మృత్యుంజయులు ఆ తల్లీబిడ్డ
సాక్షి, హైదరాబాద్: నానక్‌రామ్‌గూడలో ఏడంతస్తుల భవనం పేక మేడలా కుప్పకూలినా ఓ తల్లీకొడుకు మాత్రం మృత్యుంజయులుగా బయటపడ్డారు. అయితే కూలిన భవనానికి ఉత్తరం వైపున మరో భవనం ఉంది. ఆ భవనాన్ని ఆనుకొని శాంతాబాయికి చెందిన భవనం ఉంది. అక్కడ శిథిలాల్లో కొందరు ఉండే అవకాశముందని స్థానికులు అధికారులకు సూచించారు. దీంతో పక్కనున్న భవనాన్ని కొద్ది మేర కూల్చి, సమాంతరంగా గొయ్యి తవ్వారు. డాగ్‌స్క్వాడ్ కూడా అక్కడ ఎవరో ఉన్నట్లుగా సూచించింది. గురువారం అర్ధరాత్రి అనంతరం 2 గంటల సమయంలో మహిళ, చిన్నారి ఏడుపులు వినిపించడంతో.. ఎన్డీఆర్ఎఫ్ బృందం అప్రమత్తమైంది.
చిన్నపాటి రంధ్రం చేయగా రేఖ (25) కనిపించింది. అక్కడే ముగ్గురం ఉన్నామని, తమను త్వరగా కాపాడాలని అర్థించింది. అధికారులు మరో మూడు గంటల పాటు శ్రమించి, మెల్లమెల్లగా శిథిలాలను తొలగించి ఆమెతోపాటు కుమారుడు దీపక్ (3)ను ప్రాణాలతో బయటకు తీశారు. అయితే రేఖ భర్త శివ (30) మాత్రం మృతిచెందాడు. అయితే రేఖ వెన్నెముక, కాలు, మోకాలికి తీవ్రగాయాలుకాగా.. దీపక్ ఎడమ కాలు విరగింది, తలకు గాయాలయ్యాయి. వారిని కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఓవైపు భర్త మరణించడం, కుమారుడు తీవ్రగాయాలపాలై తనతోపాటు ఆస్పత్రిలో ఉండడంతో రేఖ కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. (ప్రధానవార్త: మృత్యుఘోష)