంశంగా మారింది. మంత్రి తుమ్మలకు అత్యం త సన్నిహితుడిగా.. ప్రధాన అనుచరుడిగా వ్యవహరించి.. కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేస్తున్న బేగ్ పార్టీ వీడడం వెనుక కారణాలపై శ్రేణులు ఆరా తీసే పనిలో పడాయి. కొంతకాలంగా బేగ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, పార్టీలో తన నిర్ణయానికి విలువ లేకుండా పోయిందని, ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉద్యమ సమయంలో పనిచేసిన వారిని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని పలు సందర్భాల్లో కార్యకర్తల ఎదుట ఆవేదనకు గురైనట్లు ప్రచారం జరుగుతోంది. బేగ్ కీలక ఎన్నికల సమయంలో కారు దిగి.. సైకిలెక్కడంతో జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ప్రభావం పడే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈనెల 28న రాహుల్‌గాంధీ పర్యటనలో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఖమ్మం రానుండడంతో అదే సమయంలో బేగ్ చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. నియంతృత్వ విధానాల వల్లే.. టీఆర్ఎస్ పార్టీలో నియంతృత్వం మితిమీరుతోందని, వ్యక్తి స్వేచ్ఛకు తావు లేదని, ఉద్యమ కాలం లో పార్టీ కోసం సర్వం త్యాగం చేసిన వారికి గుర్తింపు లేదనే కారణాల వల్లే టీఆర్ఎస్ను వీడుతున్నట్లు బేగ్ తెలిపారు. మైనార్టీల సంక్షేమానికి ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదని, బీజేపీతో లోపాయికారి ఒప్పందంతో మైనార్టీల హక్కులకు భం గం కలిగించేలా వ్యవహరిస్తుందన్న మనోవేదన సైతం తాను పార్టీ వీడేందుకు ఒక కారణమని చెప్పారు. పార్టీ సభ్యత్వానికి.. కార్పొరేషన్ చైర్మన్ పదవికి మంగళవారం రాజీనామా చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో చెమటోడ్చిన నేతల కష్టాన్ని పార్టీ విస్మరించిందని, వారికి కనీస గుర్తింపు ఇవ్వడంలోనూ విఫలమైందని, ఈ అంశం తనను ఎంతగానో బాధించిందని అన్నారు. తనతోపాటు ఉద్యమ కాలంలో పనిచేసిన వారికి పార్టీలో సరైన గుర్తింపు లేదన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక గతంలో ఉన్న వారి చేతిలో కాకుండా.. ఉద్యమ ద్రోహుల చేతిలో కి పార్టీ వెళ్లిందని ఆయన అభిప్రాయపడ్డారు. మరిన్ని వార్తాలు... -
టీఆర్ఎస్కు భారీ షాక్
సాక్షి, ఖమ్మం : అసెంబ్లీ ఎన్నికల వేళ టీఆర్ఎస్ పార్టీకి ఊహించిన షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, ఇండస్ట్రీయల్ డెవలప్మెంట్ ఛైర్మన్ (ఐడీసీ), ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు బుడాన్ బేగ్ పార్టీకి రాజీనామా చేయనున్నారు. గత కొంత కాలంగా పార్టీతో అంటీముట్టనట్టు ఉంటున్న బేగ్ తాజా నిర్ణయంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో కలకలం రేపింది. టీఆర్ఎస్పై అసంతృప్తితో ఉన్న బేగ్‌తో మహాకూటమి నేతలు ఇదివరకే మంతనాలు జరిపినట్లు సమాచారం. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న బేగ్ ప్రస్తుతం ఐడీసీ ఛైర్మన్‌గా రాష్ట్ర స్థాయి పదవిలో ఉన్నారు. జిల్లాలో కీలక నేతగా ఉన్న ఆయనతో మహాకూటమి అభ్యర్థి టీడీపీ నేత నామా నాగేశ్వరరావు సంప్రదింపులు జరిపినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కీలకంగా భావించే ఖమ్మంలో ఏకంగా జిల్లా అధ్యక్షుడు రాజీనామాతో పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని నేతలు భావిస్తున్నారు. బుడాన్ రాజీనామా వార్తలతో కంగుతిన్న గులాబీ అధిష్టానం మంత్రి తుమ్మల నాగేశ్వరరావును రంగంలోకి దింపి ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తోంది. ఇదిలా వుండగా బేగ్ టీడీపీలో చేరతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఖమ్మం అసెంబ్లీ స్థానంలో టీఆర్ఎస్, టీడీపీ మధ్య పోరు ఉత్కంఠగా మారిన విషయం తెలిసిందే. ఈ స్థానంలో తాజా మాజీ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్‌పై మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావును మహాకూటమి బరిలో నిలిపింది. నామాకు మద్దతుగా మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి ప్రచారంలోకి దిగడంతో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. ఈ నేపథ్యంలో ఖమ్మం నియోజకవర్గ పరిధిలో మైనార్టీల ఓట్లను తమవైపు తిప్పుకునేందుకు రేణుక, నామా నాగేశ్వరరావులు చక్రం తిప్పినట్టు తెలిసింది. రాజీనామాపై బెగ్ ఈరోజు సాయంత్ర మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. కాగా ఎన్నికల వేళ టీఆర్ఎస్ పార్టీకి నేతలు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, యాదవరెడ్డి, రాజీనామాలు మరువక ముందే మరో సీనియర్ నేత పార్టీని వీడడంతో గులాబీ శ్రేణులకు మింగుడుపడడంలేదు. కాగా గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ గాలి వీచగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేవలం ఒకే ఒక స్థానంలో టీఆర్ఎస్ విజయం సాధించింది. -
దిగ్విజయ్‌ను తెలంగాణలో తిరగనీయం!
ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్, పార్టీ నేత బుడన్ బేగ్ సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలోని అన్ని కులాలకు సమన్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నుంచి ముస్లిం మైనారిటీలను దూరం చేయాలని కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్ అన్నారు. ఆ పార్టీ నాయకుడు దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు అత్యంత బాధ్యతారాహిత్యమని, ఆయన తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ పోలీసులకు క్షమాపణ చెప్పకుంటే రాష్ట్రంలో తిరగనీయమని హెచ్చరించారు. పార్టీ సీనియర్ నాయకుడు బుడన్ బేగ్‌తో కలసి మంగళవారం తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు. ముస్లింలను టీఆర్ఎస్కు దూరం చేయాలని కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని మండిపడ్డారు. దిగ్విజయ్ వ్యాఖ్యలపై సీఎల్పీ నేత జానారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, షబ్బీర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దిగ్విజయ్‌పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కర్ణాటక రాష్ట్రం నుంచి దిగ్విజయ్‌ను ఇన్చార్జి బాధ్యతల నుంచి తొలగించిన మాదిరిగానే తెలంగాణ ఇన్చార్జి బాధ్యతల నుంచి కూడా తొలగించాలని కాంగ్రెస్ హై కమాండ్‌కు సూచించారు. తెలంగాణ పోలీసులు సమర్ధంగా పనిచేస్తుంటే ఓర్వలేక పోతున్నారని ఆయన విమర్శించారు.