సాక్షి, ఖమ్మం : అసెంబ్లీ ఎన్నికల వేళ టీఆర్‌ఎస్ పార్టీకి ఊహించిన షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, ఇండస్ట్రీయల్ డెవలప్‌మెంట్ ఛైర్మన్ (ఐడీసీ), ఖమ్మం జిల్లా టీఆర్‌ఎస్ అధ్యక్షుడు బుడాన్ బేగ్ పార్టీకి రాజీనామా చేయనున్నారు. గత కొంత కాలంగా పార్టీతో అంటీముట్టనట్టు ఉంటున్న బేగ్ తాజా నిర్ణయంతో టీఆర్‌ఎస్ శ్రేణుల్లో కలకలం రేపింది. టీఆర్‌ఎస్‌పై అసంతృప్తితో ఉన్న బేగ్‌తో మహాకూటమి నేతలు ఇదివరకే మంతనాలు జరిపినట్లు సమాచారం. టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న బేగ్ ప్రస్తుతం ఐడీసీ ఛైర్మన్‌గా రాష్ట్ర స్థాయి పదవిలో ఉన్నారు. జిల్లాలో కీలక నేతగా ఉన్న ఆయనతో మహాకూటమి అభ్యర్థి టీడీపీ నేత నామా నాగేశ్వరరావు సంప్రదింపులు జరిపినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ కీలకంగా భావించే ఖమ్మంలో ఏకంగా జిల్లా అధ్యక్షుడు రాజీనామాతో పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని నేతలు భావిస్తున్నారు. బుడాన్ రాజీనామా వార్తలతో కంగుతిన్న గులాబీ అధిష్టానం మంత్రి తుమ్మల నాగేశ్వరరావును రంగంలోకి దింపి ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తోంది. ఇదిలా వుండగా బేగ్ టీడీపీలో చేరతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఖమ్మం అసెంబ్లీ స్థానంలో టీఆర్‌ఎస్, టీడీపీ మధ్య పోరు ఉత్కంఠగా మారిన విషయం తెలిసిందే. ఈ స్థానంలో తాజా మాజీ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్‌పై మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావును మహాకూటమి బరిలో నిలిపింది.
నామాకు మద్దతుగా మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి ప్రచారంలోకి దిగడంతో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. ఈ నేపథ్యంలో ఖమ్మం నియోజకవర్గ పరిధిలో మైనార్టీల ఓట్లను తమవైపు తిప్పుకునేందుకు రేణుక, నామా నాగేశ్వరరావులు చక్రం తిప్పినట్టు తెలిసింది. రాజీనామాపై బెగ్ ఈరోజు సాయంత్ర మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. కాగా ఎన్నికల వేళ టీఆర్‌ఎస్ పార్టీకి నేతలు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, యాదవరెడ్డి, రాజీనామాలు మరువక ముందే మరో సీనియర్ నేత పార్టీని వీడడంతో గులాబీ శ్రేణులకు మింగుడుపడడంలేదు. కాగా గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్ గాలి వీచగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేవలం ఒకే ఒక స్థానంలో టీఆర్‌ఎస్ విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment