బిల్డింగ్ చూశారుగా.. ఎలా ఉంది? అద్భుతంగా ఉంది అంటున్నారా? ఓకే. నెదర్లాండ్స్‌కు చెందిన ఆర్కిటెక్చర్ సంస్థ ఫండమెంటల్ ఆర్కిటెక్టస్ సిద్ధం చేశారు ఈ బిల్డింగ్ డిజైన్. చూసేందుకు ఓహో అనేలా ఉండటం ఒక్కటే దీని గొప్పదనం కాదు. ఇంకా చాలా ఉన్నాయి. అన్నింటికంటే ముందుగా చెప్పాల్సింది... ఓ నదిపై కట్టే ఈ బిల్డింగ్... ఆ నీటి నుంచే విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవడం!! అదెలా? అన్న ప్రశ్నకు సమాధానం తెలుసుకునేలోపు కజకిస్తాన్‌లోని ఆస్తానాలో ఏర్పాటు కానున్న ఈ బిల్డింగ్ వివరాలు కొన్ని తెలుసుకుందాం. ఈ భవనం ఎత్తు 396 అడుగులు కాగా.. మొత్తం ఎనిమిది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం ఉంటుంది. నివాస భవనాలతోపాటు హోటళ్లు, షాపుల్లాంటివీ ఉంటాయి.
ద టవర్ ఆఫ్ సన్ పేరుతో డిజైన్ చేశారు దీని దిగువన ఉన్న నదిలోని నీటి ప్రవాహాన్ని అడ్డుకుని జనరేటర్ల ద్వారా విద్యుత్తు ఉత్పత్తి చేస్తారు. భవనం కింది భాగంలో నది వెడల్పు తక్కువగా ఉంటుందని మరింత తగ్గించడం ద్వారా ప్రవాహ వేగాన్ని పెంచి ఆ చలన శక్తిని విద్యుత్తుగా మార్చాలన్నది ఫండమెంటల్ ఆర్కిటెక్ట్స్ ప్రణాళిక. దీంతోపాటు భవనంలోని వేడిని బయటకు పంపేందుకు ఓ హీట్‌పంప్‌ను కూడా ఉపయోగిస్తామని, వేసవిలోనూ వేడెక్కకుండా ఉండేలా నైరుతి దిశగా నిర్మాణం ఉంటుందని సంస్థ తెలిపింది. కజకిస్థాన్‌కు చెందిన బీ1 గ్రూప్ నిర్వహించిన ఆర్కిటెక్చర్ పోటీలో ద టవర్ ఆఫ్ సన్ అందరి ప్రశంసలు అందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment