నవదీప్ మృతదేహం వద్ద కుటుంబ సభ్యుల రోదనలు..
సాక్షి, ఒంగోలు క్రైం: ముక్కుపచ్చలారని ముగ్గురు చిన్నారులను ప్రహరీగోడ బలితీసుకుంది. ఒంగోలు నగరం ముంగమూరు రోడ్డు జంక్షన్ సమీపంలోని కొత్తడొంకలో గురువారం ఈ హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. ఒంటిపూట బడులు కావడంతో పాఠశాలనుంచి వచ్చిన చిన్నారులు భోజనం కూడా చేయకుండా ఆటపాటల్లో మునిగిపోయారు. కాలనీలో నూతనంగా ప్రహరీ గోడ, గేటు అమర్చారు. ఈ క్రమంలో గేటు ఎక్కి అటూ, ఇటూ ఊగుతుండగా ఒక్కసారిగా ఇనుప గేటు వదులై నలుగురు చిన్నారులు కిందపడిపోయారు. ఆ తర్వాత గేటు ఊడి వచ్చి వారిపై పడింది. వెంటనే ప్రహరీ గోడ కూడా చిన్నారులపై కుప్పకూలింది. తేరుకున్న పరిసర ప్రాంతాలవారు వచ్చి శిథిలాలు తొలగించేందుకు శ్రమించారు. కానీ అప్పటికే గుడిమెట్ల నవదీప్(6) మృతి చెందాడు. తీవ్రగాయాలపాలైన సింధే ప్రేమ్ చంద్‌తో పాటు బాలుడి అక్క సింధే ప్రేమ్ జ్యోతి, కట్టా మణిలను హుటాహుటిన ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. తీవ్ర గాయాలపాలైన సింధే ప్రేమ్ చంద్(5), కట్టా మణి (7) ఒంగోలు రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రస్తుతం సింధే ప్రేమ్ జ్యోతి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టు మిట్టాడుతోంది.
స్కూలు నుంచి వచ్చిన వెంటనే..
గుడిమెట్ల నవదీప్, సింధే ప్రేమ్ జ్యోతి, కట్టా మణి తాలూకా పోలీస్ స్టేషన్ సమీపంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుకుంటున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఇళ్లకు వచ్చారు. వెంటనే ప్రేమ్ చంద్‌తో కలిసి నిర్మాణంలో ఉన్న ప్రహరీ గోడకు చెందిన ఇనుప గేటు ఎక్కి ఊగుతున్నారు. ప్రేమ్ జ్యోతి గేటును ఊపుతుండగా ముగ్గురు గేటుపై ఉన్నారు. వెంటనే గేటు ఊడటం.. ప్రహరీ కూలటం జరిగిపోయాయి. దీంతో కొత్తడొంక కాలనీ అరుపులు, కేకలతో హోరెత్తింది.
అంతా కూలి పని చేసుకొనేవారే..
ఒక్కసారిగా ముగ్గురు చిన్నారులను మృత్యువు కబళించటంతో కొత్తడొంక కాలనీ విషాద ఛాయలు అలముకున్నాయి. ఇక్కడంతా కూలి పనులు, చిరు వ్యాపారాలు చేసుకుంటుంటారు. ఈ ఘటనతో మూడు కుటుంబాలకు చెందిన బంధువులు, స్నేహితులు, సన్నిహితులు కన్నీటి పర్యంతమయ్యాయి. ఆ చిన్నారుల మృతదేహాలను చూసిన వారి కళ్లు చెమర్చాయి.
మృతి చెందిన చిన్నారులు 1.కట్టామణి, 2.ప్రేమ్‌చంద్, 3.నవదీప్.., 4. చికిత్స పొందుతున్న ప్రేమ్ జ్యోతి
ప్రేమ్ చంద్ ఒక్కడే మగసంతానం..
సింధే వెంకటేశ్వర్లు దంపతులకు ప్రేమ్ చంద్ ఒక్కడే మగ సంతానం. మిగతా నలుగురు కుమార్తెలు. నలుగురు అమ్మాయిల తరువాత పుట్టాడు ప్రేమ్ చంద్. దీంతో ఆ కుటుంబాన్ని ఓదార్చటం ఎవరివల్లా కావటంలేదు. తండ్రి వెంకటేశ్వర్లు కుమారుడి మృతదేహాన్ని చూసి సొమ్మసిల్లి పడిపోయాడు. కుమారుడి మృతదేహం ఒకవైపు, వైద్యశాలలో చికిత్స పొందుతున్న కుమార్తె మరో వైపు ఉండటంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. వెంకటేశ్వర్లు సెప్టిక్ ట్యాంకు డ్రైవర్‌గా కుటుంబాన్ని పోషిస్తూ పిల్లలను చదివించుకుంటున్నాడు.
కట్టా మణి కూడా ఒక్కడే..
ప్రమాదంలో మృత్యువాత పడిన కట్టా మణి (7)కూడా ఆ కుటుంబానికి ఒక్క మగ సంతానం. వెంకటస్వామి దంపతులకు మణితో పాటు ఒక కుమార్తె కూడా ఉంది. వెంకటస్వామి కుటుంబంతో సహా వంటపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఒక్కగానొక్క కుమారుడు మృత్యువాత పడటంతో ఆ కుటుంబం కన్నీటి పర్యంతమవుతోంది. రెండో తరగతి చదువుతున్న మణి ఇంట్లో ఎంతో చలాకీగా ఉండేవాడు. గుడిమెట్ల నవదీప్ ముగ్గురు సంతానంలో పెద్దవాడు. తండ్రి గుడిమెట్ల వెంకటేశ్వర్లుకు ముగ్గురు మగసంతానం కాగా ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రిమ్స్‌కు వచ్చి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. రిమ్స్‌లో ఉన్న మృతదేహాలను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.
చిన్నారులను బలిగొన్న ప్రహరీ, గేటు.. పిల్లల స్కూలు బ్యాగులు, క్యారేజీలు
సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ
ప్రమాద సమాచారం తెలుసుకున్న ఒంగోలు డీఎస్పీ బి.శ్రీనివాసరావు హుటాహుటిన కొత్తడొంకలోని సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. తాలూకా సీఐ గంగా వెంకటేశ్వర్లు, ఎస్సైలు ఎన్.సి.ప్రసాదు, దాసరి రాజారావు, మేడా శ్రీనివాసరావుతో పాటు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రమాదం సంభవించిన తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు. రిమ్స్ వైద్యులతో మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment