సూపర్ బగ్ కలకలం!
⇒గ్రేటర్‌లో ‘మొండి బ్యాక్టీరియా’ వ్యాప్తి
⇒మూసీ సహా పారిశ్రామిక వాడల్లోని పలు జలాశయాల్లో ఆనవాళ్లు
⇒బల్క్‌డ్రగ్, ఫార్మా, ఇంటర్మీడియెట్ కంపెనీల వ్యర్థాలే కారణం...
⇒మానవ శరీరంలోకి సూపర్ బగ్ ప్రవేశిస్తే ముప్పే..
గ్రేటర్‌లోని మూసీ పరివాహక ప్రాంతాలు... కాలుష్య పరిశ్రమల పరిధిలోని జలయాశయాల్లో ప్రమాదకర ‘సూపర్ బగ్ బ్యాక్టీరియా’ ఆనవాళ్లు కన్పించడంతో సిటీజనుల్లో భయాందోళన వ్యక్తమవుతోంది. యాంటీ బయాటిక్స్‌కూ లొంగని ఈ బ్యాక్టీరియా మానవ శరీరంలోకిప్రవేశిస్తే తీవ్ర అనారోగ్యానికి గురవుతారని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. మహానగరానికి ఆనుకొని ఉన్న పలు పారిశ్రామిక వాడల్లోని జలాశయాలు, మూసీ కాలువలు, వివిధ నాలాల్లోకి బల్క్‌డ్రగ్, ఫార్మా, ఇంటర్మీడియెట్ కంపెనీలు వదులుతోన్న కాలుష్య ఉద్గారాల కారణం గానే సూపర్‌బగ్‌బ్యాక్టీరియా రూపాంతరం చెందడం ఆందోళన కలిగిస్తోంది. ఈ విషయం తాజాగా ‘ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌సిస్టమ్స్’ అనే సంస్థతో కలిసి జర్మన్ పరిశోధకులు నగరంలో నిర్వహించిన పరిశోధనలో తేలింది.
సిటీబ్యూరో: మహానగర పరిధిలో పలు పారిశ్రామిక వాడల్లోని జలాశయాలతోపాటు మూసీలోకి ప్రవేశిస్తున్న వివిధ నాలాల్లో ఇపుడు యాంటీబయాటిక్స్‌కు లొంగని సూపర్‌బగ్ బ్యాక్టీరియా రూపాంతరం చెందడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సూపర్ బగ్ వృద్ధిచెందిన నీళ్లను ప్రత్యక్షంగా, పరోక్షంగా తాకిన పక్షంలో మనుషుల్లోకి, పెంపుడు జంతువుల్లోకి ఈ బ్యాక్టీరియా ప్రవేశించి సాంక్రమిక వ్యాధులు, టైఫాయిడ్, జీర్ణకోశ వ్యాధులు, కామెర్లు వంటి రోగాల బారిన పడే ప్రమాదం పొంచిఉంది. అంతేకాదు ఈ సూపర్‌బగ్ బ్యాక్టీరియా మానవ దేహంలోకి ప్రవేశిస్తే ప్రస్తుతం మార్కెట్లో విరివిగా లభిస్తున్న యాంటీబయాటిక్స్(జీవనాశకాలు)కు కూడా దీనిపై ఏమాత్రం పనిచేయవని.. దీర్ఘకాలం పాటు ఆయా రోగాలతో సతమతమవ్వాల్సిందేనని వైద్య నిపుణులు స్పష్టంచేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.
సూపర్‌బగ్ బ్యాక్టీరియా అంటే..
ఫార్మా, బల్క్‌డ్రగ్, ఇంటర్మీడియెట్ కంపెనీలు వివిధ నాలాలు, స్థానిక చెరువుల్లోకి వదిలిపెడుతున్న ఉద్గారాలను బ్యాక్టీరియా గ్రహించి...దీర్ఘకాలంలో ‘ఎక్స్‌టెండెడ్–స్పెక్ట్రమ్ బెటా–ల్యాక్టమీస్’, ‘కార్భపెనిమేజ్’ వంటి ఎంజైమ్‌లు ఉత్పత్తి చేస్తుంది. దీంతో అది యాంటీబయాటిక్స్‌కు లొంగని మొండి బ్యాక్టీరియా (సూపర్ బగ్)గా రూపాంతరం చెందుతుందని తేలింది. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌సిస్టమ్స్‌తో కలిసి..జర్మనీలోని లీపెగ్ వర్సిటీ పరిశోధకులు నగరంలో 28 ప్రాంతాల్లో నీటినమూనాలను సేకరించి పరిశోధించగా ఈ విషయం వెలుగుచూసింది. ఈ బ్యాక్టీరియాపై యాంటీబయాటిక్స్ అంతగా పనిచేయవని.. పలు రకాల మందులకు లొంగని రీతిలో వాటిల్లో నిరోధకత వృద్ధిచెందిందని ఈ పరిశీలనలో తేలడం గమనార్హం. ప్రధానంగా ఫార్మా కంపెనీల నుంచి వెలువడుతోన్న కాలుష్య ఉద్గారాల్లో మోక్సిఫ్లాక్సాసిన్, వెరికొనాజోల్ వంటి కాలుష్యకారకాలు అధికంగా ఉండడం..వీటిని క్రమంగా గ్రహిస్తున్న సాధారణ బ్యాక్టీరియా ఈ మందులకు అలవాటుపడి వాటిల్లో నిరోధకత వృద్ధిచెందడంతో సూపర్‌బగ్‌గా రూపాంతరం చెందిందని విశ్లేషించారు.
ఈ ప్రాంతాల్లోనే అధికం...
జీడిమెట్ల, బాలానగర్, కుత్భల్లాపూర్, బొల్లారం, పటాన్‌చెరు, పాశమైలారం, మియాపూర్, కాప్రా, మల్కాజ్‌గిరి, సూరారం, నాచారం, కాటేదాన్, నాగోల్, ఉప్పల్, బొంతపల్లి, ఖాజిపల్లి, చర్లపల్లి తదితర ప్రాంతాలు.