building under construction
-
చిన్నారులను మింగిన ప్రహరీ, గేటు..
సాక్షి, ఒంగోలు క్రైం: ముక్కుపచ్చలారని ముగ్గురు చిన్నారులను ప్రహరీగోడ బలితీసుకుంది. ఒంగోలు నగరం ముంగమూరు రోడ్డు జంక్షన్ సమీపంలోని కొత్తడొంకలో గురువారం ఈ హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. ఒంటిపూట బడులు కావడంతో పాఠశాలనుంచి వచ్చిన చిన్నారులు భోజనం కూడా చేయకుండా ఆటపాటల్లో మునిగిపోయారు. కాలనీలో నూతనంగా ప్రహరీ గోడ, గేటు అమర్చారు. ఈ క్రమంలో గేటు ఎక్కి అటూ, ఇటూ ఊగుతుండగా ఒక్కసారిగా ఇనుప గేటు వదులై నలుగురు చిన్నారులు కిందపడిపోయారు. ఆ తర్వాత గేటు ఊడి వచ్చి వారిపై పడింది. వెంటనే ప్రహరీ గోడ కూడా చిన్నారులపై కుప్పకూలింది. తేరుకున్న పరిసర ప్రాంతాలవారు వచ్చి శిథిలాలు తొలగించేందుకు శ్రమించారు. కానీ అప్పటికే గుడిమెట్ల నవదీప్(6) మృతి చెందాడు. తీవ్రగాయాలపాలైన సింధే ప్రేమ్ చంద్‌తో పాటు బాలుడి అక్క సింధే ప్రేమ్ జ్యోతి, కట్టా మణిలను హుటాహుటిన ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. తీవ్ర గాయాలపాలైన సింధే ప్రేమ్ చంద్(5), కట్టా మణి (7) ఒంగోలు రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రస్తుతం సింధే ప్రేమ్ జ్యోతి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టు మిట్టాడుతోంది. స్కూలు నుంచి వచ్చిన వెంటనే.. గుడిమెట్ల నవదీప్, సింధే ప్రేమ్ జ్యోతి, కట్టా మణి తాలూకా పోలీస్ స్టేషన్ సమీపంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుకుంటున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఇళ్లకు వచ్చారు. వెంటనే ప్రేమ్ చంద్‌తో కలిసి నిర్మాణంలో ఉన్న ప్రహరీ గోడకు చెందిన ఇనుప గేటు ఎక్కి ఊగుతున్నారు. ప్రేమ్ జ్యోతి గేటును ఊపుతుండగా ముగ్గురు గేటుపై ఉన్నారు. వెంటనే గేటు ఊడటం.. ప్రహరీ కూలటం జరిగిపోయాయి. దీంతో కొత్తడొంక కాలనీ అరుపులు, కేకలతో హోరెత్తింది. అంతా కూలి పని చేసుకొనేవారే.. ఒక్కసారిగా ముగ్గురు చిన్నారులను మృత్యువు కబళించటంతో కొత్తడొంక కాలనీ విషాద ఛాయలు అలముకున్నాయి. ఇక్కడంతా కూలి పనులు, చిరు వ్యాపారాలు చేసుకుంటుంటారు. ఈ ఘటనతో మూడు కుటుంబాలకు చెందిన బంధువులు, స్నేహితులు, సన్నిహితులు కన్నీటి పర్యంతమయ్యాయి. ఆ చిన్నారుల మృతదేహాలను చూసిన వారి కళ్లు చెమర్చాయి. మృతి చెందిన చిన్నారులు 1.కట్టామణి, 2.ప్రేమ్‌చంద్, 3.నవదీప్.., 4. చికిత్స పొందుతున్న ప్రేమ్ జ్యోతి ప్రేమ్ చంద్ ఒక్కడే మగసంతానం.. సింధే వెంకటేశ్వర్లు దంపతులకు ప్రేమ్ చంద్ ఒక్కడే మగ సంతానం. మిగతా నలుగురు కుమార్తెలు. నలుగురు అమ్మాయిల తరువాత పుట్టాడు ప్రేమ్ చంద్. దీంతో ఆ కుటుంబాన్ని ఓదార్చటం ఎవరివల్లా కావటంలేదు. తండ్రి వెంకటేశ్వర్లు కుమారుడి మృతదేహాన్ని చూసి సొమ్మసిల్లి పడిపోయాడు. కుమారుడి మృతదేహం ఒకవైపు, వైద్యశాలలో చికిత్స పొందుతున్న కుమార్తె మరో వైపు ఉండటంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. వెంకటేశ్వర్లు సెప్టిక్ ట్యాంకు డ్రైవర్‌గా కుటుంబాన్ని పోషిస్తూ పిల్లలను చదివించుకుంటున్నాడు. కట్టా మణి కూడా ఒక్కడే.. ప్రమాదంలో మృత్యువాత పడిన కట్టా మణి (7)కూడా ఆ కుటుంబానికి ఒక్క మగ సంతానం. వెంకటస్వామి దంపతులకు మణితో పాటు ఒక కుమార్తె కూడా ఉంది. వెంకటస్వామి కుటుంబంతో సహా వంటపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఒక్కగానొక్క కుమారుడు మృత్యువాత పడటంతో ఆ కుటుంబం కన్నీటి పర్యంతమవుతోంది. రెండో తరగతి చదువుతున్న మణి ఇంట్లో ఎంతో చలాకీగా ఉండేవాడు. గుడిమెట్ల నవదీప్ ముగ్గురు సంతానంలో పెద్దవాడు. తండ్రి గుడిమెట్ల వెంకటేశ్వర్లుకు ముగ్గురు మగసంతానం కాగా ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రిమ్స్‌కు వచ్చి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. రిమ్స్‌లో ఉన్న మృతదేహాలను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. చిన్నారులను బలిగొన్న ప్రహరీ, గేటు.. పిల్లల స్కూలు బ్యాగులు, క్యారేజీలు సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ ప్రమాద సమాచారం తెలుసుకున్న ఒంగోలు డీఎస్పీ బి.శ్రీనివాసరావు హుటాహుటిన కొత్తడొంకలోని సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. తాలూకా సీఐ గంగా వెంకటేశ్వర్లు, ఎస్సైలు ఎన్.సి.ప్రసాదు, దాసరి రాజారావు, మేడా శ్రీనివాసరావుతో పాటు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రమాదం సంభవించిన తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు. రిమ్స్ వైద్యులతో మాట్లాడారు. -
ఉలిక్కిపడ్డ చెన్నై
సాక్షి, చెన్నై:రాష్ట్ర రాజధాని చెన్నై శివారులోని పోరూరు మౌళివాక్కంలో శనివారం సాయంత్రం జరిగిన ఘోర దుర్ఘటన ప్రజానీకాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఇంత పెద్ద భవనం కుప్పకూలడమన్నది ఇదే ప్రప్రథమంగా కావచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నా రు. కళ్లెదుటే భారీ భవనం కుప్పకూలుతుండడాన్ని చూసిన మౌలివాక్కం పరిసరాల్లోని నిర్వాసితులు ఒక్కసారిగా ఆందోళనలో పడ్డారు. తమవాళ్లకేమైం దంటే తమవాళ్లకేమైందంటూ జాడ కోసం రోదిస్తూ కొందరు, శిథిలాల కింద తమ వాళ్లు సురక్షితంగా ఉండాలంటూ ప్రార్థనలు చేస్తూ కొందరు గడిపారు. చెన్నై మహానగరం రోజు రోజుకూ విస్తరిస్తూ పోతున్నది. పోరూరు సమీపంలోని మౌళివాక్కం కూడా అదే బాటలో పయనిస్తోంది. శనివారం నాటి సంఘటన ఇందుకు తర్పణం పడుతోంది. రెండేళ్ల వ్యవధిలో రెండు 11 అంత స్తులతో కూడిన రెండు బహుళ భవనాలను ట్రస్టు హైట్స్ సంస్థ నిర్మించేసింది. ఈ భవనంలో గత కొద్ది రోజుల వరకు సుమారు 200 మంది వరకు పని చేస్తూ వచ్చేవారని, ఇప్పుడు ఆ సంఖ్య తగ్గిందంటూ ఓ కార్మికుడు పేర్కొన్నాడు. భవనం కుప్పకూలుతున్న సమయంలో 11వ అంతస్తుడు ఉన్న ఓ యువకుడు అదృష్టం కొద్దీ క్షేమంగా బయటపడ్డాడు. జరిగిన ప్రత్యక్ష ఘటనను అతను మీడియాకు వివరిస్తుంటే ఆ పరిసరవాసులు ఆందోళనకు లోనుకావాల్సి పరిస్థితి. ఉలికిపాటు ప్రశాంతతకు నిలయంగా ఉండే చెన్నై మహానగర వాసులు ఇటీవల కాలంగా ఉలిక్కిపడుతున్నారు. తీవ్రవాదుల