మంత్రి రామన్నకు బుల్లెట్‌ప్రూఫ్ వాహనం
ఆదిలాబాద్ క్రైం : జిల్లాలో ఇటీవల రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగురామన్న మావోయిస్టు ప్రాబల్యం ఉన్న మారుమూల గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యల్లో భాగంగా మంత్రికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించింది. జిల్లాలో రెండు నెలల కాలంలో రెండుమార్లు మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. దీంతో జిల్లాకు చెందిన మంత్రి జోగురామన్న ప్రస్తుతం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మారుమూల ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆయనకు ముందస్తు భద్రత కల్పించేందుకు ఈ వాహనం కేటాయించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతోపాటు డిప్యూటీ సీఎంలు రాజయ్య, మహుముద్‌అలీ, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావుకు మాత్రమే ఇప్పటివరకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కేటాయించారు. తాజాగా మంత్రి జోగురామన్నకు సైతం ఈ వాహనం కేటాయించడంతో బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఉపయోగిస్తున్న వారి సంఖ్య ఐదుకు చేరుకుంది.
జిల్లాలో నక్సల్స్ ప్రభావం..
రాష్ట్రంలో ఆదిలాబాద్ మావోయిస్టు ప్రాబల్యం గల జిల్లాగా గుర్తింపు పొందింది. ఇదీకాక ఇటీవల జిల్లాలో మావోయిస్టు కదలికలు పెరిగాయి. దీనికితోడు రెండుమార్లు మావోయిస్టులకు, పోలీసులకు జరిగిన ఎదురుకాల్పులను దృష్టిలో ఉంచుకొని మంత్రికి ముప్పు లేకుండా ఉండేందుకు ఈ ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. జిల్లాలో సిర్పూర్, వాంకిడి, బెజ్జూర్, దహెగాం, తిర్యాణి, నెన్నెల, కోటపల్లి, నీల్వాయి, భీమిని, చెన్నూర్ వంటి ప్రాంతాల్లో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ప్రస్తుతం కొమురం భీమ్ పురిటిగడ్డ జోడేఘాట్‌ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో ఈ ప్రాంతాల్లో మంత్రి పర్యటన ఉంటే భద్రతాపరంగా సమస్యలు తలెత్తకుండా పోలీసు శాఖ చర్యలు తీసుకుంటోంది. మావోయిస్టులను దీటుగా ఎదుర్కోవాలంటే ముందుగా ప్రజాప్రతినిధుల రక్షణ తప్పనిసరి. ప్రస్తుతం మంత్రి జోగురామన్నకు ఎనిమిది గన్మెన్లతోపాటు, ఎనిమిది ఎస్కాడ్లు, 8 మంది భద్రతా సిబ్బంది భద్రతా కల్పిస్తున్నారు. ఆయన పర్యటనకు వెళ్లే ప్రాంతంలో అదనంగా మరికొంత మంది పోలీసు బలగాలను ముందస్తుగా ఏర్పాటు చేస్తున్నారు.
మారుమూల ప్రాంతాల్లోకి..
గతంలో జిల్లా నుంచి ఎవరికీ మంత్రి పదవి లేకపోవడంతో, ఇతర జిల్లా ప్రజాప్రతినిధులకు ఆ పదవిని కేటాయించేవారు. వారు అడపాదడపా జిల్లాలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చే వారు. ఎప్పుడో ఒక్కప్పుడు వచ్చే మంత్రికి భద్రతా కల్పించడం పోలీసులకు సులువుగా ఉండేది. అది కూడా వారు జిల్లా కేంద్రంలో లేదా పట్టణ కేంద్రాల్లో మాత్రమే పర్యటించే వారు. ప్రస్తుతం మన జిల్లాకు చెందిన రామన్నకే మంత్రి పదవి లభించడంతో జిల్లాలో ఏ మూలన జరిగే అభివృద్ధి కార్యక్రమానికైనా ఆయన హాజరు కావాల్సి వస్తోంది. మావోయిస్టు ప్రభావం తీవ్రంగా ఉన్న సిర్పూర్, కాగజ్‌నగర్, జోడేఘాట్, ఇంద్రవెల్లి, తదితర ప్రాంతాల్లో పర్యటిస్తున్న నేపథ్యంలో ఈ వాహనం కేటాయించారు.