Bulk Drug
-
హైదరాబాద్‌లో ఐటీ బూమ్.. నూతన పాలసీతో జోష్
సాక్షి, హైదరాబాద్: హైటెక్‌సిటీగా పేరొందిన గ్రేటర్ హైదరాబాద్ నగరంలో కొలువుల కల్పనలో ఐటీ రంగం అగ్రభాగాన నిలిచింది. ఐటీ, బీపీఓ, కేపీఓ రంగాలకు కొంగు బంగారంగా నిలిచిన మహానగరం ఏటా ఫ్రెష్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు, నైపుణ్యం గల పట్టభద్రులకు నూతన కొలువులు సృష్టించడంలో ముందున్నట్లు.. టీంలీజ్ సంస్థ పలు మెట్రో నగరాలపై వివిధ రంగాలపై జరిపిన తాజా అధ్యయనంలో తేలింది. ► ప్రధానంగా ఐటీ, అనుంబంధరంగాల్లో సుమారు 31 శాతం ఉద్యోగాల కల్పన జరుగుతున్నట్లు అంచనా వేసింది. ► ఇక దేశంలో బల్క్‌డ్రగ్ క్యాపిటల్‌గా పేరొందిన మన నగరంలో రెండోస్థానంలో నిలిచిన ఫార్మారంగంలో సుమారు 25 శాతం కొలువుల సృష్టి జరుగుతోందట. ► ఇక మూడోస్థానంలో ఉన్న టెలీ కమ్యూనికేషన్స్రంగంలో 23 శాతం, తయారీ రంగం 21 శాతం ఉద్యోగాలు కల్పిస్తున్నాయని ఈ అధ్యయనం పేర్కొంది. బల్క్‌డ్రగ్ రంగంలోనూ... మహానగరాన్ని ఆనుకొని సుమారు వెయ్యికి పైగా బల్క్‌డ్రగ్, ఫార్మా, ఇంటర్మీడియెట్ కంపెనీలున్నాయి. ఇక్కడి నుంచి దేశ,విదేశాలకు ప్రాణాధార ఔషధాలు, వ్యాక్సీన్లు ఎగుమతి అవుతున్నాయి. ఏటా బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఈ రంగం ఆర్జిస్తోంది. నూతన ఔషధాలపై పరిశోధన, కొత్త మందుల సృష్టి,ఎగుమతుల విషయంలో ఖండాతరాల్లో గ్రేటర్ హైదరాబాద్ పేరు మార్మోగుతూనే ఉంది. ఈ రంగంలోనూ ఏటా సుమారు 25 శాతం నూతన ఉద్యోగాల సృష్టి జరుగుతోందని తాజా అధ్యయనం అంచనా వేయడం విశేషం. ప్రధానంగా సైన్స్ గ్రాడ్యుయేట్లతోపాటు పది,ఇంటర్ చదివిన వారికి హెల్పర్లు,నైపుణ్య కార్మికులకు ఈ రంగం భారీగా ఉపాధి కల్పిస్తుండడం విశేషం. నూతన పాలసీతో జోష్ రాష్ట్ర సర్కారు ఐటీ, హార్డ్‌వేర్ రంగాలను మరింత ప్రోత్సహించేందుకు ప్రవేశపెట్టిన నూతన ఐటీ పాలసీ రాకతో ఈ రంగాలు జెట్స్పీడ్తో దూసుకుపోనున్నాయి. రాబోయే ఐదేళ్లలో నూతనంగా మరో నాలుగు లక్షల కొలువుల సృష్టితో పాటు.. ఏటా ఐటీ ఎగుమతులు మూడు లక్షల కోట్ల మార్కును అధిగమించే అవకాశాలున్నట్లు ఐటీ రంగ నిపుణులు అంచనా వేస్తుండడం విశేషం. తాజాగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ 2021–26 మధ్య కాలానికి ప్రకటించిన నూతన పాలసీతో ఐటీ భూమ్ మరింత పెరిగే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో సుమారు 1500 వరకు ఉన్న చిన్న,పెద్ద, కార్పొరేట్ కంపెనీల్లో సుమారు 6.25 లక్షల మంది ఉపాధి పొందుతున్న విషయం విదితమే. గ్రేటర్ పరిధిలో 2014 నుంచి ఐటీ భూమ్ క్రమంగా పెరుగుతోంది. విశ్వవ్యాప్తంగా పేరొందిన దిగ్గజ ఐటీ, బీపీఓ, హార్డ్‌వేర్, కేపీఓ సంస్థలు వెల్లువలా సిటీకి తరలివస్తున్న విషయం విదితమే. (చదవండి: ఏటా మూడు లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు.. 10 లక్షల ఉద్యోగాలు) -
సత్తా చూసి ఎంపిక చేయండి
సాక్షి, హైదరాబాద్: బల్క్‌డ్రగ్స్ పార్కుల ఏర్పాటు విషయంలో కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలపై రాష్ట్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పార్కు ల ఏర్పాటులో కేవలం భూముల ధరలనే కాకుండా ఆయా రాష్ట్రాల్లో ఔషధాల రంగంలో ఉన్న మౌలిక వసతులు, అనువైన వాతావరణాన్ని కూడా లెక్కలోకి తీసుకోవాలని కోరుతోంది. బల్క్‌డ్రగ్స్ తయారీలో అత్యంత కీలకమైన యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్స్ (ఏపీఐ), ఇతర కీలక ముడి పదార్థాలను దేశీయంగా ఉత్పత్తి చేసేందుకు మూడు కొత్త బల్క్ డ్రగ్స్ పార్కులను(బీడీపీ) ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ పార్కులను ఎక్కడ ఏర్పాటు చేయాలో సూచించాలని కేంద్ర ఎరువులు, రసాయనాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఫార్మాస్యూటికల్స్ విభాగానికి(డీఓపీ) కేంద్రం బాధ్యత అప్పగిం చింది. ఈ ఏడాది మార్చిలో జరిగిన కేబినెట్ సమావేశంలో కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూలై 27న బీడీపీల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేస్తూ, ఆసక్తి కలి గిన రాష్ట్రాలు దరఖాస్తు చేసుకోవాలని సూచిం చింది. బీడీపీల ఏర్పాటుకు ఆసక్తి చూపే రాష్ట్రాల ఎంపికకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా కేంద్రం విడుదల చేసింది. కేంద్ర పథకంలో భాగంగా ఒక్కో బీడీపీకి గరిష్టంగా రూ.వెయ్యి కోట్ల గ్రాంట్ ఇన్ ఎయిడ్‌తో పాటు 75 శాతం మేర ఆర్థిక సాయాన్ని అందజేస్తుంది. అలాగే ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించింది. బీడీపీల ఏర్పాటుకు ఆసక్తి చూపే రాష్ట్రాలు అక్టోబర్ 15వ తేదీలోగా తమ ప్రతిపాదనలు అందజేసేందుకు డీఓపీ తుది గడువు విధిం చింది. దీంతో తెలంగాణ, ఏపీ, గుజరాత్, తమిళనాడు, పంజాబ్ ఆసక్తి చూపుతూ ప్రతిపాదనలు అందజేశాయి. మార్గదర్శకాలపై అభ్యంతరం బీడీపీలకు అవసరమైన భూమి ధరలు, విద్యుత్ రాయితీలు, ఇతర ప్రోత్సాహకాల వివరాలు సమర్పిస్తే, చాలెంజ్ మోడ్‌లో అర్హత కలిగిన రాష్ట్రాలను ఎంపిక చేస్తామని డీఓపీ ప్రకటించింది. ప్రాజెక్టు మేనేజ్మెంట్ ఏజెన్సీ.. రాష్ట్రాలు అందజేసే ప్రతిపాదనలను మదింపు చేసిన తర్వాత, ఏజెన్సీ చేసే సిఫారసు మేరకు ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలో నిర్ణయిస్తామని వెల్లడించింది. కాగా, కనీసం ఒక్క బీడీపీని అయినా సాధించాలనే పట్టుదలతో ఉన్న తెలంగాణ, బీడీపీల ఎంపిక కోసం రూపొందించిన మార్గదర్శకాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కేవలం భూమి ధరలు, రాయితీలు, ప్రోత్సాహకాలే కాకుండా ఇతర అంశాలు కూడా ఫార్మాపరిశ్రమ అభివృద్ధికి దోహదం చేస్తాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇటీవల కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి సదానంద గౌడకు లేఖ రాశారు. బీడీపీల ఏర్పాటులో ప్రణాళిక, పర్యావరణ అనుమతులు వంటి అంశాలను కూడా ఎంపిక సమయంలో పరిగణనలోకి తీసుకోవాలని, ఈ విషయంలో ఆయా రాష్ట్రాల శక్తిసామర్థ్యాలను లెక్కలోకి తీసుకోవాలని తెలంగాణ కోరుతోంది. అలాగే ఏపీఐ, ఇతర కీలక ముడి పదార్థాల తయారీకి రాష్ట్రంలో ఉన్న అనువైన వాతావరణాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరింది. ప్రధాననగరాలకు దూరంగా 3 వందల కిలోమీటర్ల దూరంలో ఉండే ప్రాంతాల్లో భూమి ధరలు సహజంగానే తక్కువగా ఉంటాయనేది రాష్ట్రం వాదన. ఇలాంటి చోటకు నైపుణ్యం కలిగిన వారిని రప్పించడం, ఉద్యోగుల రవాణా, నివాసం తదితరాలు ఇబ్బందికరంగా ఉంటాయని, అలాగే అంతర్జాతీయ పెట్టుబడులు రావడం కష్టమని కేంద్ర మంత్రికి రాసినలేఖలో కేటీఆర్ పేర్కొన్నారు. చైనా కీలకం.. భారత బల్క్‌డ్రగ్స్ తయారీ, ఎగుమతి రంగంలో తెలంగాణ కేంద్ర బిందువుగా ఉంది. బల్క్‌డ్రగ్స్ తయారీలో కీలకమైన యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్లు (ఏపీఐ), ముడి పదార్థాల కోసం చైనాపై ఆధారపడాల్సి వస్తోంది. వివిధ కారణాలతో ఏపీఐల రవాణాలో అంతరాయం ఏర్పడుతుండగా, కోవిడ్ నేపథ్యంలో ఏపీఐ, ఇతర కీలక ముడి పదార్థాల ధరలు 20 శాతం మేర పెరిగాయి. ఉత్పత్తి, రవాణా వ్యయం పెరగడంతో పాటు లాభాలపై ఏపీఐ దిగుమతులు ప్రభావం చూపుతున్నాయి. -
సూపర్ బగ్ కలకలం!
⇒గ్రేటర్లో ‘మొండి బ్యాక్టీరియా’ వ్యాప్తి ⇒మూసీ సహా పారిశ్రామిక వాడల్లోని పలు జలాశయాల్లో ఆనవాళ్లు ⇒బల్క్‌డ్రగ్, ఫార్మా, ఇంటర్మీడియెట్ కంపెనీల వ్యర్థాలే కారణం... ⇒మానవ శరీరంలోకి సూపర్ బగ్ ప్రవేశిస్తే ముప్పే.. గ్రేటర్‌లోని మూసీ పరివాహక ప్రాంతాలు... కాలుష్య పరిశ్రమల పరిధిలోని జలయాశయాల్లో ప్రమాదకర ‘సూపర్ బగ్ బ్యాక్టీరియా’ ఆనవాళ్లు కన్పించడంతో సిటీజనుల్లో భయాందోళన వ్యక్తమవుతోంది. యాంటీ బయాటిక్స్కూ లొంగని ఈ బ్యాక్టీరియా మానవ శరీరంలోకిప్రవేశిస్తే తీవ్ర అనారోగ్యానికి గురవుతారని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. మహానగరానికి ఆనుకొని ఉన్న పలు పారిశ్రామిక వాడల్లోని జలాశయాలు, మూసీ కాలువలు, వివిధ నాలాల్లోకి బల్క్‌డ్రగ్, ఫార్మా, ఇంటర్మీడియెట్ కంపెనీలు వదులుతోన్న కాలుష్య ఉద్గారాల కారణం గానే