కార్మికుల పొట్టగొట్టడం సరికాదు
బిల్ట్‌పై సమీక్షలో కేంద్ర డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ రవీంద్రనాథ్
మంగపేట : నష్టాల సాకు చూపి కార్మికుల పొట్టగొట్టడం సరికాదని కేంద్ర డిప్యూటీ లేబర్ కమిషనర్ కేవీ.రవీంద్రనాథ్ అన్నారు. జూలై 28న బిల్ట్ జేఏసీ నాయకులు కేంద్ర ఉపాధి కల్పన, కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయను కలిసి కార్మికుల పరిస్థితిపై వినతిపత్రం అందజేశారు. మంత్రి ఆదేశాల మేరకు కర్మాగారాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. బిల్ట్‌లో పరిస్థితిపై ఇక్కడి ఏడీఏం కార్యాలయంలో హెచ్ఆర్డీజీఎం కేశవరెడ్డి, బిల్ట్ జేఏసీ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిల్ట్ యాజమాన్యం కార్మికులకు పద్నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నట్లు గుర్తించామన్నారు. 680 మంది కార్మికులు, సిబ్బందికి రూ.20కోట్ల మేర వేతన బకాయిలు, రూ.1.80కోట్ల పీఎఫ్ బకాయిలు నిలిపివేయగా కార్మికుల కుటుంబాల్లో ఏర్పడిన ఇబ్బందులను కార్మికులను అడిగి తెలుసుకున్నారు. 30 ఏళ్ల పాటు కర్మాగారంలో విషపూరిత వాతావరణంలో పనిచేసి అనారోగ్యానికి గురైన కార్మికులకు నేడు ఫ్యాక్టరీ వైద్య సదుపాయాలు కల్పించకపోవడంతో వారు పడుతున్న ఇబ్బందులను కమిషనర్‌కు కార్మికులు వివరించారు. పీఎఫ్ కార్మిక జేఏసీ నాయకులు సైతం కమిషనర్ ఎదుట తమకు జరిగిన అన్యాయంపై గోడు వెల్లబోసుకున్నారు. అనంతరం బిల్ట్‌లో పరిస్థితి, కార్మికుల దుస్థితిపై కేంద్రమంత్రి దత్రాత్రేయకు నివేదిక అందిస్తానని కమిషనర్ తెలిపారు. బిల్ట్ జేఏసీ నాయకులు పాకనాటి వెంకటరెడ్డి, వడ్డబోయిన శ్రీనివాస్, వడ్లూరి రాంచందర్, రవిమూర్తి, లక్ష్మీనారాయణ, డీవీపీ.రాజు, శర్మ, కార్మికులు పాల్గొన్నారు.