bulding house
-
‘ప్రీలాంచ్’ దందాకు చెక్!
సాక్షి, హైదరాబాద్: ఎవరికైనా సొంతిల్లు లేదా కొంత సొంత స్థలం ఉండాలనేది ఓ కల. కొన్ని నిర్మాణ సంస్థల నిర్వాహకులు, డెవలపర్లు ఈ ఆశలకు గాలం వేస్తున్నారు. చేతిలో డబ్బుల్లేకున్నా, అనుమతులు రాకున్నా ఏదో ఓ ప్రాజెక్టు మొదలుపెడ్తున్నారు. రంగురంగుల డిజైన్లు, పోస్టర్లతో ‘గాల్లో మేడలు’ కడుతున్నారు. కానీ ఏళ్లకేళ్లు గడుస్తున్నా ప్రాజెక్టులు పూర్తిగాకపోవడం, కొన్ని ప్రాజెక్టులైతే మొత్తంగా ఆగిపోవడంతో కొనుగోలుదారులు లబోదిబోమంటున్నారు. ఈ సమస్య నుంచి తప్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైనా రియల్ ఎస్టేట్ వెంచర్లు, అపార్ట్మెంట్లలో ప్లాట్లు/ఫ్లాట్లు విక్రయించాలంటే.. తప్పనిసరిగా స్థానిక మున్సిపల్ అథారిటీల నుంచి అనుమతి తీసుకుని ఉండాలని ఆదేశించింది. అంతా పేపర్ల మీదనే.. గ్రేటర్ హైదరాబాద్ శివార్లతోపాటు పలు జిల్లా కేంద్రాల్లో ప్రీలాంచ్/ప్రీసేల్ పేరిట రియల్ వెంచర్ల దందా సాగుతోంది. వాయిదా పద్ధతిలో భూమిని కొనుగోలు చేస్తున్న కొందరు రియల్టర్లు, బిల్డర్లు.. సదరు భూమికి సొమ్ము చెల్లించడం నుంచి స్థానిక సంస్థల అనుమతులు, రిజిస్ట్రేషన్ దాకా జనం సొమ్ముతోనే పని పూర్తి చేసుకుంటున్నారు. ప్రాజెక్టు పూర్తయ్యే నాటి ధరతో పోలిస్తే 30 శాతం వరకు తక్కువ ధరకే ఫ్లాట్లు ఇస్తామంటూ జనానికి వల వేస్తున్నారు. చాలా వరకు ప్రీలాంచ్, యూడీఎస్ ప్రాజెక్టులన్నీ పేపర్లు, బ్రోచర్ల మీదనే ఉంటున్నాయి. ప్రభుత్వ విభాగాల నుంచి నిర్మాణ అనుమతులుగానీ, రెరాలో నమోదై ఉండటంగానీ తక్కువ. భూమి పూజ కూడా చేయకుండానే.. ప్రాజెక్టు మొదలైపోయినట్టు ప్రచారం ఊదరగొడుతున్నారు. కొద్దిరోజుల్లోనే సొంతిల్లు అందుతుందన్న ఆశలు కల్పిస్తున్నారు. మామూలు రియల్టర్లు, డెవలపర్లే కాకుండా పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు కూడా ఇలాగే వ్యవహరిస్తుండటం గమనార్హం. చాలా వరకు ప్రాజెక్టులు ఏళ్లకేళ్లు సాగుతూనే ఉంటున్నాయి. కొన్ని ప్రాజెక్టులు మధ్యలోనే ఆగిపోతున్నాయి. కొనుగోలుదారులు నష్టపోతున్నారు. ఫిర్యాదులు రావడంతో.. కరోనా పరిస్థితి చక్కబడిన తర్వాత రియల్ బూమ్ మరోసారి ఊపందుకోవడంతో ప్రీలాంచ్/ప్రీసేల్ ఆఫర్లు కూడా పెరిగాయి. హైదరాబాద్ నగర శివార్లలోనే వందల సంఖ్యలో రియల్ ఎస్టేట్ సంస్థలు ముందస్తు విక్రయాలు చేస్తున్నాయి. దీనిపై ఫిర్యాదులు అందడంతో మున్సిపల్ శాఖ దృష్టి పెట్టింది. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, సీడీఎంఏతోపాటు ఇతర జిల్లాల్లోని స్థానిక అథారిటీల నుంచి నివేదిక తెప్పించుకుంది. రెరా, హెచ్ఎండీఏ, జీహచ్ఎంసీ, ఇతర మున్సిపాలిటీల అనుమతులు లేకుండానే వెంచర్లలో ప్లాట్లు, అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు విక్రయిస్తున్నట్లు గుర్తించింది. దీనికి సంబంధించి శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. అనుమతులు లేని ప్రాజెక్టుల్లో కొనుగోళ్లు/బుకింగ్‌లు చేయవద్దని సూచించింది. ఏదైనా ఫ్లాటును, బిల్డప్ ఏరియాను కొనే ముందు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, రెరా అనుమతుల వివరాలను ఆయా కార్యాలయాల్లో పరిశీలించాలని, ఆన్‌లైన్‌లోనూ వివరాలు లభిస్తాయని వెల్లడించింది. రెరా చట్టం ఏం చెపుతోంది? కేంద్ర ప్రభుత్వం రూపొందించిన రియల్ ఎస్టేట్ (నియంత్రణ, అభివృద్ధి) చట్టం–2016 ఆధారంగా.. రాష్ట్రంలో 2017లో రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా)ని ఏర్పాటు చేశారు. రియల్ వెంచర్లు, అపార్ట్మెంట్లలో ప్లాట్లు/ ఫ్లాట్ల అమ్మకాల్లో పారదర్శకత కోసం ఈ అథారిటీ పనిచేస్తుంది. రియల్ఎస్టేట్ సంస్థలు తమ ప్రాజెక్టులను రెరాలో రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి. ఆయా ప్రాజెక్టులు, నిర్మాణాలు నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా అన్న దానిని రెరా పరిశీలించి విక్రయాలకు అనుమతులు ఇస్తుంది. అనుమతుల్లో ఆలస్యం వల్లే..: డెవలపర్లు ప్రీలాంచ్ కింద ఫ్లాట్లు/ప్లాట్లు విక్రయించడానికి కారణం అనుమతులు ఆలస్యంగా రావటమేనని రియల్ఎస్టేట్ సంస్థల ప్రతినిధులు, డెవలపర్లు చెప్తున్నారు. ‘‘మున్సిపల్ అనుమతుల నుంచి మొదలుపెడితే రెవెన్యూ, ఇరిగేషన్, ఎయిర్పోర్ట్ అథారిటీ, ఎన్విరాన్మెంటల్, ఫైర్, పోలీస్.. ఇలా సుమారు 15 ప్రభుత్వ విభాగాల నుంచి నిర్మాణ అనుమతులు తీసుకోవాలి. ఆ తర్వాత రెరా కోసం దరఖాస్తు చేసుకోవాలి. వీటన్నింటి కోసం ఏడాదిన్నరకుపైనే సమయం పడుతోంది. ఈ సమయంలో ప్రాజెక్టు రుణాలపై వడ్డీ, కాంట్రాక్టర్లు, ఉద్యోగుల జీతభత్యాలు, ఆఫీసు నిర్వహణ, ఇతర ఖర్చుల భారం మోయాల్సి వస్తోంది. అదే ప్రీలాంచ్ కింద కొన్ని ఫ్లాట్లను విక్రయిస్తే ముందుగా కొంత సొమ్ము చేతికి అందుతుంది’’ అని ఓ సంస్థ ప్రతినిధి తెలిపారు. మాది గుంటూరు. వృత్తిరీత్యా ముంబైలో ఉంటున్నా. రిటైరయ్యాక హైదరాబాద్‌లో స్థిరపడాలనుకున్నా. 2010 జూలైలో తెల్లాపూర్‌లో అద్భుతమైన ప్రాజెక్టు నిర్మిస్తున్నామంటూ ఓ సంస్థ ఇచ్చిన యాడ్ చూశా. ప్రీలాంచ్లో బుక్ చేస్తే తక్కువ ధరకు వస్తుందనడంతో నమ్మేసి రూ.50 లక్షల విలువైన ఫ్లాట్ కోసం రూ.45 లక్షలు ముందే చెల్లించేశా. ఇప్పటికీ ప్రాజెక్టు నిర్మాణం పూర్తికాలేదు. కట్టిన డబ్బులు వెనక్కి రాలేదు. నాతోపాటు మరో 300 మంది పరిస్థితి ఇదేనని తెలిసింది. -సుధాకర్, బాధితుడు మాది గండిపేట ప్రాంతం. ఐటీ ఉద్యోగిని. మంచి విల్లా కొనాలనుకొని మంచిరేవుల ప్రాంతంలో చూశాం. అప్పటికే అక్కడ బెంగళూరుకు చెందిన కంపెనీ ఓ ప్రాజెక్టును పూర్తి చేసింది. దానికి ఆనుకుని 4 ఎకరాల్లో మరో ప్రాజెక్టును మొదలుపెట్టనున్నట్టు ప్రకటించింది. దానితో చదరపు అడుగుకు రూ.2,800 ధరతో విల్లా బుక్ చేశా. నాలాగే మరో 120 మంది డబ్బులు కట్టారు. ప్రాజెక్టుకు పలు సమస్యల కారణంగా నిర్మాణ అనుమతులు రాలేదు. మేం కట్టిన డబ్బులు అడిగితే డెవలపర్ రేపు మాపు అంటూ తిప్పుతున్నాడు. -జాన్ విన్సెంట్, బాధితుడు రెరా, స్థానిక సంస్థల అనుమతి ఉంటేనే.. స్థానిక సంస్థల నుంచి భవన నిర్మాణ అనుమతులు పొందకుండా, రెరా రిజిస్ట్రేషన్ లేకుండానే.. ప్రీలాంచ్/ప్రీసేల్ ఆఫర్ల పేరిట ఫ్లాట్లను, బిల్టప్ ఏరియాను విక్రయించొద్దని మున్సిపల్ శాఖ స్పష్టం చేసింది. ఆఫర్ల పేరిట పత్రికలు, చానళ్లలో ప్రకటనలు ఇవ్వడం, సోషల్ మీడియాలో ప్రచారం చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు పేర్కొంది. ఒక బిల్డర్ గానీ, నిర్మాణ సంస్థగానీ తాము నిర్మించే భవనానికి అనుమతులన్నీ పొందిన తర్వాతే విక్రయాలు చేపట్టాలని ఆదేశించింది. రెరా రిజిస్ట్రేషన్ లేకుండా నిర్మించే ఫ్లాట్లకు.. స్థానిక సంస్థల నుంచి అనుమతి లేకపోతే కొనుగోలుదారులు నష్టపోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.శామీర్‌పేటలో ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ఐదంతస్తుల్లో నిర్మించే అపార్ట్మెంట్లలో ఫ్లాట్లకు ప్రీసేల్ ఆఫర్ ప్రకటించింది. వెయ్యి చదరపు అడుగుల ఫ్లాట్‌ను ముందస్తుగా బుక్ చేసుకుంటే.. చ.అడుగుకు రూ.5,000గా ఉన్న ధరను రూ.3,500కు తగ్గిస్తామని ప్రకటించింది. మొత్తం సొమ్ములో 25 శాతం చెల్లించి బుక్ చేసుకోవచ్చని పేర్కొంది. సదరు స్థలానికి వెళ్లి చూస్తే.. ఎలాంటి నిర్మాణం మొదలుకాలేదు. రెరా రిజిస్ట్రేషన్, ఇతర అనుమతులు లేకుండానే దందా సాగుతోంది. ఇక్కడే కాదు హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ సహా చాలా చోట్ల ఇదే పరిస్థితి. -
నిజాంపేట్‌లో అపార్ట్మెంట్లకు ఏమైంది!
సాక్షి, హైదరాబాద్: అక్రమ నిర్మాణాలపై అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. సదరు నిర్మాణాలు పూర్తయినా కూడా వాటిని వదిలిపెట్టడం లేదు. ఇటీవల నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కమిషనర్ గోపి ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమంగా నిర్మించిన 103 భవనాలను గుర్తించి సీజ్ చేశారు. గ్రామ పంచాయతీ పరిపాలనలో ఉన్నప్పుడు అనుమతులతో జీ ప్లస్–4 అంతస్తులు నిర్మించారు. నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతినగర్ మూడు గ్రామాలు కలిపి కార్పొరేషన్‌గా గత సంవత్సరం ఏర్పాటైంది. అంతకు ముందు వచ్చే నుంచే విచ్చలవిడిగా నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల కమిషనర్ అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపడంతో యజమానులు, కాంట్రాక్టర్లలో తీవ్ర ఆందోళన నెలకొంది. కార్పొరేషన్ ఏర్పడిన నాటి నుంచి బిల్డర్లు నిర్మాణాల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఇక్కడ కమిషనర్‌గా పనిచేసిన ముకుందరెడ్డి గత ఏడాది నవంబరు 1న అక్రమ నిర్మాణాల రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని సబ్ రిజిస్ట్రార్‌కు లేఖ రాశారు. ఈ ఏడాది మే 16న ప్రస్తుత కమిషనర్ గోపి సుమారు 1000కి పైగా అక్రమ నిర్మాణాలను రిజిస్ట్రేషన్ చేయొద్దంటూ లేఖ రాశారు. కరోనా ప్రభావం, ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పేరుతో రిజిస్ట్రేషన్ నిలిపివేయడం పనులు నిలిచాయి. యథాతథంగా పనుల నిర్వహణ.. కార్పొరేషన్ అధికారులు ఇటీవల సీజ్ చేసిన భవనాల్లో యథాతథంగా పనులు కొనసాగుతున్నాయి. సీజ్ చేసిన తర్వాత అధికారులు తమ పని పూర్తయినట్లుగా వ్యవహరిస్తుండటంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపడుతున్నారు. పనులు జరుగుతున్న విషయం తెలిసినా అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నారు. ప్రాథమిక దశలోనే నిర్మాణాలను అడ్డుకుంటే ఎవరికీ నష్టం జరగదని, నిర్మాణం పూర్తయిన తర్వాత సీజ్ చేస్తే ఎలా అని పలువురు ఆరోపిస్తున్నారు. ఏమాత్రం ఉపేక్షించం.. సీజ్ చేసిన అక్రమ భవన నిర్మాణదారులకు నోటీసులు జారీ చేశాం. అనుమతులకు సంబంధించిన పత్రాలను తమకు ఇవ్వాలని కోరాం. అన్నీ పరిశీలించిన తర్వాతే అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపడితే ఉపేక్షించేది లేదు. ఇప్పటికే 103 భవనాలను సీజ్ చేశాం. – గోపి, కమిషనర్, నిజాంపేట్ కార్పొరేషన్ -
పక్కా భవనాల నిర్మాణమెప్పుడో..?
కొడిమ్యాల: 500 జనాభా ఉన్న గ్రామాలు, గిరిజన తండాలను రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. ఇక తమ సమస్యలన్నీ స్థానికంగానే పరిష్కరించుకోవచ్చని నూతన గ్రామ పంచాయతీల పరిధిలోని ప్రజలు సంతోషించారు. ఐతే వారి ఆశలు నిజం కావడానికి మరింత సమయం పట్టేలా ఉంది. నూతన పంచాయతీలు 21 కొడిమ్యాల మండలంలో హిమ్మత్‌రావుపేట, శనివారంపేట, దమ్మయ్యపేట, చింతలపల్లి, గంగారాంతండా, అప్పారావుపేట, కొండాపూర్, తుర్కకాశీనగర్ గ్రామాలు, గంగాధర మండలంలో చిన్న ఆకంపెల్లి, ఇస్లాంపూర్, మంగపేట, చెర్లపల్లి, లింగంపల్లి, నర్సింహులపల్లి, మధురానగర్, ముప్పిడిపల్లి, వెంకంపల్లి, మల్యాల మండలంలో గొర్రెగుండం, గుడిపేట గ్రామాలు, రామడుగు మండలంలో పందికుంటపల్లి, చొప్పదండి మండలంలో సాంబయ్యపల్లి గ్రామం కొత్త పంచాయతీలుగా ఏర్పడ్డాయి. అద్దె భవనాల్లోనే పాలన పాలనాధికారాల వికేంద్రీకరణతో అభివృద్ధి వేగవంతం కానుందని ఆనందపడ్డారు. ఐతే కొత్తగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీలకు పక్కా భవనాలు లేకపోవడంతో పరిపాలనా నిర్వహణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పలు గ్రామాల్లో కుల సంఘ భవనాలు, పాఠశాలల్లోని అదనపు గదులు, నిరుపయోగంగా ఉన్న పాత ప్రభుత్వ భవనాలను గ్రామ పంచాయతీ కార్యాలయాలుగా ఉపయోగించుకుంటున్నారు. అధిక గ్రామాల్లో అద్దె భవనాలనే పంచాయతీలకు పరిపాలనా భవనాలుగా ఉపయోగిస్తున్నారు. కొత్త జీపీల నిర్వహణకు నిధుల లేమి కారణంగా అద్దె భవనాలకు అద్దె కూడా చెల్లించలేని స్థితిలో గ్రామ పంచాయతీలున్నాయి. కానరాని కారోబార్లు.. కార్మికులు నూతన గ్రామ పంచాయతీల్లో ఇప్పటివరకు కారోబార్లు, పారిశుధ్య కార్మికులు, వాటర్ పంప్మెన్లు, ఎలక్ట్రీషియన్లను నియమించలేదు. నిధులు లేకపోవడంతో తాత్కాలికంగా పని చేసేవారిని నియమించుకోలేకపోతున్నారు. దీంతో ఆయా పంచాయతీల్లోని ప్రజలు అరకొర వసతులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పారిశుధ్య కార్మికులు లేక గ్రామాల్లో చెత్త పేరుకుపోతోంది. కొన్ని గ్రామాల్లో సర్పంచ్‌లు వారి డబ్బులతోనే పనులు చేపడుతున్నారు. నిధులు మంజూరయ్యే దాకా కొత్త పాలకవర్గాలు ఏమీ చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. కార్యదర్శుల నియామకంలో ఆలస్యం పంచాయతీ కార్యదర్శుల రాత పరీక్ష నిర్వహించి నెలలు గడుస్తున్నా.. ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవడంతో గ్రామాల్లో పాలన గాడి తప్పుతోంది. ప్రస్తుతమున్న కార్యదర్శులను నాలుగు నుంచి ఐదు గ్రామాలకు ఇన్‌చార్జీలుగా నియమించారు. దీంతో ఏ ఒక్క గ్రామానికి సరైన సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. ఏ ఒక్క గ్రామ పంచాయతీకి వారంలో రెండు రోజుల సమయాన్ని కూడా కేటాయించలేకపోతున్నారు. ప్రజలు వివిధ రకాల ధ్రువపత్రాలు పొందడంలో ఆలస్యమవుతోంది. పన్నుల వసూళ్ల లక్ష్యం నెరవేరడం లేదు. గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీటి సరఫరాలో అవాంతరాలు ఏర్పడుతున్నాయి. కోర్టు సమస్యలు త్వరలోనే పరిష్కరించబడతాయని, కార్యదర్శుల నియామకాలు