బడ్జెట్ ‘హల్వా’ రెడీ..!
సాంప్రదాయ హల్వా తయారీ కార్యక్రమంతో బడ్జెట్ పత్రాల ముద్రణ షురూ
న్యూఢిల్లీ: పార్లమెంటులో ఈ నెల 28న ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టనున్న 2015-16 బడ్జెట్ పత్రాల ముద్రణా ప్రక్రియ ప్రారంభమైంది. సాంప్రదాయబద్దంగా ‘హల్వా’ తయారీ, రుచుల ఆస్వాదనతో ఇక్కడి నార్త్ బ్లాక్ కార్యాలయంలో గురువారం ఈ కార్యక్రమం ప్రారంభమయ్యింది. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ సహా, ఆర్థిక మంత్రిత్వశాఖ సిబ్బంది మొత్తం ఈ సందర్భంగా హల్వా రుచిచూస్తూ సందడి సందడిగా గడిపారు.
ఈ కార్యక్రమం అనంతరం బడ్జెట్ తయారీ, ప్రింటింగ్ ప్రక్రియతో ప్రత్యక్షంగా సంబంధమున్న అధికారులు, వారికి సహాయ సహకారాలు అందించే సిబ్బంది అంతా నార్త్‌బ్లాక్ కార్యాలయానికే పరిమితమైపోతారు. లోక్‌సభలో ఆర్థికమంత్రి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేంతవరకూ వారి కుటుంబాలతో సైతం వారు ఎటువంటి సంబంధాలనూ నెరపరు. ఫోనులోకానీ, ఈ-మెయిల్ లాంటి మరేదైనా కమ్యూనికేషన్ రూపంలో కానీ వారి ఆప్తులను సైతం సంప్రదించడానికి వీలుండదు. ఒక్క మాటలో చెప్పాలంటే బాహ్య ప్రపంచంతో వారికి పూర్తిగా సంబంధాలు తెగిపోతాయి.
ఆర్థిక శాఖలో అత్యున్నత స్థాయిలో ఉండే చాలా కొద్దిమంది అధికారులకు మాత్రమే వారి ఇళ్లకు వెళ్లడానికి వీలుంటుంది. గురువారంనాడు నార్త్‌బ్లాక్‌లో హల్వా రుచి చూసిన వారిలో ఆర్థికశాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా, ఆర్థిక కార్యదర్శి రాజీవ్ మహర్షి, రెవెన్యూ కార్యదర్శి శక్తికాంత్ దాస్, జాయింట్ సెక్రటరీ (బడ్జెట్) రజిత్ భార్గవ తదితర సీనియర్ అధికారులు ఉన్నారు.
రహస్యం.. అంతా రహస్యం!
⇒ ఎంతో పకడ్బందీగా తయారయ్యే ఈ బడ్జెట్ గనక ముందే బయటకు తెలిసిపోతే... బడ్జెట్‌ను కొన్ని వర్గాలు ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి... బడ్జెట్ తయారీ ప్రక్రియ చాలా రహస్యంగా ఉంటుంది.
⇒ ‘వీవీఐపీ’ స్థాయిలో భద్రత ఉంటుంది. అత్యాధునిక పర్యవేక్షణ పరికరాలు, పటిష్టమైన సైనిక భద్రత, ఆధునిక నిఘా పరికరాలు, జామర్లు, పెద్ద స్కానర్లు... ఇలా అనేక రూపాల్లో అత్యాధునిక పరికరాల్ని ఏర్పాటు చేస్తారు.
⇒ ఆర్థికమంత్రి పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టే వరకూ ఈ భద్రత కొనసాగుతూనే ఉంటుంది. వీటితో పాటు ఈ బడ్జెట్ ప్రక్రియ కొనసాగినంత కాలం నార్త్‌బ్లాక్‌లో ఉండే ఆర్థికశాఖ కార్యాలయం నుంచి, ఆ బ్లాక్ కింద ఉండే బడ్జెట్ ముద్రణా విభాగం నుంచి వెళ్లే ఫోన్లను అన్నింటినీ ట్యాప్ చేసేందుకు ప్రత్యేక ఎక్స్ఛేంజీని సైతం ఏర్పాటు చేస్తారు.
⇒ అంతేకాక మొబైల్ ఆపరేటర్ల సమన్వయంతో ఇక్కడి నుంచి వెళ్లే ప్రతి కాల్‌ను ట్యాప్ చేస్తారు. ఆర్థికశాఖ కార్యాలయం, వరండాలలో ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు పనిచేయకుండా ప్రత్యేక పరికరాలు ఏర్పాటుచేస్తారు.
⇒ ఇక ఈ కార్యాలయానికి వెళ్లే మార్గంలో పెద్ద ఎక్స్‌రే స్కానర్‌ను ఏర్పాటుచేసి, దానిని కంప్యూటర్‌తో అనుసంధానిస్తారు. ఈ పరికరాల వల్ల ఏ చిన్న వస్తువు తీసుకువెళ్తున్నా ఇట్టే తెలిసిపోతుంది.
⇒ నార్త్‌బ్లాక్ అడుగుభాగంలో ఉండే ప్రత్యేకమైన ముద్రణాలయంలో బడ్జెట్‌ను ముద్రిస్తారు. అలాగే బడ్జెట్‌ను ముద్రించే సమయంలో ఆర్థికశాఖ కార్యదర్శి... ప్రధానితోను, ఆర్థిక మంత్రితోను సమన్వయం చేస్తూ సమావేశాలకు హాజరవుతూ ఉంటారు.
⇒ ముద్రణా పరిసరాల్లో అనునిత్యం ఐబీ అధికారులు, ఢిల్లీ పోలీసులు కునుకులేకుండా కాపలాకాస్తుంటారు.
⇒ మధ్య మధ్యలో సెక్యూరిటీని పరీక్షించేందుకు ‘మాక్ డ్రిల్’ కూడా జరుగుతూ ఉంటుంది. ఈ డ్రిల్‌లో ఉద్దేశపూర్వకంగా కొన్ని పత్రాలు బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తారు. వీరిని గనుక సమర్థంగా పట్టుకోగలిగితే భద్రత చక్కగా ఉన్నట్లే. లేకుంటే భద్రత సిబ్బందిపై తీవ్ర స్థాయిలో కఠిన చర్యలు ఉంటాయి.
⇒ ఇక బడ్జెట్‌ను ప్రవేశపెట్టే రోజున వాటి ప్రతుల్ని భారీ బందోబస్తు మధ్య పార్లమెంటు భవనానికి తరలిస్తారు. అనంతరం ఆర్థికమంత్రి సార్వత్రిక బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెడతారు.