Building Architecture
-
ఈ భవనానికి విద్యుత్తు తీగలుండవు!
బిల్డింగ్ చూశారుగా.. ఎలా ఉంది? అద్భుతంగా ఉంది అంటున్నారా? ఓకే. నెదర్లాండ్స్‌కు చెందిన ఆర్కిటెక్చర్ సంస్థ ఫండమెంటల్ ఆర్కిటెక్టస్ సిద్ధం చేశారు ఈ బిల్డింగ్ డిజైన్. చూసేందుకు ఓహో అనేలా ఉండటం ఒక్కటే దీని గొప్పదనం కాదు. ఇంకా చాలా ఉన్నాయి. అన్నింటికంటే ముందుగా చెప్పాల్సింది... ఓ నదిపై కట్టే ఈ బిల్డింగ్... ఆ నీటి నుంచే విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవడం!! అదెలా? అన్న ప్రశ్నకు సమాధానం తెలుసుకునేలోపు కజకిస్తాన్‌లోని ఆస్తానాలో ఏర్పాటు కానున్న ఈ బిల్డింగ్ వివరాలు కొన్ని తెలుసుకుందాం. ఈ భవనం ఎత్తు 396 అడుగులు కాగా.. మొత్తం ఎనిమిది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం ఉంటుంది. నివాస భవనాలతోపాటు హోటళ్లు, షాపుల్లాంటివీ ఉంటాయి. ద టవర్ ఆఫ్ సన్ పేరుతో డిజైన్ చేశారు దీని దిగువన ఉన్న నదిలోని నీటి ప్రవాహాన్ని అడ్డుకుని జనరేటర్ల ద్వారా విద్యుత్తు ఉత్పత్తి చేస్తారు. భవనం కింది భాగంలో నది వెడల్పు తక్కువగా ఉంటుందని మరింత తగ్గించడం ద్వారా ప్రవాహ వేగాన్ని పెంచి ఆ చలన శక్తిని విద్యుత్తుగా మార్చాలన్నది ఫండమెంటల్ ఆర్కిటెక్ట్స్ ప్రణాళిక. దీంతోపాటు భవనంలోని వేడిని బయటకు పంపేందుకు ఓ హీట్పంప్ను కూడా ఉపయోగిస్తామని, వేసవిలోనూ వేడెక్కకుండా ఉండేలా నైరుతి దిశగా నిర్మాణం ఉంటుందని సంస్థ తెలిపింది. కజకిస్థాన్‌కు చెందిన బీ1 గ్రూప్ నిర్వహించిన ఆర్కిటెక్చర్ పోటీలో ద టవర్ ఆఫ్ సన్ అందరి ప్రశంసలు అందుకుంది. -
బిల్డింగ్ ఆర్కిటెక్చర్ సలహాదారుగా సుద్దాల సుధాకర్ తేజ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు వాస్తుకు అత్యంత ప్రాధాన్యమిస్తుండటంతో ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ సలహాదారును నియమించింది. వాస్తు నిపుణుడు సుద్దాల సుధాకర్ తేజను రోడ్లు భవనాల శాఖలో ప్రత్యేకంగా సలహాదారుగా నియమించింది. కొంతకాలంగా ఆయన వాస్తుపరమైన విషయాల్లో ముఖ్యమంత్రికి సూచనలు, సలహాలు అందజేస్తున్నారు. వాస్తు సలహాదారుగా నియమించేందుకు సాంకేతిక అంశాలు అడ్డుగా ఉండటంతో ఆయనను ఆర్కిటెక్చర్, ఆర్ అండ్ బీ ప్రణాళిక విభాగం సలహాదారు పేరుతో పోస్టింగ్ ఇచ్చింది. కొద్దిరోజులుగా ఆయన నియామక ఫైలు ఆర్థిక శాఖలో పెండింగ్‌లో ఉంది. సాంకేతిక అంశాలను పరిశీలించిన ఆర్థికశాఖ అధికారులు పలు అభ్యంతరాలు చెప్పటంతో ప్రతిపాదనలో రకరకాల మార్పుచేర్పులు చేసి ఎట్టకేలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఆయన ఈ పోస్టులో ఏడాదిపాటు కొనసాగనున్నారు. ఆయనకు భత్యాతలతో కలుపుకొని నెలకు రూ.75 వేలు చెల్లిస్తారు. ప్రభుత్వ వాహనం, డ్రైవర్, ఫోన్ వసతి కూడా కల్పిస్తారు.