చేపడతామని అధికారులు పేర్కొంటున్నారు. కలెక్టర్‌కు వినతి నూతన గ్రామ పంచాయతీలకు పక్కా భవనాలు నిర్మించాలని కోరుతూ కొడిమ్యాల మండలంలోని 21 గ్రామాల సర్పంచ్‌లు జగిత్యాల జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు. గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాలకు నిధులు మంజూరయ్యేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్‌కు వారు విన్నవించారు. జేబులో నుంచే.. ఇప్పటివరకు మా తండాకు ఎలాంటి నిధులు మంజూరు కాలేదు. కొత్త గ్రామ పంచాయతీలకు త్వరలోనే నిధులు మంజూరు చేస్తామని అధికారులు చెబుతున్నారు. తండాలో పారిశుధ్యం, రోజూవారీ ఇతర పనుల నిర్వహణకు ప్రస్తుతానికి జేబులో నుంచే ఖర్చు చేస్తున్నా. – భూక్యా భోజ్యనాయక్, సర్పంచ్, గంగారాంతండా నిధులు మంజూరు చేయాలి కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలి. ముందుగా గ్రామ పంచాయతీ భవనాలకు నిధులందించాలి. తర్వాత ఇతర పనులపై దృష్టి సారించాలి. నిధులు లేక ఏ పని చేపట్టలేకపోతున్నాం. – గరిగంటి మల్లేశం, సర్పంచ్, అప్పారావుపేట -
ఇల్లు కట్టాలంటే చెట్లు నాటాల్సిందే..
సాక్షి, సిటీబ్యూరో: కొత్తగా నిర్మించే ఇళ్లు, వాణిజ్య సముదాయాలు, పరిశ్రమల్లో తప్పనిసరిగా చెట్లను పెంచాల్సిందే. లేని పక్షంలో జీహెచ్ఎంసీ యంత్రాంగం స్వయంగా రంగంలోకి దిగి మొక్కలు నాటి అందుకైన ఖర్చులను ఆస్తి పన్ను బకాయిల కింద వసూలు చేయనుంది. భవన నిర్మాణ అనుమతుల జారీకి చెట్ల పెంపకాన్ని తప్పనిసరి చేస్తూ ఈ నెల 1న రాష్ట్ర పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేయగా, శుక్రవారం జీహెచ్ఎంసీ వీటిని విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నగర, పట్టణ ప్రాంతాలు, పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో భవన నిర్మాణ అనుమతుల కోసం చెట్ల పెంపకం తప్పనిసరి చేశారు. అయితే, జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రమే చెట్లు పెంచని ఇళ్లు, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాల్లో ప్రభుత్వ యంత్రాంగం చెట్లను నాటి అందుకైన ఖర్చులను యజమానుల నుంచి ఆస్తి పన్ను బకాయిల కింద వసూలు చేయనుంది. చెట్లు పెంచకపోతే జీహెచ్ఎంసీతో పాటు ఇతర నగర, పురపాలికలు సంబందిత భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్లను జారీ చేయకూడదని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్లాట్ విస్తీర్ణం ఆధారంగా నివాస గృహాలు, వాణిజ్య సముదాయాల్లో ఉండాల్సిన కనీస చెట్ల సంఖ్యను ప్రభుత్వం ఖరారు చేసింది. నివాస గృహాల స్థల విస్తీర్ణం100 చదరపు మీటర్లకు మించిన ప్రతి ఇంట్లో చెట్ల పెంపకాన్ని తప్పనిసరిగా మారింది. 100–200 చదరపు మీటర్ల విస్తీర్ణంలో గల నివాస గృహాల్లో కనీసం 5 చిన్న, మధ్యతరహా రకం చెట్లను పెంచాల్సి ఉంటుంది. పీసీబీ మార్గదర్శకాల ప్రకారం పారిశ్రామిక ప్రాంతాల్లో సైతం నిర్ణీత సంఖ్యలో చెట్లను పెంచాలని కోరింది. స్థల విస్తీర్ణం ఆధారంగా ఇళ్లు, వాణిజ్య సముదాయాల్లో ఉండాల్సిన చెట్ల సంఖ్యను ఈ కింది పట్టికల్లో చూడవచ్చు...