సాక్షి, హైదరాబాద్: ఎవరికైనా సొంతిల్లు లేదా కొంత సొంత స్థలం ఉండాలనేది ఓ కల. కొన్ని నిర్మాణ సంస్థల నిర్వాహకులు, డెవలపర్లు ఈ ఆశలకు గాలం వేస్తున్నారు. చేతిలో డబ్బుల్లేకున్నా, అనుమతులు రాకున్నా ఏదో ఓ ప్రాజెక్టు మొదలుపెడ్తున్నారు. రంగురంగుల డిజైన్లు, పోస్టర్లతో ‘గాల్లో మేడలు’ కడుతున్నారు.
కానీ ఏళ్లకేళ్లు గడుస్తున్నా ప్రాజెక్టులు పూర్తిగాకపోవడం, కొన్ని ప్రాజెక్టులైతే మొత్తంగా ఆగిపోవడంతో కొనుగోలుదారులు లబోదిబోమంటున్నారు. ఈ సమస్య నుంచి తప్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైనా రియల్ ఎస్టేట్ వెంచర్లు, అపార్ట్‌మెంట్లలో ప్లాట్లు/ఫ్లాట్లు విక్రయించాలంటే.. తప్పనిసరిగా స్థానిక మున్సిపల్ అథారిటీల నుంచి అనుమతి తీసుకుని ఉండాలని ఆదేశించింది.
అంతా పేపర్ల మీదనే..
గ్రేటర్ హైదరాబాద్ శివార్లతోపాటు పలు జిల్లా కేంద్రాల్లో ప్రీలాంచ్/ప్రీసేల్ పేరిట రియల్ వెంచర్ల దందా సాగుతోంది. వాయిదా పద్ధతిలో భూమిని కొనుగోలు చేస్తున్న కొందరు రియల్టర్లు, బిల్డర్లు.. సదరు భూమికి సొమ్ము చెల్లించడం నుంచి స్థానిక సంస్థల అనుమతులు, రిజిస్ట్రేషన్ దాకా జనం సొమ్ముతోనే పని పూర్తి చేసుకుంటున్నారు. ప్రాజెక్టు పూర్తయ్యే నాటి ధరతో పోలిస్తే 30 శాతం వరకు తక్కువ ధరకే ఫ్లాట్లు ఇస్తామంటూ జనానికి వల వేస్తున్నారు. చాలా వరకు ప్రీలాంచ్, యూడీఎస్ ప్రాజెక్టులన్నీ పేపర్లు, బ్రోచర్ల మీదనే ఉంటున్నాయి.
ప్రభుత్వ విభాగాల నుంచి నిర్మాణ అనుమతులుగానీ, రెరాలో నమోదై ఉండటంగానీ తక్కువ. భూమి పూజ కూడా చేయకుండానే.. ప్రాజెక్టు మొదలైపోయినట్టు ప్రచారం ఊదరగొడుతున్నారు. కొద్దిరోజుల్లోనే సొంతిల్లు అందుతుందన్న ఆశలు కల్పిస్తున్నారు. మామూలు రియల్టర్లు, డెవలపర్లే కాకుండా పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు కూడా ఇలాగే వ్యవహరిస్తుండటం గమనార్హం. చాలా వరకు ప్రాజెక్టులు ఏళ్లకేళ్లు సాగుతూనే ఉంటున్నాయి. కొన్ని ప్రాజెక్టులు మధ్యలోనే ఆగిపోతున్నాయి. కొనుగోలుదారులు నష్టపోతున్నారు.
ఫిర్యాదులు రావడంతో..
కరోనా పరిస్థితి చక్కబడిన తర్వాత రియల్ బూమ్ మరోసారి ఊపందుకోవడంతో ప్రీలాంచ్/ప్రీసేల్ ఆఫర్లు కూడా పెరిగాయి. హైదరాబాద్ నగర శివార్లలోనే వందల సంఖ్యలో రియల్ ఎస్టేట్ సంస్థలు ముందస్తు విక్రయాలు చేస్తున్నాయి. దీనిపై ఫిర్యాదులు అందడంతో మున్సిపల్ శాఖ దృష్టి పెట్టింది. హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, సీడీఎంఏతోపాటు ఇతర జిల్లాల్లోని స్థానిక అథారిటీల నుంచి నివేదిక తెప్పించుకుంది.
