హల్వా తయారీ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఇతర అధికారులు
న్యూఢిల్లీ: ‘బడ్జెట్ హల్వా’ఉత్సవం శనివారం సాయంత్రం ఇక్కడి ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయం నార్త్‌బ్లాక్‌లో జరిగింది. సాధారణంగా బడ్జెట్ పత్రాల ముద్రణను హల్వా తయారీతో ఆరంభిస్తారు. ఈ ఆనవాయితీలో భాగంగానే వచ్చే నెల 5న ప్రవేశపెట్టే బడ్జెట్‌కు సంబంధించిన పత్రాల ముద్రణను ప్రారంభించే కార్యక్రమానికి ముందు హల్వా ఉత్సవం చోటు చేసుకుంది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆర్థిక శాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్, రెవెన్యూ కార్యదర్శి అజ్ భూషణ్ పాండే, దీపమ్ కార్యదర్శి అతను చక్రవర్తి, ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్ కుమార్ తదితరులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. హల్వా సంరంభంలో భాగంగా పెద్ద కడాయిలో హల్వాను తయారు చేసి, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులకు, బడ్జెట్ తయారీకి సంబంధించిన సిబ్బందికి వడ్డించారు. ఈ సిబ్బంది... బడ్జెట్ తయారీ నుంచి లోక్‌సభలో ప్రవేశపెట్టేవరకూ ఆర్థిక మంత్రిత్వ శాఖ భవనంలోనే ఉంటారు. బయటి ప్రపంచంతో వారికి ఎలాంటి సంబంధాలు ఉండవు. ఉన్నతాధికారులకు మాత్రమే ఇంటికి వెళ్లడానికి అనుమతి ఉంటుంది.
ఆర్థిక నిపుణులతో ప్రధాని భేటి..
ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థికవేత్తలు, పారిశ్రామిక నిపుణులతో శనివారం సమావేశమయ్యారు. నీతి ఆయోగ్ నిర్వహించిన ఈ సమావేశంలో ఆర్థిక వేత్తలు, వివిధ పరిశ్రమల నిపుణులు పాల్గొన్నారు. వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్, గణాంకాలు, పథకాల అమలు శాఖ సహాయ మంత్రి ఇంద్రజిత్ సింగ్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్‌లు కూడా హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment