bullet proof bus
-
సీఎం కోసం అదనంగా బుల్లెట్ ప్రూఫ్ బస్సు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భద్రత విషయంలో పోలీస్ శాఖ మరింత పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. ఇటీవల తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్, మావోయిస్టు పార్టీ హెచ్చరికల నేపథ్యంలో ఇంటెలిజెన్స్ విభాగం మరింత అప్రమత్తమైంది. ఎన్నికలు సమీపిస్తుండడం, జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నట్లు కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో సీఎం పర్యటన కోసం అదనంగా మరో బుల్లెట్ ప్రూఫ్ బస్సును సమకూర్చాలని అధికారులు నిర్ణయించారు. సీఎం కోసం రూ.7 కోట్లతో త్వరలో కొత్త బుల్లెట్‌ప్రూఫ్ బస్సు తయారు చేయించనున్నారు. రెండు లేదా మూడు నెలల్లో కొత్త బస్సును సిద్ధం చేయించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇందుకోసం రవాణా శాఖ టెండర్లు పిలవనుంది. ఈ మేరకు బుల్లెట్‌ప్రూఫ్ బస్సు తయారీ కోసం సోమవారం సచివాలయంలో రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ అత్యవసర సమావేశం నిర్వహించారు. బస్సు తయారీ, సంబంధిత కొనుగోలు కోసం 8 మంది అధికారులతో కూడిన కమిటీ ఏర్పాటు చేశారు. కొత్త బస్సు కోసం అవసరమైన అన్ని హంగులతో జీఏడీకి ప్రతిపాదనలు పంపాలని కమిటీ నిర్ణయించినట్టు తెలిసింది. బస్సు రూపకల్పనలో పాటించాల్సిన ప్రమాణాలు, పొందుపరచాల్సిన సాంకేతిక పరిజ్ఞానం, వాహనంలో ఏర్పాటు చేయాల్సిన ప్రత్యేక భద్రతా పరికరాలను ప్రతిపాదించడానికి 8 మంది సభ్యులు సూచనలు చేయనున్నారు. కమిటీ మెంబర్ కన్వీనర్‌గా ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ వ్యవహరించనున్నారు. సభ్యులుగా హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది, ఆర్టీసీ ఎం.డి. రమణారావు, ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఓఎస్డీ ఎంకే సింగ్, టెక్నికల్ ఎక్స్‌ఫర్ట్, డీఐజీ శ్రీనివాస్‌రావు, ప్రొటోకాల్ అధికారి అర్విందర్ సింగ్, రవాణా శాఖ కమిషనర్ ఉంటారు. -
చంద్రబాబు బుల్లెట్ ప్రూఫ్ బస్సుకు నిధులు విడుదల
హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాలు, మారుమూల ప్రాంతాల్లో పర్యటించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన బుల్లెట్ ప్రూఫ్ బస్సుని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. రూ.5.05 కోట్ల అంచనా వ్యయంతో చండీగఢ్‌కు చెందిన జేసీబీఎల్ సంస్థ నుంచి ఈ బస్సు కొనుగోలు నిమిత్తం తుది విడతగా రూ.కోటి ఇరవై ఆరు లక్షలను విడుదల చేస్తూ ప్రభుత్వ కార్యదర్శి శశిభూషన్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే వాయిదాల్లో రూ.రెండున్నర కోట్లు విడుదల చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
ఒక్క రోజుకే ‘షెడ్డు’కు..!
* రూ. 5 కోట్ల బుల్లెట్ ప్రూఫ్ బస్సుపై సీఎం అసంతృప్తి * హరితహారానికి గుర్తుగా ఆకులు, పూల బొమ్మలులేవని పెదవి విరుపు * పథకాల సీడీ పెట్టినా పనిచేయని సౌండ్‌సిస్టం * జేసీబీఎల్ కంపెనీ వర్క్‌షాపునకు తరలింపు * ఖాళీ సీడీ పెట్టారని తేల్చిన అక్కడి ఇంజనీర్లు * అవగాహన ఉన్న సిబ్బందిని పెట్టాలని సూచన సాక్షి, హైదరాబాద్: ఎన్నో హంగులు.. ప్రత్యేకతలతో మెర్సిడెస్ బెంజ్ రూపొందించిన బుల్లెట్ ప్రూఫ్ బస్సు ఒక్క రోజుకే ‘షెడ్డు’కు చేరింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్ల ఖర్చుతో కొనుగోలు చేసిన ఈ బస్సులోని ఏర్పాట్లపై సీఎం పెదవి విరిచారు. దీంతో వాటిని సరిదిద్దేందుకు ఆర్టీసీ అధికారులు వెంటనే బస్సును.. దాని బాడీ రూపొందించిన జేసీబీఎల్ కంపెనీకి అప్పగించారు. ఫలితంగా శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ బస్సులో కాక తన బుల్లెట్ ప్రూఫ్ కారులోనే వెళ్లారు. శుక్రవారం హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు కేసీఆర్ ఈ బస్సులోనే వెళ్లారు. ఆరోజు ఉదయం యాదాద్రి ఆలయం వద్ద బస్సుకు పూజలు చేయించి తీసుకొచ్చాక ముఖ్యమంత్రి పర్యటన మొదలైంది. ఆ సందర్భంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సీడీని ప్లే చేయగా పాట రాలేదు. అర కిలోమీటర్ దూరం వరకు వినిపించే శక్తివంతమైన సౌండ్ సిస్టం ఏర్పాటు చేసిన బస్సులో సాధారణ సీడీ ప్లే కాకపోవటంతో ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే తెలుపు రంగులో ఉన్న బస్సు బాడీపై ఆకుపచ్చ రంగు స్ట్రైప్ ఏర్పాటు చేశారు. హరితహారానికి సరిపోయేలా ఆ స్ట్రైప్‌పై ఆకులు, పూల బొమ్మలు ఉండాల్సిందని, అవి లేక పేలవంగా ఉందని సీఎం పెదవి విరిచారు. దీంతో ఆర్టీసీ అధికారులు దాన్ని జేసీబీఎల్ వర్క్‌షాపునకు తరలించారు. అయితే బస్సులోని ఆడియో వ్యవస్థ బాగానే ఉందని అక్కడి ఇంజనీర్లు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి సమక్షంలో వినియోగించిన సీడీ ఖాళీగా ఉందని, అందులో పాటలు లేకపోవటం వల్లే పనిచేయలేదని గుర్తించారు. బస్సులోని ఆధునిక వ్యవస్థపై అవగాహన లేకపోవటంతో సిబ్బంది సరిగా వ్యవహరించలేదని వారు పేర్కొన్నట్టు తెలిసింది. అవగాహన ఉన్న వ్యక్తిని కొద్దిరోజుల పాటు బస్సులో ఉంచాలని, లేకుంటే కొత్తవారికి దాని వివరాలు తెలియక లోపాలున్నట్టు భ్రమపడే అవకాశం ఉందని చెప్పారు. ఇక బస్సు వెలుపల ఆకుపచ్చ రంగు స్ట్రైప్‌పై పూలు, ఆకుల స్టిక్కర్లను అప్పటికప్పుడు అతికించారు. ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనకు బస్సును అందజేయనున్నట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. -
సీఎంకు రూ. 5.50 కోట్లతో బుల్లెట్ ప్రూఫ్ బస్సు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటన సందర్భంగా మారు మూల ప్రాంతాలకు వెళ్లేందుకు వీలుగా రూ.5.50 కోట్ల వ్యయంతో బుల్లెట్ ప్రూఫ్ బస్సును కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి సాధారణ పరిపాలన శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. ముఖ్యమంత్రితో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రయాణించేందుకు వీలుగా సకల సౌకర్యాలతో ఈ బస్సును రూపొందించనున్నారు. ఈ బస్సు కొనుగోలు బాధ్యతను ఆర్టీసీకి అప్పగించారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మూడు కాన్వాయ్‌లలో 35 వాహనాలున్నాయి. దీనికోసం రూ.పది కోట్లు వెచ్చించిన విషయం తెలిసిందే. ఒక కాన్వాయ్ హైదరాబాద్‌లోను, మరో కాన్వాయ్ విజయవాడలోను, ఇంకో కాన్వాయ్ తిరుపతిలోను అందుబాటులో ఉంటాయి. -
చంద్రబాబుకు బుల్లెట్ ప్రూఫ్ బస్సు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాల పర్యటనలో భాగంగా మారుమూల ప్రాంతాలకు వెళ్లేందుకు వీలుగా రూ.5.50 కోట్ల వ్యయంతో బుల్లెట్ ప్రూఫ్ బస్సును కొనుగోలు చేయాలని శనివారం నిర్ణయించారు. ఇందుకు సంబంధించి సాధారణ పరిపాలనశాఖ ప్రతిపాదనలను రూపొందించింది. ముఖ్యమంత్రితో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రయాణించేందుకు వీలుగా సకల సౌకర్యాలతో బుల్లెట్ ప్రూఫ్ తో ఈ బస్సును రూపొందించనున్నారని సమాచారం.