రెరా, హెచ్‌ఎండీఏ, జీహచ్‌ఎంసీ, ఇతర మున్సిపాలిటీల అనుమతులు లేకుండానే వెంచర్లలో ప్లాట్లు, అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు విక్రయిస్తున్నట్లు గుర్తించింది. దీనికి సంబంధించి శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. అనుమతులు లేని ప్రాజెక్టుల్లో కొనుగోళ్లు/బుకింగ్‌లు చేయవద్దని సూచించింది. ఏదైనా ఫ్లాటును, బిల్డప్ ఏరియాను కొనే ముందు జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, రెరా అనుమతుల వివరాలను ఆయా కార్యాలయాల్లో పరిశీలించాలని, ఆన్‌లైన్‌లోనూ వివరాలు లభిస్తాయని వెల్లడించింది.
రెరా చట్టం ఏం చెపుతోంది?
కేంద్ర ప్రభుత్వం రూపొందించిన రియల్ ఎస్టేట్ (నియంత్రణ, అభివృద్ధి) చట్టం–2016 ఆధారంగా.. రాష్ట్రంలో 2017లో రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా)ని ఏర్పాటు చేశారు. రియల్ వెంచర్లు, అపార్ట్‌మెంట్లలో ప్లాట్లు/ ఫ్లాట్ల అమ్మకాల్లో పారదర్శకత కోసం ఈ అథారిటీ పనిచేస్తుంది. రియల్‌ఎస్టేట్ సంస్థలు తమ ప్రాజెక్టులను రెరాలో రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి. ఆయా ప్రాజెక్టులు, నిర్మాణాలు నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా అన్న దానిని రెరా పరిశీలించి విక్రయాలకు అనుమతులు ఇస్తుంది.
అనుమతుల్లో ఆలస్యం వల్లే..: డెవలపర్లు
ప్రీలాంచ్ కింద ఫ్లాట్లు/ప్లాట్లు విక్రయించడానికి కారణం అనుమతులు ఆలస్యంగా రావటమేనని రియల్‌ఎస్టేట్ సంస్థల ప్రతినిధులు, డెవలపర్లు చెప్తున్నారు. ‘‘మున్సిపల్ అనుమతుల నుంచి మొదలుపెడితే రెవెన్యూ, ఇరిగేషన్, ఎయిర్‌పోర్ట్ అథారిటీ, ఎన్విరాన్‌మెంటల్, ఫైర్, పోలీస్.. ఇలా సుమారు 15 ప్రభుత్వ విభాగాల నుంచి నిర్మాణ అనుమతులు తీసుకోవాలి. ఆ తర్వాత రెరా కోసం దరఖాస్తు చేసుకోవాలి. వీటన్నింటి కోసం ఏడాదిన్నరకుపైనే సమయం పడుతోంది. ఈ సమయంలో ప్రాజెక్టు రుణాలపై వడ్డీ, కాంట్రాక్టర్లు, ఉద్యోగుల జీతభత్యాలు, ఆఫీసు నిర్వహణ, ఇతర ఖర్చుల భారం మోయాల్సి వస్తోంది. అదే ప్రీలాంచ్ కింద కొన్ని ఫ్లాట్లను విక్రయిస్తే ముందుగా కొంత సొమ్ము చేతికి అందుతుంది’’ అని ఓ సంస్థ ప్రతినిధి తెలిపారు.