హెచ్చరికలు ఓ వైపు, రైలు ప్రమాదాలు మరో వైపు, షావుకారుపేటలో మరో వైపు ప్రజలను భయకంపితులను చేశాయి. తాజాగా బహుళ అంతస్తుల భవనాలంటే ఆమడ దూరం పరుగులు పెట్టే స్థితి ఏర్పడింది. తాజా ఘటన ప్రజలను ఉలిక్కిపడేలా చేయడంతోపాటుగా ఈ పరిణామాలు ఎలాంటి విపత్కర పరిస్థితులను సృష్టిస్తాయోనన్న ఆందోళనను రేకెత్తిస్తోంది. లక్షలు పోసి కొనుక్కున్న ఫ్లాట్లు నాణ్యతా లోపాలతో ఎక్కడ కుప్పకూలుతాయోనన్న భయం నిర్వాసితుల్లో నెలకొంటోంది. ఆర్తనాదాలు మౌళివాక్కంలో శనివారం రాత్రి ఆర్తనాదాలు మిన్నంటాయి. బహుళ అంతస్తుల భవనం కూలిన సమాచారం ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తే మహానగరంలోని కూలీ కార్మికుల్లో వేదనను రగిలించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు కొందరు, ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారు కొందరు ఈ శిబిరాల కింద చిక్కుకున్నారన్న సమాచారం చెన్నైలో కూలిపనులు చేసుకుంటున్న ఆ ప్రాంత వాసుల్ని ఆందోళనలో పడేసింది. తమ ప్రాంతానికి చెందినవారేమైనా ఉన్నారా అని వాకబుచేయడానికి కొందరు పరుగులు తీస్తే, మరి కొందరు సంబంధిత నిర్మాణ సంస్థలో తమ వారు పని చేస్తున్నారని ఆవేదనలో పడ్డారు. తమ వారి జాడ కానరాకపోవడంతో ఆందోళనలో పడ్డవారు, కొందరైతే, కన్నీటి పర్యంతంతో విలపిం చారు. మరి కొందరు తమ వారి జాడ ఎక్కడ అని పరుగులు తీసినా పోలీసులు ఆ ప్రాంతంలోకి అనుమతించలేదు. ముమ్మరంగా పనులు రెస్క్యూ ఆపరేషన్ మొదలు కాగానే, పదవ అంతస్తు కూలిన ప్రదేశం నుంచి వచ్చిన హాహాకారాలతో రెస్క్యూ టీమ్ చాకచక్యంగా వ్యవహరించింది. ఓ వ్యక్తిని సురక్షితంగా అక్కడి నుంచి రక్షించారు. భారీ క్రేన్లు, వెల్డింగ్ మిషన్లు, ఫ్లడ్ లైట్లను హుటాహుటిన ఆ పరిసరాల్లో ఏర్పాటు చేసి ఆపరేషన్‌ను తీవ్రతరం చేశారు. కాంచీపురం జిల్లా కలెక్టర్ భాస్కరన్, రాష్ట్ర మంత్రి చిన్నయ్యలు సంఘటనా స్థలంలోనే తిష్టవేసి రెస్క్యూను పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ నేతృత్వంలో రెండు ప్రత్యేక వైద్య బృందాలు, రామచంద్ర ఆస్పత్రి బృందం ఒకటి సంఘటనా స్థలంలో తిష్ట వేసి క్షతగాత్రులకు అత్యవసర వైద్యం అందించే పనుల్లో నిమగ్నమైంది. ఆరోగ్య శాఖ డెరైక్టర్ గీతాలక్ష్మీ మాట్లాడుతూ వైద్యపరంగా సర్వం సిద్ధం చేశామని వివరించారు. వేగవంతం చేయండి బహుళ అంతస్థుల భవనం కూలిన సమాచారంతో సీఎం జయలలిత అధికారులకు ఆదేశాలిచ్చారు. సేవా కార్యక్రమాలు వేగవంతం చేయాలని సూచిం చారు. గవర్నర్ రోశయ్య దిగ్భ్రాంతి: ప్రమాద ఘటనై గవర్నర్ కొణిజేటి రోశయ్య దిగ్భ్రాం తి వ్యక్తం చేశారు. భవన శిథిలాల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఉండటం బాధాకరమన్నారు. అదుపులోకి నిర్వాహకులు ప్రమాద ఘటనపై అధికారులు విచారణను వేగవంతం చేశారు. ట్రస్టు హైట్స్ సంస్థ నిర్వాహకులు ముత్తు, మనోహరన్‌ను రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ కొనసాగుతోంది. రె వెన్యూ, పోలీసు అధికారులు ప్రధానంగా భవనం నాణ్యత, పరిణామాలపై దర్యాప్తు చేస్తున్నారు.