సూపర్బగ్బ్యాక్టీరియా రూపాంతరం చెందడం ఆందోళన కలిగిస్తోంది. ఈ విషయం తాజాగా ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌సిస్టమ్స్’ అనే సంస్థతో కలిసి జర్మన్ పరిశోధకులు నగరంలో నిర్వహించిన పరిశోధనలో తేలింది. సిటీబ్యూరో: మహానగర పరిధిలో పలు పారిశ్రామిక వాడల్లోని జలాశయాలతోపాటు మూసీలోకి ప్రవేశిస్తున్న వివిధ నాలాల్లో ఇపుడు యాంటీబయాటిక్స్‌కు లొంగని సూపర్‌బగ్ బ్యాక్టీరియా రూపాంతరం చెందడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సూపర్ బగ్ వృద్ధిచెందిన నీళ్లను ప్రత్యక్షంగా, పరోక్షంగా తాకిన పక్షంలో మనుషుల్లోకి, పెంపుడు జంతువుల్లోకి ఈ బ్యాక్టీరియా ప్రవేశించి సాంక్రమిక వ్యాధులు, టైఫాయిడ్, జీర్ణకోశ వ్యాధులు, కామెర్లు వంటి రోగాల బారిన పడే ప్రమాదం పొంచిఉంది. అంతేకాదు ఈ సూపర్‌బగ్ బ్యాక్టీరియా మానవ దేహంలోకి ప్రవేశిస్తే ప్రస్తుతం మార్కెట్లో విరివిగా లభిస్తున్న యాంటీబయాటిక్స్(జీవనాశకాలు)కు కూడా దీనిపై ఏమాత్రం పనిచేయవని.. దీర్ఘకాలం పాటు ఆయా రోగాలతో సతమతమవ్వాల్సిందేనని వైద్య నిపుణులు స్పష్టంచేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. సూపర్‌బగ్ బ్యాక్టీరియా అంటే.. ఫార్మా, బల్క్‌డ్రగ్, ఇంటర్మీడియెట్ కంపెనీలు వివిధ నాలాలు, స్థానిక చెరువుల్లోకి వదిలిపెడుతున్న ఉద్గారాలను బ్యాక్టీరియా గ్రహించి...దీర్ఘకాలంలో ‘ఎక్స్టెండెడ్–స్పెక్ట్రమ్ బెటా–ల్యాక్టమీస్’, ‘కార్భపెనిమేజ్’ వంటి ఎంజైమ్‌లు ఉత్పత్తి చేస్తుంది. దీంతో అది యాంటీబయాటిక్స్‌కు లొంగని మొండి బ్యాక్టీరియా (సూపర్ బగ్)గా రూపాంతరం చెందుతుందని తేలింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్సిస్టమ్స్తో కలిసి..జర్మనీలోని లీపెగ్ వర్సిటీ పరిశోధకులు నగరంలో 28 ప్రాంతాల్లో నీటినమూనాలను సేకరించి పరిశోధించగా ఈ విషయం వెలుగుచూసింది. ఈ బ్యాక్టీరియాపై యాంటీబయాటిక్స్ అంతగా పనిచేయవని.. పలు రకాల మందులకు లొంగని రీతిలో వాటిల్లో నిరోధకత వృద్ధిచెందిందని ఈ పరిశీలనలో తేలడం గమనార్హం. ప్రధానంగా ఫార్మా కంపెనీల నుంచి వెలువడుతోన్న కాలుష్య ఉద్గారాల్లో మోక్సిఫ్లాక్సాసిన్, వెరికొనాజోల్ వంటి కాలుష్యకారకాలు అధికంగా ఉండడం..వీటిని క్రమంగా గ్రహిస్తున్న సాధారణ బ్యాక్టీరియా ఈ మందులకు అలవాటుపడి వాటిల్లో నిరోధకత వృద్ధిచెందడంతో సూపర్‌బగ్‌గా రూపాంతరం చెందిందని విశ్లేషించారు. ఈ ప్రాంతాల్లోనే అధికం... జీడిమెట్ల, బాలానగర్, కుత్భల్లాపూర్, బొల్లారం, పటాన్చెరు, పాశమైలారం, మియాపూర్, కాప్రా, మల్కాజ్గిరి, సూరారం, నాచారం, కాటేదాన్, నాగోల్, ఉప్పల్, బొంతపల్లి, ఖాజిపల్లి, చర్లపల్లి తదితర ప్రాంతాలు.