మాది గుంటూరు. వృత్తిరీత్యా ముంబైలో ఉంటున్నా. రిటైరయ్యాక హైదరాబాద్‌లో స్థిరపడాలనుకున్నా. 2010 జూలైలో తెల్లాపూర్‌లో అద్భుతమైన ప్రాజెక్టు నిర్మిస్తున్నామంటూ ఓ సంస్థ ఇచ్చిన యాడ్ చూశా. ప్రీలాంచ్‌లో బుక్ చేస్తే తక్కువ ధరకు వస్తుందనడంతో నమ్మేసి రూ.50 లక్షల విలువైన ఫ్లాట్ కోసం రూ.45 లక్షలు ముందే చెల్లించేశా. ఇప్పటికీ ప్రాజెక్టు నిర్మాణం పూర్తికాలేదు. కట్టిన డబ్బులు వెనక్కి రాలేదు. నాతోపాటు మరో 300 మంది పరిస్థితి ఇదేనని తెలిసింది. -సుధాకర్, బాధితుడు
మాది గండిపేట ప్రాంతం. ఐటీ ఉద్యోగిని. మంచి విల్లా కొనాలనుకొని మంచిరేవుల ప్రాంతంలో చూశాం. అప్పటికే అక్కడ బెంగళూరుకు చెందిన కంపెనీ ఓ ప్రాజెక్టును పూర్తి చేసింది. దానికి ఆనుకుని 4 ఎకరాల్లో మరో ప్రాజెక్టును మొదలుపెట్టనున్నట్టు ప్రకటించింది. దానితో చదరపు అడుగుకు రూ.2,800 ధరతో విల్లా బుక్ చేశా. నాలాగే మరో 120 మంది డబ్బులు కట్టారు. ప్రాజెక్టుకు పలు సమస్యల కారణంగా నిర్మాణ అనుమతులు రాలేదు. మేం కట్టిన డబ్బులు అడిగితే డెవలపర్ రేపు మాపు అంటూ తిప్పుతున్నాడు. -జాన్ విన్సెంట్, బాధితుడు
రెరా, స్థానిక సంస్థల అనుమతి ఉంటేనే..
స్థానిక సంస్థల నుంచి భవన నిర్మాణ అనుమతులు పొందకుండా, రెరా రిజిస్ట్రేషన్ లేకుండానే.. ప్రీలాంచ్/ప్రీసేల్ ఆఫర్ల పేరిట ఫ్లాట్లను, బిల్టప్ ఏరియాను విక్రయించొద్దని మున్సిపల్ శాఖ స్పష్టం చేసింది. ఆఫర్ల పేరిట పత్రికలు, చానళ్లలో ప్రకటనలు ఇవ్వడం, సోషల్ మీడియాలో ప్రచారం చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు పేర్కొంది. ఒక బిల్డర్ గానీ, నిర్మాణ సంస్థగానీ తాము నిర్మించే భవనానికి అనుమతులన్నీ పొందిన తర్వాతే విక్రయాలు చేపట్టాలని ఆదేశించింది.
రెరా రిజిస్ట్రేషన్ లేకుండా నిర్మించే ఫ్లాట్లకు.. స్థానిక సంస్థల నుంచి అనుమతి లేకపోతే కొనుగోలుదారులు నష్టపోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.శామీర్‌పేటలో ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ఐదంతస్తుల్లో నిర్మించే అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లకు ప్రీసేల్ ఆఫర్ ప్రకటించింది. వెయ్యి చదరపు అడుగుల ఫ్లాట్‌ను ముందస్తుగా బుక్ చేసుకుంటే.. చ.అడుగుకు రూ.5,000గా ఉన్న ధరను రూ.3,500కు తగ్గిస్తామని ప్రకటించింది.
మొత్తం సొమ్ములో 25 శాతం చెల్లించి బుక్ చేసుకోవచ్చని పేర్కొంది. సదరు స్థలానికి వెళ్లి చూస్తే.. ఎలాంటి నిర్మాణం మొదలుకాలేదు. రెరా రిజిస్ట్రేషన్, ఇతర అనుమతులు లేకుండానే దందా సాగుతోంది. ఇక్కడే కాదు హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ సహా చాలా చోట్ల ఇదే పరిస్థితి.
Comments
Please login to add a commentAdd a comment